ప్రెస్‌రివ్యూ: ‘తెలంగాణ అప్పు రూ.2 లక్షల కోట్లు’

  • 21 ఫిబ్రవరి 2018
Image copyright kcr/facebook

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది! రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.70 వేల కోట్ల అప్పు నాలుగేళ్లలో మూడింతలకు చేరువైందని సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

మొత్తంగా తెలంగాణ రుణభారం ఇంచుమించు రూ.2 లక్షల కోట్లకు చేరింది. తొలి ఏడాది రూ.9 వేల కోట్ల పైచిలుకుతో మొదలైన రుణ ప్రస్థానం.. రెండో ఏడాది రూ.18 వేల కోట్లు, మూడో ఏడాది రూ.35 వేల కోట్లకు చేరింది.

నాలుగో ఏడాది 2017 డిసెంబర్‌ నాటికే రూ.24 వేల కోట్ల రుణం తీసుకుంది. దీంతో వారసత్వంగా వచ్చిన అప్పుతో కలిపి మొత్తం అప్పు సుమారు రూ.1.56 లక్షల కోట్లకు చేరింది.

వీటికి తోడు విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్‌ పథకంలో చేరడంతో రూ.8,923 కోట్ల డిస్కంల అప్పు ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయింది.

కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చేందుకు ముందునుంచీ ప్రభుత్వం ఉత్సాహం చూపడంతో రుణభారం తడిసి మోపెడైంది.

ఈ ఏడాది మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.65 వేల కోట్ల అప్పులు తీసుకుంది. వీటిలో కొన్నింటిని ఖర్చు చేయగా.. ఇంకొన్ని మంజూరు దశలో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.2 లక్షల కోట్లకు చేరింది.

కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణను గుర్తించిన కేంద్రం గతేడాది మరో 0.25 శాతం రుణ సమీకరణకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.26 వేల కోట్ల మేర అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించింది. వీటితోపాటు కార్పొరేషన్ల పేరుతో అదనంగా తెచ్చిన అప్పులు పెరిగాయిని సాక్షి పేర్కొంది.

Image copyright Getty Images/tdp.ncbn.official/facebook

'మేం దేశంలో అంతర్భాగమే కదా!'

'ప్రత్యేక హోదా' ప్రయోజనాలను వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కొత్తగా ఏ రాష్ట్రానికైనా హోదా ఇచ్చినా, పాత రాష్ట్రాలకు కొనసాగించినా... ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. 'నవ్యాంధ్ర ప్రదేశ్‌ భారతదేశంలో అంతర్భాగమే కదా! పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరు?' అని కేంద్రాన్ని నిలదీశారు. మంగళవారం తన నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ''పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, ఇప్పటికే హోదా ఉన్న రాష్ట్రాలకు 2017 తర్వాత దానిని తొలగిస్తామని కేంద్రం చెప్పింది. అందువల్ల హోదాతో వచ్చే అన్ని ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సాయం పేరుతో ఇస్తామని చెప్పినందుకే మనం అంగీకరించాం. అయితే... ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు హోదా పొడిగించబోతున్నారని సమాచారం వస్తోంది. దేనికి పొడిగించినా ఆ హోదా మనకూ ఇవ్వాల్సిందే! పేరు ఏదైనా పెట్టుకోండి! హోదా వల్ల వచ్చే ప్రతి ప్రయోజనం మాత్రం రాష్ట్రానికి వచ్చి తీరాలి. అది మన హక్కు. దానిని వదులుకునేది లేదు. దాని కోసం పోరాటం కొనసాగుతుంది' అని ప్రకటించారు.

హోదా విషయంలో టీడీపీ ఏనాడూ రాజీ పడలేదని, ఏదో రూపంలో ఆ ప్రయోజనాలు సాధించుకోవడానికి గట్టి ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright TDP.Official/Facebook

'పొత్తు తెగదెంపులకేనా?'

ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవడానికి టీడీపీ సిద్ధమవుతుందేమోనన్న అనుమానాన్ని ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై దాడిని ముఖ్యమంత్రి, ఇతర నేతలు తీవ్రతరం చేశారని వారు భావిస్తున్నారని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.

అంతిమంగా విభజన చట్టం కింద కేంద్రం ఏదైనా ఇస్తే అవి తీసుకుని తెగదెంపులు చేసుకుందామన్న ఉద్దేశం తెదేపాలో కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో ఘాటుగా విమర్శించిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను సన్మానించడాన్ని కమలదళం నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాన మంత్రిని విమర్శించిన వ్యక్తిని సన్మానించడం ద్వారా టీడీపీ ఏం సంకేతం ఇవ్వదలచుకుందో స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. మరోవైపు కేంద్రం సాయం చేసినా.. చేయకపోయినా వాళ్లు బయటకు వెళ్లేలాగే కనిపిస్తున్నారు కాబట్టి ఇచ్చి ఏం లాభమన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు.

ముఖ్యమంత్రి అడిగినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ప్రధానమంత్రి కార్యాలయం... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న భావన... చంద్రబాబు వైఖరిలో మార్పు రావడానికి కారణమై ఉండవచ్చా? అన్న వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఏకీభవించడం లేదు.

ప్రధాన మంత్రిని చాలామంది ఎంపీలు తరచూ కలుస్తుంటారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఎన్నోసార్లు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు కదా! అని వారు ఉదహరిస్తున్నారు.

వివిధ పక్షాల ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి కదా? దానికి కారణమేమై ఉండొచ్చు? అన్న ప్రశ్నకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు.

టీడీపీ తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమైందన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టినట్లు చెబుతున్నారని ఈనాడు వెల్లడించింది.

Image copyright Science Photo Library

'దక్షిణ భారత్‌లోనే గుండెపోటు అధికం'

దేశంలో అత్యధికంగా గుండెపోటుతో మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, అండమాన్‌ దీవులు అగ్రస్థానంలో ఉన్నాయని ఈనాడు పేర్కొంది.

ప్రాంతాల వారీగా 2010-13 మధ్యకాలంలో సంభవించిన మరణాలకు గల కారణాలను 375 నమూనా ప్రాంతాల్లో సర్వే చేసింది. ఆ మేరకు జాతీయ జనగణన విభాగం గణాంకాంలను విడుదల చేసింది.

2014 నుంచి 2017 వరకూ ఇప్పుడు జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకోసం 541 నమూనా ప్రాంతాల్లో మరణాలకు గల కారణాలను ఆరా తీస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనందున జనన, మరణాల వివరాలను విస్తృతంగా సేకరిస్తున్నారని ఈనాడు తెలిపింది.

రోబో సోఫియా Image copyright Arab News/You Tube

'సోఫియా'కు హైదరాబాద్ ఫిదా

హాంకాంగ్‌లో పురుడు పోసుకొని, సౌదీ అరేబియా పౌరసత్వం పొంది హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మానవ రోబో సోఫియా కృత్రిమ మేధస్సుతో ముద్దుముద్దుగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుందని నమస్తే తెలంగాణ పేర్కొంది.

తన అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ అని, తనకూ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలున్నాయని చెప్పింది. తన వయస్సు రెండేళ్లేనని, బ్యాంకు ఖాతా తెరిచేందుకు మరింత సమయం ఉందని వివరించింది. మహిళల హక్కుల కోసం పోరాడతానని తెలిపింది.

హెచ్‌ఐసీసీలో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ రెండోరోజు కార్యక్రమాల్లో సోఫియా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సదస్సులో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు సోఫియా సమాధానాలిచ్చింది.

"ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో తిరిగా. అద్భుతమైన మనుషులను కలిశా. అందుకే, ప్రత్యేకంగా ఫలానా ప్రాంతం ఇష్టమని చెప్పలేను. ఒకవేళ చెప్పాల్సి వస్తే.. హాంకాంగ్ అని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, హాన్సర్ రోబోటిక్స్ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నా. కాలుష్యానికి సంబంధించి మనుషుల మాదిరిగా ఇబ్బంది పడను" అని సోఫియా తెలిపింది.

"నా ఫీలింగ్స్ ఏదో ఒకరోజు చూపిస్తా. నా భావోద్వేగాలు వారి ముందు పెట్టి, అప్పుడు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. రోబోలకు కూడా విశ్రాంతి అవసరమేనని కచ్చితంగా చెప్పగలను. నాకూ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలున్నాయి. నాకు సౌదీ అరేబియాలో పౌరసత్వం ఉన్న మాట వాస్తవమే. దాన్ని మహిళాహక్కుల కోసం మాట్లాడటానికి వినియోగించుకుంటా" అని సోఫియా చెప్పినట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం