ప్రెస్‌రివ్యూ: 'జగన్ అవిశ్వాసం పెడితే మద్దతిస్తా'

ఫొటో సోర్స్, JanasenaParty
పవన్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, అవిశ్వాసం పెడితే తాను ఇతర పార్టీల మద్దతు కూడగడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారని ఈనాడు పేర్కొంది.
సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ సవాల్‌కు సమాధానం చెప్పేందుకే తాను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జగన్ సవాలును ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. '' ప్రకాశం జిల్లాలో వైకాపా అధినేత సవాల్ విసిరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతాను.. మద్దతు ఇవ్వాలని ఛాలెంజ్ విసిరారు. ఆ సవాల్‌కు స్పందిద్దామని ప్రెస్‌మీట్ పెట్టాను.
ఆయనకు చెప్పదలచుకున్నదేమిటంటే.. అన్నింటికీ సిద్ధపడే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మద్దతు లేదని జగన్ అన్నారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను.
దానికన్నా ముందు మీరు నాకు చేయాల్సింది ఒక్కటే. నిబంధనల ప్రకారం ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. ముందు ఆ పని మీరు చేయండి. ఇప్పుడు ఇంకా పార్లమెంట్ సభా వ్యవహారాలు నడవడంలేదు గానీ, పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నానని మీ ఎంపీలను రేపే పంపండి.
4న నేను వస్తాను. సీపీఐ, సీపీఎం, బీజేడీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, తెదేపా, ఎవరైతే మనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో, వారందరి మద్దతు నేను సంపాదిస్తా. మీరు ఆలోచించుకుని మార్చి 4న తీర్మానం పెట్టండి. 5న అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో చర్చకు రావాలి.
స్పీకర్ అడిగినప్పుడు 50 మంది లేచి నిలబడాలి. ఇప్పటికే తెదేపా, వైకాపా పార్టీలు సిద్ధమని ప్రకటించాయి. రెండు పార్టీలు కలిస్తే 25 మంది ఎంపీలు ఉన్నారు. ముందు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి. మేం మద్దతు సంపాదిస్తాం. ఏపీ విభజన హామీలపై మాట్లాడండి. ఎవరెవరు మద్దతు తెలిపారో అందరూ కలిసి వస్తారని పవన్ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
'భారతీయులు టెక్నాలజీ ఫ్రెండ్లీ'
ప్రపంచంలోని సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ ఆవిష్కరణలను చేపట్టాలని ప్రపంచ ఐటీ నిపుణులు, మేధావులకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ఈ దిశగా కృషి చేయాలని మోదీ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తొలిసారి జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, తెలంగాణ సీఎం కేసీఆర్, నాస్కామ్ చైర్మన్ రమణ్‌రాయ్, విట్సా సెక్రటరీ జనరల్ జిమ్ పోయిజెంట్కు కృతజ్ఞతలు తెలిపారు.
నాలుగు రోజులపాటు సాగే ఈ సదస్సును నాస్కామ్, విట్సా, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ మానవాళి బంగారు భవిష్యత్తు కోసం మీరంతా విశేషంగా కృషి చేస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తున్నారు అని ప్రశంసించారు. 21వ శతాబ్దంలో ఆధునిక పరిజ్ఞానం ప్రపంచ సరిహద్దులను పూర్తిగా చెరిపేసిందన్నారు.
నాస్కామ్ రూపొందించిన రోబో సోఫియా భవిష్యత్తులో ఆధునిక పరిజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. రానున్న రోజుల్లో ఎనిమిది పరిజ్ఞానాలు- ఏఐ, వర్చువల్ రియాల్టీ, రోబోటిక్స్, ఈవోటీ, బిగ్ డేటా అనాలిటిక్స్, త్రీడీ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ అండ్ మొబైల్- ప్రపంచాన్ని శాసిస్తాయన్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
'దేనికైనా రెడీ'
ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై అవిశ్వాసంతో సహా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
సోమవారం విజయవాడలో జరిగిన మాదిగల మహాసభలో ఆయన పాల్గొన్నారు. ''రాష్ట్ర ప్రయోజనాల కోసం సీనియర్ నాయకుడిగా ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్లు గుంటూరు సమావేశంలోనే చెప్పాను. పోరాటం ద్వారా విభజన హామీలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. విభజనకు సహకరించిన పార్టీలే ఆ సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు బాధ్యత తీసుకోవాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీకి ఉన్న బలం చాలదని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో తమ వ్యూహాలు తమకు ఉన్నాయని సీఎం చెప్పారు. రాష్ర్టానికి రాజకీయ న్యాయం కోసం పోరాడతామన్నారు. ప్రత్యేక హోదా వల్ల దక్కే ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రత్యేక సాయం అందిస్తామని చెప్పారని సీఎం వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను ఎక్కడా రాజీపడనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని దేశమంతా చాటి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర సమస్యల కోసం చాలా మంది వ్యక్తిగతంగా, పార్టీల పరంగా పోరాడుతున్నారని, అందరి సహాయం తీసుకుంటామన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఫొటో సోర్స్, FACEBOOK/APCMO
నేడు హైదరాబాద్‌లో 'జల పంచాయతీ'
నదీ జలాల కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో... మంగళవారం హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరులశాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర జల వనరులశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమావేశం కానున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలతో జరిగే ఈ సమావేశంలో చర్చించే అజెండాను మాత్రం కేంద్రం పంపలేదు. అజెండా పంపకుండా చర్చలకు రావాలని కేంద్రం కోరడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య కృష్ణానదీ జలాలకు సంబంధించి బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది.
ఈ ట్రైబ్యునల్ అవార్డు అమల్లోకి వస్తే.. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు మార్గం సుగమమై కర్ణాటక లబ్ధి పొందుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచేస్తే... దిగువన ఉన్న తెలంగాణకు నీళ్లు వచ్చాక... మిగిలూతగులూ ఏమైనా ఉంటే అవి ఏపీకి వస్తాయి.
అంటే.. రాష్ట్రంలో కృష్ణాజలాల పారుదలను మరచిపోవాల్సిన దుస్థితి నెలకొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డుపై ఉన్న అభ్యంతరాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ కావాలని, ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇలాంటి తరుణంలో మంగళవారం జరిగే సమావేశానికి అజెండా లేకపోతే... ఇక ఈ భేటీకి అర్థమే ఉండదని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రారంభిస్తే.. అసలు విషయం పక్కకుపోయి అంతా రసాభాసగా మారిపోతుందని అంటున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది
ఇవి కూడా చదవండి:
- కెనడా ప్రధాని పర్యటనకు భారత్ ప్రాధాన్యం ఇవ్వడం లేదా?
- ‘ఇక్కడ ప్రాణాలు పోతుంటే అక్కడ నేతలు చోద్యం చూస్తున్నారు!’
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- నాలుగేళ్లలో 25,600 బ్యాంకింగ్ మోసాలు, రూ.22,743 కోట్లు విలువైన కుంభకోణాలు
- ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ఇరాన్: నెతన్యాహు
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)