కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?

బర్గర్ తింటున్న యవతి

ఫొటో సోర్స్, Getty Images

‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్’ తింటే కేన్సర్ వస్తుందా?

''అవును.. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారానికి, కేన్సర్‌కు సంబంధం ఉంది'' అంటున్నారు ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు.

లక్షా ఐదు వేల మందిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైందని, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినేవారికి కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి?

చాలా మంది ఎంతో ఇష్టంగా తినే కేక్స్, చికెన్ నగ్గెట్స్, పెద్ద మొత్తంలో తయారు చేసి, ప్యాకెట్లలో నిలువ ఉంచిన బ్రెడ్స్, బన్నులను అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారంగా పరిగణిస్తున్నారు. మరింత వివరంగా చెప్పాలంటే..

 • తియ్యగా, రుచికరంగా ఉంటూ ప్యాకెట్లలో నిల్వచేసిన స్నాక్స్, కరకరలాడే పదార్థాలు.
 • చాకొలెట్ బార్స్, స్వీట్లు.
 • సోడా, తియ్యటి పానీయాలు.
 • ప్యాకెట్లలో నిల్ ఉంచిన చికెన్, మటన్, ఫిష్ నగ్గెట్స్.
 • చిటికెలో తయారయ్యే నూడుల్స్, సూప్స్.
 • ప్యాకెట్లలో నిల్వ చేసిన రెడీమెడ్‌ భోజనం.
 • నూనె, చక్కెర, కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఆహారం.
 • పెద్ద మొత్తంలో తయారు చేసి, ప్యాకెట్లలో నిల్వ ఉంచిన బ్రెడ్స్.

ఫొటో సోర్స్, wildpixel

కేన్సర్ విషయంలో ఈ అధ్యయనం చాలా హెచ్చరికలు చేస్తోంది. కానీ ఎప్పటికైనా ఆరోగ్యకరమైన ఆహారమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ధూమపానం తర్వాత స్థూలకాయం కూడా కేన్సర్‌కు ప్రధాన కారణం.

నిల్వ చేసిన మాంసం తినడం ద్వారా కేన్సర్ వచ్చే అవకాశాలు కొద్దిగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది.

పారిస్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రజల ఆహార అలవాట్లపై శాస్త్రవేత్తలు సర్వే చేశారు.

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపుగా మధ్యవయసు మహిళలే ఎక్కువగా ఉన్నారు.

ఈ మహిళల ఆహార అలవాట్లను 5 సంవత్సరాలపాటు గమనించారు.

ఈ అధ్యయనం ఫలితాలను బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం వాడకం పెరిగేకొద్దీ కేన్సర్ వచ్చే అవకాశాలూ పెరిగాయని అధ్యయనం ఫలితాలు తెలిపాయి.

అధ్యయనం ప్రకారం..

 • సగటున 18% మంది ప్రజలు అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని తీసుకుంటున్నారు.
 • సగటున ప్రతి ఏటా.. ప్రతి 10వేల మంది ప్రజల్లో 79 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.
 • ప్రాసెస్డ్ ఆహారం తీసుకునేవారి సంఖ్య 10% పెరిగితే.. కేన్సర్ బాధితుల సంఖ్య 88కు పెరుగుతోంది.

భవిష్యత్తులో కూడా ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరిగితే.. కేన్సర్ బారిన పడే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.

అయితే.. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం జరగాలని, ప్రాసెస్డ్ ఫుడ్‌కు, కేన్సర్‌కు ఉన్న సంబంధంపై సమగ్ర పరిశోధనలు జరగాలని కూడా వారు భావించారు.

ఫొటో సోర్స్, EPA

ఇది హెచ్చరిక మాత్రమే..!

అయితే.. కేవలం అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వల్లే కేన్సర్ వస్తుందని చెప్పడానికి కూడా వీల్లేదు.

ఈ ఆహారంతో పాటు ఇతర అలవాట్లు, జీవన శైలి కూడా కేన్సర్‌కు కారణాలు కావచ్చు.

''ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయం, దానితోపాటు కేన్సర్ వచ్చే అవకాశాలూ పెరుగుతాయని తెలుసు. ఇది ఒక హెచ్చరిక మాత్రమేనని గుర్తించుకోవాలి. అలాగని ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా నొరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. తమ ఆహారపు అలవాట్లలో తగినంత స్థాయిలో పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకుంటే.. అప్పుడప్పుడూ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా ఫరవాలేదు'' అని కేన్సర్ రీసెర్చ్ ప్రొఫెసర్ లిండా బాల్డ్ అన్నారు.

మరికొందరు.. అసలు ‘అల్ట్రా ప్రాసెస్డ్’ ఆహారాన్ని నిర్వచించడంలోనే అస్పష్టత ఉందని విమర్శిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సివుందని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)