విజయం విరాట్ కోహ్లీకి.. ప్రశంసలు అనుష్కకు!

  • 17 ఫిబ్రవరి 2018
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ Image copyright Reuters

మ్యాచ్‌లు : 6

సగటు స్కోరు : 186

పరుగులు : 558

సెంచరీలు : 3

ఇవీ దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి 'ఘనాం'కాలు!

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ మొట్టమొదటి సారి వన్డే సిరీస్ గెల్చుకొని చరిత్ర సృష్టించడంలో విరాట్ కోహ్లి పాత్ర ఎంత కీలకమో పై గణాంకాలే సాక్ష్యం.

ఈ సిరీస్‌లో పరుగులు చేయడంలో విరాట్ కోహ్లి ఎంతగా ఆధిక్యాన్ని కనబర్చాడంటే రెండో స్థానంలో ఉన్న శిఖర్ ధవన్‌కూ, తనకు మధ్య వ్యత్యాసం 235 పరుగులు.

ఆరు మ్యాచ్‌లలో కలిపి శిఖర్ 323 పరుగులు చేశాడు.

Image copyright Reuters

కోహ్లి మనసులో మాట

చివరి వన్డేలో గెలుపు సాధించిన తర్వాత, కామెంటేటర్స్ దగ్గర నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకూ అందరూ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' కోహ్లిపై ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే, ఆయన మాత్రం తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు క్రెడిట్ ఇచ్చాడు.

సెంచూరియన్ వన్డే తర్వాత కోహ్లి మాట్లాడుతూ, "గ్రౌండ్ బయటి నుంచి సహకారం అందించిన వారికి కూడా క్రెడిట్ దక్కాల్సిందే. నా భార్య నా మనోస్థైర్యాన్ని పెంచింది. అందుకు గాను ఆమెకు ప్రశంసలు దక్కాల్సిందే. గతంలో ఆమెపై బాగా విమర్శలొచ్చాయి. ఈ టూర్‌లో పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. అయితే ఆమె నన్ను ఎల్లప్పుడూ ముందడుగు వేసేలా ప్రేరణనిచ్చింది. ఆమెకు నా ధన్యవాదాలు" అని అన్నాడు.

అనుష్కతో వివాహం తర్వాత విరాట్ కోహ్లికి ఇది మొట్టమొదటి విదేశీ పర్యటన.

Image copyright AFP

సవాలు కఠినమైందే

అయితే దక్షిణాఫ్రికాలో కోహ్లి సేన ప్రయాణం నల్లేరుపై బండి నడకలా ఏమీ సాగలేదు. టెస్ట్ సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.

మొదటి రెండు టెస్ట్ మ్యాచుల్లో ఓటమి తర్వాత కెప్టెన్‌గా అతని నిర్ణయాలపై పలు సందేహాలు కూడా విమర్శకులు లేవనెత్తారు.

అంతేకాదు, దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఇండియా ఎన్నడూ వన్డే సిరీస్‌ను గెల్చుకోలేదని చరిత్ర తెగేసి చెబుతోంది. కానీ కోహ్లి మాత్రం చరిత్రను తిరగరాయాలనే పట్టు బట్టినట్టున్నాడు.

ఆయన ముందు నిలబడి టీంకు నేతృత్వం వహించాడు. ఈ సిరీస్‌లో ఆయన బ్యాట్ నుంచి వెలువడ్డ మూడు శతకాల్లో మొదటిది డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో నమోదైంది.

112 పరుగులు చేసిన కోహ్లి టీంకు విజయాన్ని అందించడమే కాదు, దక్షిణాఫ్రికా పట్ల జట్టు సభ్యుల మనుసుల్లో నెలకొన్న భయాలను కూడా పటాపంచలు చేశాడు.

సిరీస్ ప్రారంభంలో వన్డే ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పుడు టాప్‌కు చేరుకుంది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తున్న కొద్ది టీం ర్యాంకింగ్ మెరుగవుతూ వచ్చింది.

Image copyright AFP

కెప్టెన్‌కు కోచ్ ప్రశంసలు

దక్షిణాఫ్రికాలో విజయం సాధించి చరిత్ర సృష్టించడంలో క్రెడిట్ విరాట్ కోహ్లికే దక్కుతుందని కోచ్ రవిశాస్త్రి అన్నారు.

