ప్రెస్‌రివ్యూ: 'అసలు చంద్రబాబు 44 నెలల్లో 29 సార్లు దిల్లీ వెళ్లి ఏం సాధించారు?'

  • 19 ఫిబ్రవరి 2018
Image copyright JAIRAM RAMESH/FACEBOOK

వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, అది కేవలం భాజపా మాటేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేశారని 'ఈనాడు' పేర్కొంది.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేయకపోవడం పట్ల పార్లమెంటులో తెదేపా ఎంపీలు చేపట్టిన నిరసన మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనని విమర్శించారు. విభజన హామీల విషయంలో పవన్‌ కల్యాణ్‌ ఒక సైంటిస్టులా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర బడ్జెట్‌ సమావేశాల సమయంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు విమానాల్లో తిరిగారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో పర్యటించారని ఎద్దేవా చేశారు. తెదేపా, భాజపాలకు విభజన సమస్యను తీర్చడం ఇష్టం లేదని విమర్శించారు.

ఆదివారం తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని చట్టంలో పేర్కొన్నట్లు తెలిపారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడం విభజన చట్టం నిబంధనల ఉల్లంఘనే అని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజనను అశాస్త్రీయంగా చేశారని విమర్శించే పార్టీలు శాస్త్రీయ ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు. ఆ ప్రతిపాదన శాస్త్రీయమైతే కాంగ్రెస్‌ పార్టీ తప్పక మద్దతిస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 44 నెలల్లో 29 సార్లు దిల్లీ వెళ్లారని, అయినా సాధించిందేమీ లేదని వ్యాఖ్యానించారు. 30వ సారి దిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అన్యాయం చేసినందున మద్దతు ఉపసంహరించుకుంటున్నామని మోదీ ఎదుట ప్రకటించాలని డిమాండు చేశారని ఈనాడు తెలిపింది.

Image copyright AndhraPradeshCM/facebook

'జాతీయ వేదికలపైనా గళమెత్తుదాం'

రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. జరగాల్సిన న్యాయంపై జాతీయ స్థాయిలో అన్ని వేదికలపైనా చాటిచెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

ముఖ్యమంత్రి ఆదివారం వారితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 'పార్లమెంటులో ఎలాగూ పోరాడుతున్నాం. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీల సమావేశాల్లో కూడా రాష్ట్రానికి న్యాయం చేయాలన్న విషయం చెబుదాం. అన్యాయం గురించి మన పార్టీ ఎంపీలు సభ్యులుగా ఉన్న అన్ని పార్లమెంటరీ కమిటీల్లో లేవనెత్తాలి. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాటాన్ని ఆపేది లేదు' అని చెప్పారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మనం చెబుతుంటే దానికి కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారని గుర్తుచేశారు. ఆ వివరణలు విని ఊరుకోవద్దని.. వాస్తవాలను ప్రజలకు వివరించాలని పిలుపిచ్చారు. 'రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు. రాజకీయంగా ఎవరేం మాట్లాడినా.. అసలు వాస్తవాలు ఏమిటి? ఎక్కడ అన్యాయం జరిగిందో ప్రజలకు చెప్పాలి.

రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సింది ఎంత.. ఇచ్చింది ఎంత.. నెరవేర్చాల్సిన హామీలు.. ఇప్పటికీ నెరవేర్చనివి ఏమిటన్న అంశాలతో పాటు ఎన్నికల ముందు ఆ పార్టీ అగ్ర నేతలు సహా అంతా ఏం చెప్పారన్నది ప్రజలకు గుర్తుచేయాలి. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ప్రజలకు వాస్తవాలు చెబితే.. ఏం చేయాలన్నది వారే నిర్ణయించుకుంటారు' అని సీఎం తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

Image copyright http://forests.telangana.gov.in/

'అటవీ మంత్రి జిల్లాలో అడవి మాయం!'

ఆదిలాబాద్‌ అంటేనే దట్టమైన అడవులకు నిలయం. జిల్లాలో అటవీ విస్తీర్ణం 1874.00 చదరపు కిలోమీటర్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం అటవీ ప్రాంతమంతా మైదానంగా మారిపోతోందని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనాన్ని ప్రచురించింది.

ఆదిలాబాద్‌ అడవుల్లో పెరిగిన టేకు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో హైటెక్‌ తరహాలో కలప అక్రమ రవాణా సాగుతోంది. అధికారపార్టీ నేతల అండదండలు వీరికి పుష్కలంగాఉండడంతో అధికారులు, పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి.

అటవీశాఖ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టల వద్ద సిబ్బందికి ముందుగా స్మగ్లర్లు డబ్బను ఎరగా వేస్తున్నారు. ఒక వేళ లొంగని పక్షంలో అధికారులపై స్మగ్లర్లు ఎంతకైనా బరితెగిస్తున్నారు. గొడ్డలి, కత్తులు, రాళ్లతో అధికారులపై తిరగబడి దాడులు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకునేందుకు తప్పించుకొని పారిపోతున్నారు కూడా.

ఇటీవల కాలంలో స్మగ్లర్లు అంటే.. అటవీ అధికారుల వెన్నులో వణుకు పుడుతుందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాగా.. స్మగ్లర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపేందుకు గతంలో కలెక్టర్‌గా పనిచేసిన జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన బదిలీతో ఆ ప్రయత్నాలన్ని ఫలించలేదు.

జిల్లాలోని ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, ఇచ్చోడ అటవీ డివిజన్‌ పరిధిలో ఏడాదిలోనే అటవీశాఖ అధికారులు 407కేసులు నమోదు చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

జగన్ Image copyright YSR CONGRESS PARTY/FACEBOOK

'కేంద్రంపై అవిశ్వాసానికి సిద్ధమే'

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైకాపా సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారని ఈనాడు పేర్కొంది.

దీనికి సరిపడా ఎంపీల బలం తమకు లేనందున తెదేపా సహా మిగిలిన పార్టీలు కలిసి వచ్చేలా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చర్చించాలని సూచించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులో ఆదివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలంటూ... పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

ప్రత్యేక హోదా కోరుతూ తమ పార్టీ ఎంపీలు మార్చి 5 నుంచి పార్లమెంటులో పోరాటం చేస్తారని, స్పందించకుంటే మార్చి చివరి వారంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. తెదేపా పెట్టినా తాము మద్దతిస్తామని, లేదంటే తాము పెట్టిన తీర్మానానికి తెదేపా మద్దతివ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి తానా అంటే వెనుక తందానా అనే రీతిలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని విమర్శించారు. 'పవన్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ అట... నిజ నిర్ధారణ చేస్తారట. ఇది ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు ఏమి ఇచ్చారో...? వీళ్లు ఏమి తీసుకున్నారో..? పవన్‌ తేలుస్తారట. ఇదంతా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లే ఉంది' అని జగన్‌ వ్యాఖ్యానించారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)