రూ.10 కాయిన్స్ - అపోహలు, నిజాలు: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు? ఎవరైనా తీసుకోకపోతే ఏం చేయాలి?
- ప్రవీణ్ కాసం
- బీబీసీ తెలుగు

ఫొటో సోర్స్, wikipedia.org
తమ్ముడి పుట్టిన రోజుకు మంచి గిఫ్ట్ కొనాలనుకున్న స్వీటీ.. అప్పుడప్పుడు అమ్మమ్మ, తాతయ్య ఇచ్చే చిల్లరను తన కిడ్డీ బ్యాంకులో పదిలంగా దాచుకుంది. ఆ కిడ్డీ బ్యాంకులోని చిల్లరంతా తీసుకొని గిఫ్ట్ షాపుకు వెళ్లింది.
అక్కడ తమ్ముడికి ఇష్టమైన బొమ్మ కనిపించడంతో దాన్నే సెలెక్ట్ చేసుకుంది. కానీ, స్వీటీ ఇచ్చిన రూ.1, రూ.5 కాయిన్స్ తీసుకున్న షాపు యజమాని రూ.10 కాయిన్స్ మాత్రం చెల్లవని తీసుకోలేదు. దీంతో బొమ్మను కొనకుండానే స్వీటీ ఉత్తి చేతులతో తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పాల్సి వచ్చింది.
రూ.10ల కాయిన్స్ చెల్లవనే అపోహా స్వీటీ చిట్టి మనసును చిన్న బుచ్చుకునేలా చేసింది.
ఫొటో సోర్స్, wikipedia.org
ఇదే అపోహ మహేందర్‌ను ఒక జాబ్ ఇంటర్య్వూకు దూరం చేసింది.
స్టేషన్‌ఘన్‌పూర్ కు చెందిన మహేందర్‌కు వరంగల్‌లోని ఒక ప్రైవేటు కంపెనీ నుంచి ఇంటర్య్వూ కోసం పిలుపు వచ్చింది.
ఉదయాన్నే కిక్కిరిసి ఉన్న ఆర్టీసీ బస్సులో స్టేషన్‌ఘన్ పూర్ నుంచి మహేందర్ బయలుదేరారు. కండక్టర్ టికెట్ అడగడంతో పర్సులో ఉన్న రూ.10 కాయిన్స్ ఇచ్చారు. వాటిని తీసుకోడానికి కండక్టర్ నిరాకరించారు. రూ.10 కాయిన్స్ తీసుకోమని కరాఖండిగా చెప్పారు. చేసేది లేక మార్గమధ్యలోని మహేందర్ బస్సు దిగాల్సి వచ్చింది.
'రూ.10 కాయిన్స్ పై వచ్చిన పుకార్లు నన్ను ఇంటర్య్వూకు దూరం చేసింది. కండక్టర్లను ఎందుకు తీసుకోవడం లేదని అడిగితే ప్రయాణికులు తీసుకోవడం లేదు కదా అందుకే మేము కూడా తీసుకోవడం లేదని చెబుతున్నారు' అని మహేందర్ బీబీసీకి తెలిపారు.
స్విటీ, మహేందర్లే కాదు రూ.10 కాయిన్స్‌తో ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఫొటో సోర్స్, rbi.org
రూ.10 కాయిన్స్ పై ఎందుకీ అపోహలు?
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన తర్వాత సామాన్యులకు మరో సమస్య తలెత్తింది. అదే రూ.10 కాయిన్స్ చెల్లుబాటుపై వస్తోన్న పుకార్లు.
'ప్రజల్లో రూ.10 కాయన్స్పై అనేక భయాలున్నాయి. కొత్తవి, పాతవి కలిపి చాలా రూపాల్లో రూ.10 కాయిన్స్ కనిపిస్తుండటంతో కొందరు గందరగోళానికి గురవుతున్నా'రని హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న అజయ్ తెలిపారు.
'కాయన్ మీద 10 లైన్లు, 15 లైన్లు ఉన్నవాటిని తీసుకోవడం లేదు. ఆటో డ్రైవర్లు, టీ కొట్టు దగ్గర నాకు ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయ'ని ఆయన చెప్పారు.
ఎక్కడా తీసుకోవడం లేదు
'ఏ రూపంలో ఉన్నా చెల్లుతాయి'
రూ.10 కాయిన్స్ చెల్లవని వస్తోన్న పుకార్లపై ఆర్బీఐ స్పందించింది. ఇలాంటి పుకార్లను అరికట్టడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మొబైల్ ఫోన్లకు సందేశాలు కూడా పంపుతోంది.
అన్ని రకాల రూ.10 కాయిన్స్ చెల్లుతాయని, అపోహలుంటే 14440 టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ప్రజలకు సూచిస్తోంది.
ఫొటో సోర్స్, Praveen Kasam
జనవరిలో దీనికి సంబంధించి ఆర్బీఐ ఒక ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేసింది.
'' భారత దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దేశంలోని అనేక మింట్ కేంద్రాలలో భిన్న రూపాల్లో ఉండే రూ.10 కాయిన్స్ ముద్రించాం. కాలానుగుణంగా కూడా కాయిన్స్ రూపంలో, పరిమాణంలో మార్పులు వచ్చాయి. అవన్నీ చెల్లుబాటు అవుతాయి' అని ఆర్బీఐ పేర్కొంది.
ఫొటో సోర్స్, Ravisankar Lingutla/BBC
అపోహలు- నిజాలు
- అపోహ: కొన్ని రూ.10 కాయిన్స్‌పై కొత్తగా ప్రవేశ పెట్టిన ₹ గుర్తు లేదు. అవి చెల్లవు.
- నిజం: పాత రూ.10 కాయిన్స్ పై ₹ గుర్తు ఉండదు. అయినా అవి చెల్లుతాయి.
- అపోహ: కొన్ని రూపాల్లో ఉన్న రూ.10 కాయిన్స్ చెల్లవు
- నిజం: 14 రూపాల్లో కనిపించే అన్ని రకాల రూ.10 కాయిన్స్ చెల్లుతాయి.
- అపోహ:బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.10 కాయిన్స్ తీసుకోవడం లేదు.
- నిజం: ఆర్బీఐ నిబంధనల ప్రకారం అందరూ తీసుకోవాల్సిందే. ఇప్పటికే ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.
- అపోహ:కొన్ని పాత రూ.10 కాయిన్స్ మూడు భాగాలుగా, రెండు రకాల గీతలతో కనిపిస్తున్నాయి. అవి చెల్లవు
- నిజం: ఆ కాయిన్స్ 26 మార్చి 2009 కు ముందు ముద్రించినవి. అవన్ని చెల్లుతాయి.
ఇటీవల శ్రీమద్ రాజ్ చంద్ర 150వ జయంతి సందర్భం ఆయన గౌరవార్థం, అలాగే, నేషనల్ ఆర్కైవ్ బిల్డింగ్ స్థాపించి 120 ఏళ్లు అవుతున్న సందర్భంగా దాన్ని గుర్తు చేసుకునేందుకు కొత్తగా రెండు పది రూపాయిల కాయిన్స్ ఆర్బీఐ ముద్రించింది. ఇవి కూడా చెల్లుబాటు అవుతాయి.
'ఆర్బీఐ ప్రకటనతో పరిస్థితి మారుతోంది'
‘రూ.10 కాయిన్స్ చెల్లవని వచ్చిన పుకార్లతో ప్రజలు గందరగోళానికి గురయ్యారని, అయితే ఆర్బీఐ ప్రకటనలతో అవగాహన కల్పించడంతో కాస్త మార్పు వచ్చింద‘ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నిడిగొండ బ్రాంచ్ మేనేజర్ అనిల్ తెలిపారు.
'మా బ్యాంకుల్లో రూ.10 కాయిన్స్ తీసుకుంటున్నాం. ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. బ్యాంకు నుంచి రూ.10 కాయిన్స్ ఇస్తున్నాం' అని అనిల్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- కెనడా ప్రధాని పర్యటనకు భారత్ ప్రాధాన్యం ఇవ్వడం లేదా?
- ‘ఇక్కడ ప్రాణాలు పోతుంటే అక్కడ నేతలు చోద్యం చూస్తున్నారు!’
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- నాలుగేళ్లలో 25,600 బ్యాంకింగ్ మోసాలు, రూ.22,743 కోట్లు విలువైన కుంభకోణాలు
- ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ఇరాన్: నెతన్యాహు
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)