అసంతృప్త నేతలకు ఎరవేస్తూ ఈశాన్య భారతంలో బీజేపీ పాగా

  • 21 ఫిబ్రవరి 2018
అసోంలో మోదీ ర్యాలీ Image copyright BIJU BORO/AFP/Getty Images

2019 సాధారణ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లో తమ సత్తా చాటడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పట్నుంచే రంగం సిద్ధం చేసుకుంటోంది.

2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈశాన్య భారతంలో ఒక్క అసోంలో తప్ప బీజేపీ మరెక్కడా అంత ప్రభావవంతంగా లేదు. అంతకుముందు దేశంలో ఎన్నో విజయవంతమైన ఎన్నికల ర్యాలీలను మోదీ నిర్వహించారు. అలాంటిది అగర్తలాలో నిర్వహించిన ర్యాలీకి పెద్దగా జనాలు రాకపోవడం ఆయన్ని కలవరపాటుకు గురిచేసింది.

2016లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమంలో ఆ విజయాన్ని కీలక మలుపుగా బీజేపీ భావించింది.

అసోం తర్వాత మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలోనూ బీజేపీ పట్టు సాధించింది. ఆ తరువాత ఇతర పార్టీల్లో అసంతృప్తుల కోసం బీజేపీ వేట ప్రారంభించింది. ఆ వలలో అసోంకు చెందిన కాంగ్రెస్ నేత హిమంతా బిశ్వశర్మ చిక్కారు. శర్మను అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కి కుడి భుజంగా భావించేవారు.

Image copyright BIJU BORO/AFP/Getty Images
చిత్రం శీర్షిక అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ప్రధానమంత్రి మోదీ

అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే శర్మ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. దాన్ని బట్టి చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ భవితవ్యం ఏంటో శర్మ ముందుగానే అంచనా వేశారని పరిశీలకులు చెబుతారు.

ఇదే తరహాలో కేవలం కాంగ్రెస్ నుంచే కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్), తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులను వేటాడి తమ పార్టీలో కలుపుకుంది బీజేపీ. క్రమంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాల్లో తన పరిధిని విస్తరించుకోవడం ప్రారంభించింది.

"కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మేం కష్టపడి మా పునాదుల్ని నిర్మించుకున్నాం. అంతకుముందు ఆ రాష్ట్రాల్లో బీజేపీకి అసలు ఉనికే లేదు. అలాంటి పరిస్థితుల్లో మేం కాస్త తెలివిగా రాజకీయ పావులు కదిపి విజయం సాధించాం" అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బీబీసీతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నారు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక రామ్ మాధవ్

ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్మూ కశ్మీర్‌కు రామ్ మాధవ్ పార్టీ తరఫున బాధ్యులుగా ఉన్నారు. ఆయన ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకించి వేర్పాటువాద సంఘాలతో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో తన మాతృసంస్థ ఆరెస్సెస్‌తో కలిసి బీజేపీ నెమ్మదిగా పాగా వేయడం మొదలుపెట్టింది. ఈ పరిణామం బూత్ స్థాయిలో పార్టీ బలపడటానికి దోహదం చేసిందని, మాజీ సంఘ్ సభ్యుడు సునీల్ దేవ్‌ధర్ అంటారు.

మేఘాలయలో పార్టీని బలపరిచేందుకు కృషి చేసిన దేవ్‌ధర్, త్రిపురలో కూడా పాతికేళ్ల పాటు అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి బీజేపీ ప్రధాన పోటీదారుగా మారేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు.

"త్రిపురలో కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను దేశంలోని వేరే రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పోల్చడానికి లేదు. అక్కడ వాళ్ల కృషి మూలంగా కాంగ్రెస్ మాత్రమే కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చేది", అని దేవ్‌ధర్ బీబీసీతో అన్నారు.

త్రిపురలో కాంగ్రెస్ నుంచి మాత్రమే కాకుండా, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా అభ్యర్థులను సమీకరించడంలో బీజేపీ విజయం సాధించింది. వీరిలో కొందరు అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ చేశారు.

Image copyright EPA/STR
చిత్రం శీర్షిక త్రిపురలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ర్యాలీ

బీజేపీ "కుటిల రాజకీయాలు" ప్రదర్శించిందని సీపీఎం నాయకుడు ఝుము సర్కార్ అన్నారు. 'ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ బీజేపీ నాయకులంతా గతంలో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలకు చెందిన నాయకులే. కొందరైతే కేవలం బీజేపీ ఎరవేసిన డబ్బుకి ఆశపడి ఆ పార్టీలో చేరారు' అని సర్కార్ అన్నారు.

ఈశాన్య భారతానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖుడు తరుణ్ గొగోయ్ మాత్రం, పార్టీలో జరిగిన నిష్క్రమణలు తమకు మంచివేనని బీబీసీతో అన్నారు. 'కాంగ్రెస్‌లో గతంలో కూడా చీలికలు ఏర్పడ్డాయి. అందుకే అవి మాపైన ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఆ నిష్క్రమణల వల్ల కొత్త వారు పార్టీలోకి వచ్చేందుకు అవకాశాలు కలుగుతాయి' అని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ ఆ రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి ఆరెస్సెస్ పునాది వేసిందని పరిశీలకులు భావిస్తారు. ఆరెస్సెస్ క్యాడర్, వ్యూహాత్మక కార్యాచరణ లేని పక్షంలో బీజేపీ ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో అష్టకష్టాలు పడుతుండేదని వారు చెబుతారు.

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ పరిణామాలను చూస్తే.. బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యే ప్రయత్నాలను జోరుగా సాగిస్తోందని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం