"పీఎన్‌బీ కుంభకోణం మోదీ పాలనలో మొదటిదేమీ కాదు!"

  • 19 ఫిబ్రవరి 2018
నరేంద్ర మోదీ Image copyright Sean Gallup/Getty Images

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటపడి వారం కూడా గడవకముందే ప్రభుత్వం మరి కొన్ని ఆశ్చర్యకర గణాంకాలను విడుదల చేసింది.

2012-16 మధ్య కొందరు వ్యక్తులు రూ.22,743 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించారని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

భారతీయ బ్యాంకుల పరిస్థితిపై ఇండియన్ ఇన్‌స్టిట్యుట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెంగళూరు కూడా ఒక నివేదికను విడుదల చేసింది. అందులోని గణాంకాలనే రవిశంకర్ ఉటంకించారు.

శుక్రవారం నాడు పార్లమెంటు క్వశ్చన్ అవర్‌లో మంత్రి మాట్లాడుతూ ఐఐఎం విడుదల చేసిన ఈ నివేదకను ప్రస్తావించారు.

2017 మొదటి తొమ్మిది నెలల్లో ఐసీఐసీఐ బ్యాంకులో దాదాపు 455, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 429, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో 244, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 237 మోసాల కేసులు బయటపడినట్లు ఆ నివేదిక చెబుతోంది.

ఈ అన్ని కేసులూ లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ మేర బ్యాంకులకు నష్టం వాటిల్లినవే. ఇలాంటి మోసాల్లో ఎక్కువ సార్లు బ్యాంకు ఉద్యోగుల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.

Image copyright BIJU BORO/AFP/Getty Images

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 60, హెచ్‌డీఎఫ్‌సీలో 49, యాక్సిస్ బ్యాంక్‌లో 35మంది ఉద్యోగులు ఈ మోసాల్లో భాగమైనట్లు నివేదిక చెబుతోంది.

పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ కూడా రూ.11,400కోట్ల రూపాయల కుంభకోణం కేసులో 20మంది బ్యాంకు సిబ్బందిని సస్పెండ్ చేసింది.

2011 - 2017 మధ్య చోటు చేసుకున్న మోసాలు

2011

2011లో కొందరు బ్యాంక్ అధికారులు దాదాపు 10వేల అనుమానాస్పద బ్యాంకు ఖాతాలు తెరిచారనీ, వాటిలో లోన్ రూపంలో 1500కోట్ల రూపాయల మేర డబ్బు జమైందనీ సీబీఐ పేర్కొంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడీబీఐ తదితర బ్యాంకులకు చెందిన అధికారులు మోసానికి పాల్పడినవారి జాబితాలో ఉన్నారు.

2014

2014లో కొందరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అధికారులపై ముంబై పోలీసులు మొత్తం 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాళ్లంతా రూ.700కోట్ల రూపాయల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి.

అదే ఏడాది కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త బిపిన్ బోహ్రా నకిలీ డాక్యుమెంట్ల సాయంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1400కోట్ల మేర రుణం పొందినట్లు ఆరోపణలు ఎదురయ్యాయి.

అదే ఏడాది సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కే జైన్ లంచం తీసుకొని రూ.8వేల కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన నేరం వెలుగులోకొచ్చింది.

విజయ్ మాల్యాను ‘విల్‌ఫుల్ డిఫాల్టర్‌’గా యూనియన్ బ్యాంక్ 2014లోనే ప్రకటించింది. ఆ తరవాత ఎస్‌బీఐ, పీఎన్‌బీలు కూడా యూనియన్ బ్యాంక్ దారిలోనే నడిచాయి.

Image copyright BIJU BORO/AFP/Getty Images

2015

విదేశీ కరెన్సీ మార్పిడి కుంభకోణం వెలుగు చూసింది 2015లోనే. ఆ స్కామ్‌లో అనేక బ్యాంకుల ఉద్యోగులతో పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంది.

వీళ్లంతా కలిసి దాదాపు రూ.6వేల కోట్ల రూపాయల మేర మోసగించారు.

2016

నలుగురు వ్యక్తులు కలిసి సిండికేట్ బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా వెయ్యి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దీనికోసం వాళ్లు దాదాపు 380 నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి మోసపూరిత లావాదేవీలు నిర్వహించారు.

నకిలీ చెక్ బుక్‌లు, ఎల్‌ఓయూలు, ఎల్‌ఐసీ పాలసీలను ఈ స్కామ్ కోసం ఉపయోగించారు.

Image copyright MANJUNATH KIRAN/AFP/Getty Images

2017

విజయ్ మాల్యా బ్యాంకులకు ఎగ్గొట్టిన రూ.9500 కోట్ల రూపాయల కేసు విషయంలో సీబీఐ 2017లో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

2016లో మాల్యా దేశం వదిలి బ్రిటన్ వెళ్లిపోయారు. అతడిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కొన్ని నెలల క్రితం ‘విన్సల్ డైమెండ్స్‌’కు సంబంధించిన రూ.7వేల కోట్ల రూపాయల కుంభకోణం బట్టబయలైంది . ఈ కేసులో సీబీఐ 6 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.

కోల్‌కతాకు చెందిన వ్యాపారి నీలేష్ పరేఖ్‌ను 2017లో అరెస్టు చేశారు. అతడు కనీసం 20 బ్యాంకులను రూ.2223 కోట్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి. డొల్ల కంపెనీల సాయంతో నీలేష్ ఆ డబ్బుని విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది.

ఈ కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర‌కు చెందిన ఒక జోనల్ మేనేజర్, సూరత్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ పైన సీబీఐ కేసులు నమోదు చేసింది.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)