చెర్లోపల్లి మృతులు తమిళనాడు వాసులు: పోలీసులు

  • 19 ఫిబ్రవరి 2018
చెరువులో మృతదేహం Image copyright Ramesh

గమనిక: మృతదేహాల ఫొటోలున్నాయి

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామ చెరువులో ఆదివారం విగతజీవులుగా కనిపించిన ఐదుగురు తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వారుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ మృతులు.. వలప్పాడి సబ్‌డివిజన్‌లోని కరియాకోవిల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన మురుగేశన్ (42), జయరాజ్ (25), మురుగేశన్ (42), కరుప్పన్నన్ (23), చిన్నపియాన్ (45)లుగా పోలీసులు తెలిపారు.

వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలుగా స్థానిక మీడియా ప్రతినిధులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. చెర్లోపల్లి చెరువు నడుము లోతు కూడా ఉండదని స్థానికులు చెప్తున్నారని.. అలాంటపుడు ఒకేసారి ఐదుగురు వ్యక్తులు అందులో పడి చనిపోవటం అసంభవంగా కనిపిస్తోందని పౌర హక్కుల సంఘం కడప జిల్లా శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ మరణాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తోంది.

అసలు చెరువులో ఎందుకు పడ్డారు?

ఎర్రచందనం కోసం వచ్చి పోలీసుల నుంచి తప్పించుకోవడానికే చెరువులోకి దిగారని స్థానిక జర్నలిస్టు ఒకరు బీబీసీకి తెలిపారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం..

శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య పోలీసులు కడప-రేణిగుంట రహదారిలో వెళుతున్నారు. ఆ సమయంలో రోడ్డుపై ఓ లారీని ఆపి, కొందరు వ్యక్తులు బ్యాగులు తీసుకుని హడావుడిగా లారీ దిగుతున్నారు. వారు పోలీసులను చూసి చీకట్లోనే పరారయ్యారు.

వారిని వెంబడించేందుకు పోలీసులు ప్రయత్నించినా, ఆ చీకట్లో వారి జాడ తెలియరాలేదు. ఆ ప్రాంతంలో చుట్టూ కొండలు ఉండటంతో, వారు ఆ కొండల్లోకి పారిపోయి ఉంటారని అనుమానించి పోలీసులు వెనుతిరిగారని స్థానిక జర్నలిస్టు బీబీసీకి వివరించారు.

Image copyright Ramesh

లారీకి 300 మీటర్ల దూరంలోనే మరణం...

అనుమానితులు పక్కనే ఉన్న కొండల్లోకి వెళ్లుంటారని పోలీసులు భావించారు. కానీ తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులోకి దిగారని, తమ భుజానికి బ్యాగులు వేసుకుని చెరువును దాటేందుకు ప్రయత్నించారని స్థానిక జర్నలిస్టు అన్నారు. చెరువులోకి దిగినవారు ఈదలేక, ఊపిరాడక మృత్యువాత పడ్డారని సదరు జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.

‘’ఆదివారం ఉదయం ఆ చెరువులో మూడు మృతదేహాలు కనిపించాయని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మరో రెండు మృతదేహాలను కూడా గుర్తించారు. మృతులు ఆపిన లారీకి, మృతదేహాలు లభ్యమైన చెరువుకు మధ్య దూరం కూడా 300 మీటర్లు మాత్రమే ఉంటుంది. వీరంతా తమిళనాడుకు చెందిన కూలీలలానే కనిపిస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.

‘‘ఎర్రచందనం కూలీలని వెంటనే చెప్పలేం’’

అయితే శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగిందన్న వార్తలను జిల్లా ఎస్పీ బాపూజీ అట్టాడ ఖండించారు. ఈ విషయమై ఎస్పీని బీబీసీ ప్రతినిధి హృదయ విహారి ఫోన్లో సంప్రదించారు.

ఆ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుందన్న అనుమానంతో పోలీసులు నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తుంటారని, శుక్రవారం ఇలాంటి సంఘటన జరిగుంటే తప్పక తన దృష్టికి వచ్చేదని, కానీ కొన్ని గంటల క్రితమే తనకు సమాచారం అందిందని ఎస్పీ చెప్పారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగే ప్రాంతమన్న కారణంగానే ఆ చుట్టుపక్కల దాదాపు 7-8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీరంతా ఎర్రచందనం కోసం వచ్చిన కూలీలని వెంటనే చెప్పలేమని, అలాగని ఏ విషయాన్నీ ఖండించలేమని ఎస్పీ వివరించారు.

''కానీ చూడటానికి మాత్రం వారంతా కూలీలుగానే కనిపిస్తున్నారు. ఆ మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, దర్యాప్తు చేపడతాం'' అని ఎస్పీ వివరించారు.

Image copyright Ramesh

సీబీఐ దర్యాప్తు జరిపించాలి: పౌర హక్కుల సంఘం

మృతుల వద్ద దొరికిన బ్యాగుల్లో ఊరగాయలు, పొడులు, వాటిని దాచుకోవడానికి కొన్ని కవర్లు ఉన్నాయి. ఈ ఘటన.. గతంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ ఘటనను గుర్తుచేయక మానదు.

చెర్లోపల్లి చెరువులో ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు బయటపడటం అనుమానాస్పదంగా ఉందని పౌర హక్కుల సంఘం కడప జిల్లా ఉపాధ్యక్షుడు సి.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. మృతదేహాలు రెండు, మూడు రోజుల కిందటే చెరువులో పడినట్లుగా అర్థమవుతోందన్నారు.

‘‘వీరు ఎర్రచందనం నరకటానికి వచ్చిన తమిళ కూలీలుగా భావిస్తున్నాం. కడప - తిరుపతి ప్రధాన రహదారికి 50-60 అడుగుల దూరంలో ఉన్న చెరువులో ఐదుగురు తమిళ కూలీలు విగత జీవులై పడివుండటం చాలా అనుమానాలకు తావిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

’’ఆ చెరువు నడుము లోతు కూడా లేని నీటి గుంట అని స్థానికులు మాకు చెప్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఒకేసారి ఐదుగురు అందులో పడి చనిపోవటం అసంభవం అనిపిస్తోంది. ఎక్కడో ఏదో జరిగి వారిని చంపివుంటారని స్థానిక ప్రజలు మా వద్ద చెప్తున్నారు. ఈ ఐదుగురి మరణాలపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)