శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?

  • రాం పునియాని
  • బీబీసీ కోసం
ఛత్రపతి శివాజీ

మరాఠా ప్రజల మదిలో చిరకాలం గుర్తుండిపోయే ప్రసిద్ధ రాజు శివాజీ. ముంబయిలోని విమానాశ్రయానికే కాదు, రైల్వే స్టేషన్‌కు కూడా ఆయన పేరే ఉంటుంది.

అరేబియా సముద్రంలో శివాజీ అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి. అయితే, వివిధ రాజకీయ పార్టీలు శివాజీని భిన్న కోణాల్లో గుర్తు చేస్తుంటాయి.

కొందరు ఆయనను గోవులనూ, బ్రాహ్మణులనూ రక్షించిన పాలకుడని అంటారు. మరికొందరు ప్రజా సంక్షేమ పాలకుడని కీర్తిస్తుంటారు. మరికొందరు ఆయనను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటారు.

కొన్నాళ్ల కిందట మహారాష్ట్రలోని మిరాజ్-సాంగ్లీ ప్రాంతంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా అఫ్జల్ ఖాన్‌ను చంపుతున్న శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వివాదాస్పదమైంది.

ఆ విగ్రహ చిత్రాలు రాష్ట్రమంతటా చక్కర్లు కొట్టాయి. చివరకు ఈ ఘటన ఆ ప్రాంతంలో మతకల్లోలానికి దారితీసింది. ఆ విగ్రహం హిందూ అయిన శివాజీ ముస్లిం అయిన అఫ్జల్ ఖాన్‌ను చంపుతున్నట్టు ఉందని ప్రచారం ప్రారంభం కావడమే ఆ ఘర్షణకు కారణం.

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

శివాజీ పరిపాలన ఎలా ఉండేది?

ప్రతాప్‌ఘడ్‌లోని అఫ్జల్‌ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు అతివాద హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు. అయితే, శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం వెలుగులోకి రావడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే.

శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

ముస్లింలతో శివాజీ ఎలా ఉండేవారు?

ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు. హజ్రత్ బాబా యాకుత్ బహుత్ తొర్వాలే పట్ల శివాజీకి చాలా గౌరవభావం ఉండేది. ఆయనకు జీవితాంతం పింఛను అందేలా ఏర్పాటు చేశాడు.

అలాగే ఫాదర్ అంబోస్‌ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది. గుజరాత్‌ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్ నిర్మాణానికి శివాజీ సాయం అందించాడు.

తన రాజధాని రాయగఢ్‌లో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి శివాజీ ఆదేశాలిచ్చాడు.

అలాగే, తన రాజ్యంలోని మసీదులు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకొని ముస్లింలకు అప్పగించాలని సైనికులను కోరారు.

పురంధరే రాసిన 'జాణ్తా రాజా' నాటకంలోని సన్నివేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పురంధరే రాసిన 'జాణ్తా రాజా' నాటకంలోని సన్నివేశం

నవాబ్ కోడలిపై గౌరవం

బసేన్ నవాబ్ కోడలి పట్ల శివాజీ చూపిన గౌరవం అందరికి తెలిసిందే. దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు.

అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరాడు. అలాగే ఆమెను ఇంటి వరకూ సురక్షితంగా దిగబెట్టిరావాలని తన సైనికులను ఆదేశించాడు.

అఫ్జల్ ఖాన్‌ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపింది. అదిల్షా రాజులకు, శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతోంది. అఫ్జల్ ఖాన్ అదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడాడు.

చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నాడు. అయితే, ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది.

రస్తీం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్‌ను వధించాడు.

శివాజీని కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్‌కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి. కానీ, ఈ విషయం పెద్దగా వెలుగు చూడలేదు.

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పురంధరే రాసిన 'జాన్తా రాజా' నాటకంలోని సన్నివేశం

చరిత్ర పుస్తకాల్లో శివాజీ

బ్రిటిష్ కాలంలో మొదలైన చరిత్ర రచన... రాజుల మధ్య జరిగిన యుద్ధాన్ని హిందూ, ముస్లింల మధ్య మత గొడవలుగా చిత్రీకరించింది.

రాజకీయ ఉద్దేశాలతోనే శివాజీని ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరించారు. చాలా చరిత్ర పుస్తకాలు కూడా అదే ధోరణిలో వచ్చాయి.

ప్రసిద్ధ మరాఠా నాటక రచయిత పురంధరే రాసిన 'జాణ్తా రాజా' (జగమెరిగిన రాజు) నాటకం మహారాష్ట్ర అంతటా పేరొందింది. ఈ నాటకం శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది.

'న్యూ హిస్టరీ ఆఫ్ మరాఠాస్' పుస్తకంలో చరిత్రకారుడు సర్దేశాయి, శివాజీ గురించి రాస్తూ, 'ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదు' అని పేర్కొన్నారు.

సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యం. అందుకోసమే ఆయన జీవితాంతం పోరాడాడు.

శివాజీని ముస్లిం ద్వేషిగా, ఇస్లాం వ్యతిరేకిగా చూపించడం అంటే వాస్తవాల వక్రీకరణే అవుతుంది.

(రచయిత చరిత్రకారుడు, మానవహక్కుల కార్యకర్త)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)