చెర్లోపల్లి చెరువులో 5 మృతదేహాలు: ఎర్రకూలీలేనా?

  • 18 ఫిబ్రవరి 2018
చెరువులో మృతదేహం Image copyright Ramesh

గమనిక: మృతదేహాల ఫొటోలున్నాయి

కడప జిల్లా ఒంటి మిట్ట మండలం చెర్లోపల్లి గ్రామ చెరువులో 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతులు ఎవరన్నదీ ఇంకా తెలీలేదు.

వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలుగా స్థానిక మీడియా ప్రతినిధులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు చెరువులో ఎందుకు పడ్డారు?

ఎర్రచందనం కోసం వచ్చి పోలీసుల నుంచి తప్పించుకోవడానికే చెరువులోకి దిగారని స్థానిక జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం..

శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య పోలీసులు కడప-రేణిగుంట రహదారిలో వెళుతున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఓ లారీని ఆపి, కొందరు వ్యక్తులు బ్యాగులు తీసుకుని హడావుడిగా లారీ దిగుతున్నారు. పోలీసులను చూసి.. లారీ నుంచి దిగినవారు చీకట్లోనే పరారయ్యారు.

వారిని వెంబడించేందుకు పోలీసులు ప్రయత్నించినా, ఆ చీకట్లో వారి జాడ తెలియరాలేదు. ఆ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉండటంతో, వారు ఆ కొండల్లోకి పారిపోయి ఉంటారని అనుమానించి పోలీసులు వెనుతిరిగారని స్థానిక జర్నలిస్టు బీబీసీకి వివరించారు.

కానీ...

అనుమానితులు పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్లుంటారని పోలీసులు భావించారు. కానీ తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులోకి దిగారని, తమ భుజానికి బ్యాగులు వేసుకుని చెరువును దాటేందుకు ప్రయత్నించారని స్థానిక జర్నలిస్టు అన్నారు. చెరువులోకి దిగినవారు ఈదలేక, ఊపిరాడక చివరికి మృత్యువాత పడ్డారు.

‘’ఆదివారం ఉదయం ఆ చెరువులో మూడు మృతదేహాలు కనిపించాయని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మరో రెండు మృతదేహాలను కూడా గుర్తించారు. మృతులు ఆపిన లారీకి, మృతదేహాలు లభ్యమైన చెరువుకు మధ్య దూరం కూడా 300మీటర్లు మాత్రమే ఉంటుంది. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలలానే కనిపిస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.

Image copyright Ramesh

ఎవరైందీ కచ్చితంగా చెప్పలేం!

అయితే శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగిందన్న వార్తలను జిల్లా ఎస్పీ బాపూజీ అట్టాడ ఖండించారు. ఈ విషయమై ఎస్పీని బీబీసీ ప్రతినిధి హృదయ విహారి ఫోన్లో సంప్రదించగా..

ఆ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందన్న అనుమానంతో పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తుంటారని, శుక్రవారం ఇలాంటి సంఘటన జరిగుంటే తప్పక తన దృష్టికి వచ్చేదని, కానీ కొన్ని గంటల క్రితమే తనకు సమాచారం అందిందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే ప్రాంతమన్న కారణంగానే ఆ చుట్టుపక్కల దాదాపు 7-8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్నారు.

మృతుల వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టడానికి వీలు లేకుండా మృతదేహాలు కుళ్లిపోయాయని, వారు ఎవరైందీ గుర్తించడం కష్టమవుతోందని ఎస్పీ చెప్పారు.

వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలని వెంటనే చెప్పలేమని, అలాగని ఏ విషయాన్నీ ఖండించలేమని ఎస్పీ వివరించారు. అసలు వీళ్లు తెలుగు వాళ్లా లేక తమిళ కూలీలా అన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

''కానీ చూడటానికి మాత్రం వారంతా కూలీలుగానే కనిపిస్తున్నారు. ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, దర్యాప్తు చేపడతాం'' అని ఎస్పీ వివరించారు.

Image copyright Ramesh

మృతుల వద్ద దొరికిన బ్యాగుల్లో ఊరగాయలు, పొడులు, వాటిని దాచుకోవడానికి కొన్ని కవర్లు ఉన్నాయి.

మృతులు తమిళనాడు వాసులేనన్న అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటన.. గతంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ ఘటనను గుర్తుచేయక మానదు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)