సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసు: పదకొండేళ్లలో ఏం జరిగింది?

  • 19 ఫిబ్రవరి 2018
సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ Image copyright PTI

సరిగ్గా పదకొండేళ్ల క్రితం, 2007 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి, దిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లే సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొదట హరియాణా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఆ తర్వాత భారత్‌లోని వేర్వేరు పట్టణాల్లో ఇలాంటి పేలుడు ఘటనలు అనేకం జరగడంతో కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు అప్పగించారు.

పదకొండేళ్లలో కేసులో పురోగతి ఏంటి?

పంచ్‌కులా ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ అధికారుల నుంచి వాంగ్మూలాలు తీసుకొనే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కేసులో ప్రధాన ముద్దాయి అసీమానంద్ బెయిల్‌పై విడుదలయ్యారు.

Image copyright NARINDER NANU/AFP/Getty Images

కేసు ఇలా సాగింది:

ఫిబ్రవరి 2007:భారత్-పాకిస్తాన్‌ల మధ్య వారానికి రెండు రోజులు నడిచే సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 2007 ఫిబ్రవరి 18 రాత్రి బాంబు పేలుడు జరిగింది. ఇందులో 68 మంది మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో ట్రెయిన్ దిల్లీ నుంచి లాహోర్‌కు వెళ్తోంది. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది పాకిస్తాన్ పౌరులే.

2001లో పార్లమెంటుపై జరిగిన దాడి తర్వాత నిలిపివేసిన ఈ రైలు సేవను 2004 జనవరిలో పునరుద్ధరించారు.

పేలుడు జరిగిన తర్వాత రెండు రోజులకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ అహ్మద్ కసూరి భారత్‌కు రావాల్సి ఉండె. ఇరు దేశాల్లోనూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అయితే ఈ కారణంతో కసూరి భారత్ పర్యటన రద్దు కాలేదు.

గాయపడిన ఏడుగురు పాకిస్తానీలను దిల్లీ నుంచి తరలించేందుకు పాకిస్తానీ వైమానిక దళానికి చెందిన విమానానికి భారత అధికారులు అనుమతి ఇచ్చారు.

ఫిబ్రవరి 2007: ఫిబ్రవరి 19న నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం రాత్రి 11.53 గంటలకు దిల్లీకి దాదాపు 80 కి.మీ. దూరంలో పానిపట్‌కు సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ దగ్గర ట్రెయిన్‌లో పేలుడు జరిగింది. పేలుడు మూలంగా రెండు జనరల్ బోగీలలో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులకు రెండు పేలుడు శబ్దాలు వినిపించాయి.

68 మంది మృతుల్లో 16 మంది పిల్లలు కాగా, నలుగురు రైల్వే ఉద్యోగులున్నారు.

ఘటన తర్వాత పోలీసులు రెండు సూట్‌కేసులను కనుగొన్నారు. వాటిలో పేలకుండా మిగిలిపోయిన బాంబులున్నాయి.

2007 ఫిబ్రవరి 20: ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితుల 'స్కెచ్‌లు' విడుదల చేశారు. ఆ ఇద్దరూ దిల్లీలో ట్రెయిన్ ఎక్కారనీ, మధ్యలో ఎక్కడో దిగిపోయారనీ, ఆ తర్వాత పేలుళ్లు జరిగాయని పోలీసులు భావించారు. నిందితులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

హరియాణా ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (ఎస్ఐటీ) ఏర్పాటు చేసింది.

2007 మార్చి 15: హరియాణా పోలీసులు ఇండోర్‌లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. సూట్‌కేసుల కవర్ల ఆధారంగా పోలీసులు వారి జాడ కనిపెట్టగలిగారు. పేలుడుకు కొద్ది రోజుల ముందు ఇండోర్‌లోని ఓ మార్కెట్‌లో ఆ కవర్లను కొనుగోలు చేశారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లోని మక్కా మసీదు, అజ్మేర్ దర్గా, మాలెగాంలలో కూడా ఇలాంటి పేలుడు ఘటనలే జరిగాయి. ఈ ఘటనలన్నింటి మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. 'అభినవ్ భారత్' అనే అతివాద హిందూ సంస్థకు ఈ పేలుళ్లతో సంబంంధం ఉన్నట్టు సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసు దర్యాప్తు చేపట్టిన హరియాణా పోలీసులకు, మహారాష్ట్ర ఏటీఎస్‌కు కొన్ని సాక్ష్యాలు లభించాయి.

ఈ పేలుళ్ల కేసులలో ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్‌ను కూడా పోలీసులు విచారించారు.

2010 జులై 26: కేసును ఎన్ఐఏకు అప్పగించారు.

Image copyright PTI

2011 జూన్: 2011 జూన్ 26న ఎన్ఐఏ ఐదుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో నాబకుమార్ ఎలియాస్ స్వామి అసీమానంద్, సునీల్ జోషి, రామచంద్ర కాలసంగ్రా, సందీప్ డాంగే, లోకేశ్ శర్మల పేర్లున్నాయి.

వీరంతా అక్షర్‌ధామ్ (గుజరాత్), రఘునాథ్ మందిర్ (జమ్మూ), సంకట్ మోచన్ (వారాణసి) మందిరాల్లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద దాడులతో కలత చెందారనీ, 'బాంబులకు ప్రతీకారం బాంబులతోనే' తీర్చుకోవాలని భావించారని విచారణ సంస్థ పేర్కొంది.

ఆ తర్వాత ఎన్ఐఏ పంచ్‌కులా ప్రత్యేక కోర్టులో ఒక అదనపు చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 ఫిబ్రవరి 24 నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది.

2014 అగస్ట్: సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో ముద్దాయిగా ఉన్న స్వామి అసీమానంద్‌కు బెయిల్ లభించింది. అసీమానంద్‌పై తగిన సాక్ష్యాధారాలు విచారణ సంస్థ కోర్టులో ప్రవేశపెట్టలేకపోయింది.

2006 నుంచి 2008 మధ్య భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లతో ఆయనకు సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

అసీమానంద్‌ స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే తనను హింసించడం వల్లనే అలా స్టేట్‌మెంట్ ఇచ్చానంటూ అసీమానంద్ ఆ తర్వాత తన వాంగ్మూలాన్ని తిరస్కరించారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు