#HerChoice: నాకు వైకల్యం ఉంది, తనకు లేదు.. మేం సహజీవనం చేస్తున్నాం

  • 18 ఫిబ్రవరి 2018
ఇల్లస్ట్రేషన్ చిత్రం

నాకు ఒక చేయి లేదనే విషయాన్నే తను ఒక్కోసారి మరిచిపోతుంటారు. మంచి కాయపుష్టితో కనిపించే అతణ్ని చూస్తే ఏ అమ్మాయైనా పడిపోతుంది. కానీ, తను మాత్రం నాతోనే ఉన్నారు. పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ మేం సహజీవనం చేయడం ప్రారంభించి ఏడాదైంది.

పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. నాకు 26 ఏళ్లు దాటడంతో పెళ్లి కోసం అమ్మ ఒకటే పోరుపెడుతుండేది. దాంతో మ్యాట్రిమోనియల్ సైట్‌లో నా వ్యక్తిగత వివరాలు నమోదు చేశా. అప్పుడే ఆయన పరిచయమయ్యారు.

చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో నా ఎడమ చేతిని కోల్పోయాను. అందుకే నా పట్ల అమ్మకున్న ఆత్రుతను అర్థం చేసుకోగలను. ఒక రోజు మ్యాటిమోనియల్ సైట్‌ నుంచి నాకు అభ్యర్థన వచ్చింది. బెంగాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతను.

కానీ, ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను. ఇంకా పెళ్లికి నేను సిద్ధంగా లేనని అతనికి రిప్లై ఇచ్చాను. 'మరేం ఫర్వాలేదు. మనం మాట్లాడుకోవచ్చు కదా' అని తను సమాధానం ఇచ్చారు.


#హర్‌చాయిస్-12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల గురించి వివరిస్తూ, మన భావనల పరిధిని విస్తృతం చేస్తాయి.


అతను మోసం చేయొచ్చేమోనని నా రూంమేట్స్ భయపెట్టారు. నాకు కూడా అబ్బాయిలతో రెండు చేదు అనుభవాలున్నాయి. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురు కావొద్దని అనుకున్నా. అసలు మళ్లీ ఇంకో రిలేషన్‌షిప్‌కు నేను సిద్ధంగానే లేను.

అలాగని ఒంటరిగానే జీవితాంతం ఉండాలని అనుకోవడం లేదు. అందుకే అతనితో మాట్లాడుతూనే ఉన్నా. తన పేరును మొబైల్‌లో 'టైం పాస్' అని సేవ్ చేసుకున్నా. అయితే, మేం కలుసుకోవాలని ఒక రోజు నిర్ణయించుకున్నాం.

నాకు ఒక చేయి లేదని అతనికి గతంలోనే చెప్పా. కానీ, అతణ్ని కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒకటే ఆందోళన. నన్ను చూశాక ఎలా ప్రతిస్పందిస్తాడోనని భయం. ఫిబ్రవరిలోని చలిగా ఉన్న ఓ సమయంలో మేం కలుసుకున్నాం.

రోడ్డు పక్కన నడుచుకుంటూ మాట్లాడుకున్నాం. మా ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒకటేనని అర్థమైంది. నెమ్మదిగా మేం స్నేహితులుగా మారాం. తను చాలా నెమ్మదస్తుడు. నా మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.

ఇంటికి క్షేమంగా వెళ్లానా లేదా అని కనుక్కుంటారు. ఒక్కోసారి తనకు బాగా ఆలస్యమైనా నన్ను రూం వరకు వచ్చి దిగబెడతారు. నేను మంచి భార్యను అవుతానో కాదో తెలియదు కానీ, తనకు మాత్రం మంచి భర్తకు ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నాయి.

మా రిలేషన్‌షిప్ ఎక్కడికి వెళుతుందో తెలియదు. కానీ, మా సహజీవనం ఇద్దరికీ ఉత్సాహాన్నిచ్చింది.

నేను అనారోగ్యానికి గురైనప్పుడు తనే మందులు తీసుకొచ్చారు. చేతితో అన్నం తినిపించారు. తొలిసారి నన్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. నిజంగా అది నాకు అద్భుతమైన రోజు.

ఆ తర్వాత కొన్ని రోజులకు మేం నడుచుకుంటూ వెళుతున్నాం. అప్పుడు మా చేతులు కలిసి ఉన్నాయి. నా కుడి చేయి, అతని ఎడమ చేయి.

కొన్నాళ్లకు నా రూంమేట్స్‌కు పెళ్లైంది. నేను ఒక్కదాన్నే ఆ రూంకు అద్దె చెల్లించడం భారంగా మారింది. అదే సమయంలో తన రూం పక్కన మరో గది ఖాళీ అయిందని తెలిసింది. నేను ఆ గదిలోకి మారాను. నిజం చెప్పాలంటే మేం కలిసి ఉండటానికి చేసుకున్న వెసులుబాటు అది.

బయటవారి దృష్టిలో మాత్రం మేం వేర్వేరు ఇళ్లలో ఉన్నట్లే. అయితే, అమ్మ నా రూంకు వచ్చినప్పుడు మేం కలిసే ఉంటున్నట్లు గ్రహించింది.

ఇప్పుడు మేం ఒకరికొకరం మరింత సన్నిహితంగా ఉంటున్నాం. ఎలాంటి ఇబ్బందీ లేకుండా నేను అన్ని పనులను ఒంటిచేత్తో చేయడం చూసి అతనికి ఉన్న భయాలు కూడా పోయాయి.

తర్వాత కొన్నాళ్లకు మా ఉద్యోగాలు మారాయి. ఇంటిని కూడా మార్చాం. మేం పెళ్లికి సిద్ధమయ్యాం.

రిలేషన్‌షిప్ అంటే లైంగిక వాంఛలను తీర్చుకోవడమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కలిసి ఉండేలా నమ్మకాన్ని పెంపొందించుకోవడం, మన జీవితాన్ని మరొకరితో సన్నిహితంగా పంచుకోవడమని మాకు తెలుసు. మన కోర్టులు కూడా రిలేషన్‌షిప్‌ను గుర్తించాయి.

అతనికి వంట చేయడం తెలియదు. నేను ఎలా వంట చేస్తానో కూడా తెలియదు. కానీ, నెమ్మదిగా నేను అన్నీ నేర్చుకున్నా. ఒక మంచి భార్యగా ఉండగలననే నమ్మకాన్ని అతనిలో కలిగించా.

కానీ, వాళ్లింట్లో అతనొక్కడే అబ్బాయి. నా గురించి ఇంట్లో చెప్పినప్పుడు "అలాంటి అమ్మాయితో స్నేహం వరకు ఫర్వాలేదు. కానీ పెళ్లి గురించి మర్చిపో" అని వాళ్ల అమ్మ చెప్పిందట.

వైకల్యం ఉన్నవారిని చూసి అందరూ ఇలా ఎందుకు ఊహించుకుంటారు? నేను భారంగా మారతానని ఎందుకు అనుకుంటారు? వైకల్యం ఉన్నంత మాత్రాన జీవితంతో రాజీపడాలా? నా అభిరుచులను చంపుకోవాలా? ఒక మంచి భాగస్వామి కోసం నేను ఎందుకు ఆలోచించకూడదు?

నన్ను అర్థం చేసుకునే వ్యక్తి రావాలని అందరి అమ్మాయిల్లాగే నేను కలలుకంటా.

ఒక రోజు.. "మా ఇంట్లో వాళ్లతో మాట్లాడు" అని తను నాకు ఫోన్ ఇచ్చారు. కానీ, గతంలో వారు నిరాకరించిన అమ్మాయిని నేనే అని వారికి తెలియదు.

నాకు చేయి లేకపోయినా అందరి అమ్మాయిల్లాగా నేను అన్ని పనులూ చేయగలనని నిరూపించుకోవాల్సి వస్తుండేది.

ఆ రోజు వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చింది. ఒక సాధారణ భార్య చేయాల్సిన అన్ని పనులను నేను ఒంటిచేత్తో చేయడం వాళ్లు చూశారు.

దీంతో వాళ్ల భయాలు తొలగిపోయాయి. ఇప్పుడు మాకు పెళ్లై ఏడాదైంది. నా వైకల్యం సహజీవనానికి, పెళ్లికి అడ్డంకిగా ఏమీ మారలేదు.

ఇప్పుడు ఓ బిడ్డను సరిగ్గా పెంచగలనా అంటే దానికి సమాధానం కూడా నాలోనే ఉంది. ఒక మంచి తల్లిని అవ్వగలనని మొదట నన్ను నేను నమ్మితే నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా నమ్ముతారు.

(ఉత్తర భారత దేశానికి చెందిన ఒక మహిళ తన నిజ జీవిత గాథను బీబీసీ ప్రతినిధి ఇంద్రజీత్ కౌర్‌తో పంచుకోగా, సీనియర్ ప్రతినిధి దివ్య ఆర్య దీనిని అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ విజ్ఞప్తి మేరకు ఆమె పేరును రహస్యంగా ఉంచుతున్నాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు