ప్రెస్‌రివ్యూ: ఇవీ వర్మను పోలీసులు అడిగిన ప్రశ్నలు..

  • 18 ఫిబ్రవరి 2018
Image copyright Rgv/Twitter
చిత్రం శీర్షిక రాంగోపాల్ వర్మ

సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను సీసీఎస్ బృందం విచారించిన వార్తను 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది. వర్మను అడిగిన ప్రశ్నేమిటో ఆ కథనం పేర్కొంది.

మీరు జీఎస్టీ సినిమాను ఎక్కడ తీశారు? మాల్కోవాతో అభ్యంతరకర సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు?

మీ ట్విటర్‌లో పెట్టిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి? ఐటీ చట్టం ప్రకారం మహిళలను అభ్యంతరకరంగా చూపించడం నేరమే కదా!?

టీవీ చర్చల్లో వైజాగ్‌కు చెందిన దేవిపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి?

దేవితో మీరు పోర్న్‌ సినిమా తీస్తాననడం ఎంతవరకు సమంజసం? భారతీయ చట్టాలు ఈ సినిమాకు వర్తించవన్న మీ వాదనకు ఆధారాలు ఏమిటి?

సినిమాను అమెరికాలో తీశానంటున్నారు కదా! అక్కడి నుంచే అప్‌లోడ్‌ చేశామంటున్నారు కదా! అలా ఎలా తీశారు? సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కడిది? దానిని విమియో వెబ్‌సైట్‌కు ఎంతకు అమ్మారు?

మాల్కోవాకు డబ్బులు ఎవరు ఇచ్చారు? సినిమాకు వాడిన ఎక్విప్‌మెంట్‌ ఎక్కడిది?

అమెరికాలో మీకు ఎవరు డబ్బులిచ్చారు? విమియో వెబ్‌సైట్లో సినిమా ఎలా అప్‌లోడ్‌ అయింది?

Image copyright Telangana CMO

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పాతిక మంది ఔట్?

గత ఏడాదిన్నరగా తమ పార్టీ ఎమ్మెల్యేలపై సర్వేలు చేయిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారని 'సాక్షి' ఓ కథనాన్ని ప్రచురించింది.

పలు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే వ్యక్తిగతంగా పిలిపించుకుని హెచ్చరించిన ముఖ్యమంత్రి... కొంతకాలంగా సర్వే వివరాలను తానే స్వయంగా సమీక్షించుకుంటున్నారు.

కొందరిని హెచ్చరించినా ఫలితం లేదని గుర్తించిన ఆయన.. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

నాలుగు సర్వేలను సమీక్షించిన తరువాత పాతిక మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సీఎం కేసీఆర్‌ గుర్తించినట్లు తెలిసింది. అందులో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.

మంత్రుల్లో కొందరిని పార్లమెంట్‌కు పంపే ప్రతిపాదనను కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి చందూలాల్‌ స్థానంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్‌ ఇచ్చే అవకాశముంది. మరో ఐదుగురు మంత్రుల్లో ముగ్గురిని పార్లమెంట్‌కు పోటీ చేయించడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది.

మిగతా ఇద్దరు మంత్రులకు టికెట్లు ఇచ్చే విషయంలో తుది దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. అవసరమైతే వారిని ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోందని సాక్షి పేర్కొంది.

Image copyright APPSC WEBSITE
చిత్రం శీర్షిక ఏపీపీఎస్సీ కార్యాలయం

‘ఏపీలో ఉద్యోగం ఊసేదీ?’

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసే కనిపించడం లేదు. ఉద్యోగ ప్రకటనల జారీలో రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తోందని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

ప్రకటనల జారీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. దీంతో లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వివిధ శాఖల నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలపై ప్రాథమిక సమాచారం సాధారణ పరిపాలన, ఆర్థికశాఖ వద్ద సిద్ధంగా ఉన్నా.. తదుపరి చర్యలు మందకొడిగా సాగుతున్నాయి.

ఆయా శాఖల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఆగస్టు 2017 నాటికి ప్రత్యక్ష నియామకాల కింద 6,250, కార్పొరేషన్ల పరిధిలో 2,717, పోలీసు ఎగ్జిక్యూటివ్‌ కేడరులో 9,844, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 6,250, ఇతర చోట్ల కలిపి 27వేల ఖాళీల సమాచారం ప్రభుత్వంవద్ద ఉన్నట్లు తెలిసింది. వీటిలో ఎన్ని భర్తీ చేయాలి? నిధుల లభ్యత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారిక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రస్తుతం జాప్యం జరుగుతోంది.

గతేడాది డిసెంబరు 4వ తేదీ 34 సంవత్సరాల వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచుతూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇవి వెలువడి 2 నెలలు దాటినా... ఉద్యోగ ప్రకటనలు రానందున కొందరు దరఖాస్తు చేసేందుకూ అర్హత కోల్పోతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీపీఎస్సీ నుంచి సుమారు 4,500 ఉద్యోగ ఖాళీల భర్తీకి 2016లో 32, 2017లో 3 నోటిఫికేషన్లు వచ్చాయి. వీటిలో చాలా పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

గ్రూప్‌-1 (2011) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మౌఖిక పరీక్షలు వచ్చే వారంలో ముగియనున్నాయి. వెంటనే ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు. జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలను అనుసరించి తీసుకోవాల్సిన చర్యలు ముగింపునకు చేరుకోవడంతో ఏపీపీఎస్సీకి పని క్రమేణా తగ్గుతోందని ఈనాడు పేర్కొంది.

పవన్ Image copyright JanasenaParty
చిత్రం శీర్షిక పవన్

'కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలి'

విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదో తెలియడంలేదని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ అన్నారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

రాజీనామాల విషయమై ఎంపీలు ఏం కాలపరిమితి పెట్టుకున్నారో కూడా తెలియదన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తేల్చేందుకు ఏర్పాటైన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) రెండు రోజుల సమావేశం శనివారం ముగిసింది.

సమావేశం అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, సామాజిక వేత్త ప్రమోద్‌రెడ్డితో కలిసి పవన్‌ మీడియాతో మాట్లాడారు.

''హామీలు అమలు చేయనందునే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు... నవ్యాంధ్ర విషయంలోనూ అదే జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో చెప్పి... మభ్యపెట్టారు. రాష్ట్ర ఎంపీలు సరిగా పనిచేయకపోవడం వల్లే హోదా రాలేదు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు. కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడంలేదు'' అని పవన్‌ వ్యాఖ్యానించారు.

యూపీఏ హయాంలో కూడా ఎంపీలు సరిగా స్పందించలేకపోయారన్నారు. వ్యక్తిగత సమస్యలు, ఆశలు, అవకాశాలు దక్కవేమోనన్న భయంతో కేంద్రాన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం చేయలేదని ఆరోపించారు. దీనివల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతారేమో కానీ, ప్రజలు మాత్రం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)