"కెప్టెన్‌కే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన ఇంటెన్సిటీ లెవల్ చాలా ఉన్నతంగా ఉంది. అతన్ని చూస్తే మిగతా ఆటగాళ్లకు కూడా ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలన్న ప్రేరణ లభిస్తుంది" అని రవి అన్నారు.

తన పర్‌ఫార్మెన్స్ పట్ల కోహ్లి కూడా సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఈ విజయానికి క్రెడిట్ మొత్తం జట్టుకు దక్కుతుందని అన్నాడు.

"ప్రదర్శనలో ఎప్పుడూ నేను ముందు నిలబడి నేతృత్వం వహించాలని అనుకుంటాను. మొత్తం టీం కష్టపడింది. అందుకే సిరీస్‌ను 5-1 ఆధిక్యంతో గెల్చుకున్నాం. ఇదో గొప్ప అనుభవం" అని విరాట్ అన్నాడు.

Image copyright AFP

సరైన నిర్ణయాలు, సత్ఫలితాలు

టెస్ట్ సిరీస్‌కు భిన్నంగా వన్డే సిరీస్‌లో కోహ్లి నాయకత్వ తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయన సరైన టీంను ఎన్నుకున్నాడు. బౌలర్లను సరైన పద్ధతిలో ఉపయోగించాడు.

అనుభవజ్ఞుడైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కూడా ఆయనకు చాలా మద్దతు లభించింది.

భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్‌లు ఇద్దరూ కెప్టెన్ తమపై పెట్టుకున్న ఆశల్ని నిలబెట్టడమే కాదు, ఇప్పుడు వారిద్దరూ నవతరం భారతీయ స్పిన్ స్టార్లుగా అవతరించారు.

ఆరు మ్యాచ్‌లలో 13.88 సగటుతో కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు తీసుకున్నాడు. సిరీస్‌లో అతడే మేటి బౌలర్‌గా నిలిచాడు.

యుజువేంద్ర చహల్ ఆయనకన్నా ఓ మెట్టు మాత్రమే కింద నిలుస్తూ, 16.37 సగటుతో 16 వికెట్లు దక్కించుకున్నాడు.

అందుకే మరి, కెప్టెన్ విరాట్ కోహ్లి తన బౌలర్లను ప్రశంసల్లో ముంచెత్తాడు.

"ఈ ఇద్దరు మణికట్టు మాంత్రికులు అద్భుతంగా రాణించారు. వాళ్లిద్దరూ దక్షిణాఫ్రికాలో తొలిసారి ఆడారు. ఎంతో సాహసం కనబర్చారు. అందుకే వారికి వికెట్లు దక్కాయి" అని కోహ్లి అన్నాడు.

Image copyright AFP

కోహ్లి ఉన్నాడు జాగ్రత్త!

తాజా వన్డే సిరీస్‌లో నిరుపమాన విజయం సాధించిన తర్వాత కోహ్లి ఇప్పుడు మంచి మూడ్‌లో ఉన్నట్టు కనిపించాడు. భవిష్యత్తులోనూ ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలను వ్యక్తం చేశాడు.

"నా కెరీర్‌లో ఇంకా బహుశా ఎనిమిది లేదా తొమ్మిదేళ్ల సమయం మిగిలింది. ఒక క్రికెటర్ కెరీర్ చాలా సుదీర్ఘంగా ఏమీ ఉండదు. నేను ఇందులో వీలైనంత ఎక్కువగా సాధించాలని కోరుకుంటున్నా. దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించడం కన్నా మించిన గౌరవం మరొకటి ఏదీ ఉండదు. దీనిని నేను తేలిగ్గా తీసుకుంటే నాకు ఇప్పటి వరకు లభించిన గౌరవానికి న్యాయం చేసినట్టు అవదు" అని కోహ్లి అన్నాడు.

అంటే ఇకపై తన ప్రత్యర్థి టీంలకూ, బౌలర్లకు ఊరటనిచ్చే ప్రసక్తే లేదనే సంకేతాలిస్తున్నాడు విరాట్ కోహ్లి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?