త్రిపురలో మాణిక్ సర్కార్ వర్సెస్ మోదీ ‘సర్కార్’

  • 18 ఫిబ్రవరి 2018
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

ఆదివారం ఉదయం ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 60 శాసనసభ స్థానాలున్న త్రిపురలో పోటీ ఎవరి మధ్య అనేది ఇప్పటికే స్పష్టమైంది.

ఈసారి హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండేది.

అయితే, ఈసారి అధికారంలో ఉన్న వామపక్ష కూటమికి కొత్తగా బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.

ఎన్నికల ప్రచార వేళ రాష్ట్రంలో మార్పు రావాలంటూ నినదించిన బీజేపీ ఇప్పుడు వామపక్షాలకు ప్రధాన ప్రత్యర్థిగా మారింది.

బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత గురువారం ప్రధాని మోదీ రాష్ట్ర రాజధాని అగర్తలాతో పాటు, దక్షిణ త్రిపురలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

మోదీపైనే బీజేపీ ఆశలు

రాష్ట్రంలో ప్రధాని మోదీ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన కనిపించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎవరి పేరునూ ప్రతిపాదించలేదు.

ప్రధాని మోదీపై, ఆయన పాలనపై ప్రజలకున్న విశ్వాసంతోనే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ దిగ్గజాలంతా ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మాణిక్ 'సర్కార్'‌పై లెఫ్ట్ భరోసా

మచ్చలేని 25 ఏళ్ల పాలన, సచ్ఛీలుడిగా పేరున్న ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకమే తమను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెడుతుందని వామపక్షాలు నమ్ముతున్నాయి.

మాణిక్ సర్కార్ ఇమేజిని ఎదుర్కొనే వ్యక్తి రాష్ట్రంలోని ఏ పార్టీలోనూ కనిపించడం లేదు. దేశంలోని అత్యంత పేద సీఎంగా పేరున్న మాణిక్ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా మోదీ పాలనను తెరమీదకు తీసుకొచ్చింది.

మరోవైపు, బీజేపీ చెబుతున్న అభివృద్ధి, నిరుద్యోగం అంశాలపై విమర్శలు చేస్తూ మాణిక్ సర్కార్ ... ప్రచారంలో దూసుకెళ్లారు.

ప్రధాని మోదీ కూడా తన ర్యాలీలో భాగంగా మాణిక్ పాలనపై విమర్శలు సంధించారు. త్రిపుర అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు.

మోదీ పాలనపై ప్రశ్నలు

అధికారంలో ఉన్న వామపక్షాలు మోదీ పాలన తీరుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. నోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాలను తమ ర్యాలీల్లో ప్రధానంగా ప్రస్తావించాయి.

మోదీ పాలన కేవలం పెట్టుబడిదారుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడుతోందని మాణిక్ సర్కార్ తన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో లక్షలాది మంది యువత నిరుద్యోగులవుతున్నారని విమర్శించారు.

మార్పు పేరుతో బీజేపీ ప్రచారం

వామపక్షాలు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆరోపించారు.

కేరళ మాదిరిగానే త్రిపురలోనూ వామపక్షాలు హింసా రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలు అనేక సార్లు దాడికి గురయ్యారని అన్నారు.

'చలో పాలటాయి' ( రండి, మార్చండి) పేరుతో రాష్ట్రంలో అధికార పీఠం మార్పుకు తమ పార్టీ నినాదమిచ్చిందని తెలిపారు.

అయితే, ఈ నినాదంపై ఓ ర్యాలీలో మాణిక్ సర్కార్ స్పందించారు. వాళ్లు ఇచ్చిన నినాదం అసలు అర్థం.. 'రండి, పార్టీ మారుదాం' అని వివరించారు.

ఇటీవల రాష్ట్రంలోని చాలా మంది నాయకులు మొదట కాంగ్రెస్‌లో చేరి ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎన్నికల వేళ బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాణిక్ వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

బోరిస్ జాన్సన్: బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి