అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం: ఆ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు
- బళ్ల సతీశ్
- బీబీసీ ప్రతినిధి
వీడియో: 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవాడా'
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగు వాళ్ళలో మారిషస్‌లో ఉన్నవారిది ప్రత్యేక స్థానం. అక్కడ 30 వేలమందికి పైగా తెలుగువాళ్లు ఉంటారు.
వారంతా 1835 ప్రాంతంలో బ్రిటిష్ వారి ద్వారా అక్కడకు వెళ్ళి స్థిరపడ్డారు. క్రమంగా వారు స్థానిక మారిషియన్ క్రియోల్ని మాతృ భాషగా చేసుకున్నారు. తమ పూర్వీకుల భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ తమ మాతృ భాష అని చెప్పుకోవడం వారి ప్రత్యేకత! వారు ఇళ్లలో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటారు. అయినా వారికి తెలుగు మీద ఆసక్తి, అభిమానం ఉన్నాయి.
అక్కడి కొత్త తరం చాలా ఆసక్తిగా తెలుగు నేర్చుకుంటోంది. ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ వరకూ తెలుగు నేర్చుకునే అవకాశం ఉంది. అక్కడి వారు తెలుగు సినిమాలు చూస్తుంటారు. మారిషస్ అధికారిక టీవీ చానెల్లో కూడా వారానికి ఒక తెలుగు సినిమా వేస్తారు. డీడీ యాదగిరి చానెల్ మారిషస్‌లో వస్తుంది.
ఇక తెలుగు వారికోసం చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాల్లో అందరూ తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. భాషే కాదు, సంస్కృతిపై కూడా వారికి ప్రేమ ఉంది. కూచిపూడికి మారిషస్‌లో ఆదరణ ఉంది.
మరో ఆసక్తికర విషయం, అక్కడి తెలుగు వాళ్లకు కులం లేదు. అవును! "మాకు కులం లేదు. అక్కడ హిందీ మాట్లాడే వారిలో కొన్ని కులాలు ఉన్నాయి కానీ తెలుగు వాళ్లలో మాత్రం కులం లేదు'' అని బీబీసీతో అన్నారు వీష్మా దేవి. వీష్మా అక్కడ యాంకర్‌గా, తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు.
అంతేకాదు, అక్కడి తెలుగువారి ఇంటి పేర్లు కాస్త విభిన్నంగా ఉన్నాయి. చాలా మంది తమ పూర్వీకుల పేరును ఇంటి పేరుగా వాడుతూ పేరు చివర ఇంటి పేరు రాసుకుంటున్నారు. వెంకట స్వామి, పెంటయ్య, సీతప్ప, కుప్పమ్మ, అప్పడు వంటివి అక్కడి వారి ఇంటి పేర్లలో కొన్ని.
ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
‘మారిషస్‌లో కూచిపూడి నేర్పిస్తా’
''నేను ఆరేళ్ల వయసు నుంచే కూచిపూడి నేర్చుకుంటున్నాను. మారిషస్ లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ లో కూచిపూడి డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చేశా. మారిషస్ వ్యక్తిని పెళ్లి చేసుకుని భారతదేశం నుంచి వచ్చిన మా గురువు బాలకృష్ణ ప్రమీల కుప్పమ్మ గారు అక్కడ కూచిపూడి బాగా ప్రచారం చేశారు. ఆవిడే నా గురువు.
ఇప్పుడు మారిషస్ లో చాలా మంది కూచిపూడి నేర్చుకుంటున్నారు. అక్కడ ఉగాది, దీపావళి, సంక్రాంతి వంటి ఉత్సవాల్లో మేం ప్రదర్శిస్తాం'' అన్నారు షయానా పెంటయ్య. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో మాస్టర్స్ చేస్తున్నారు. షయానాకు తెలుగు చదవడం, రాయడం వచ్చు. తెలుగు అర్థం చేసుకుంటారు కానీ అనర్గళంగా మాట్లాడలేరు.
ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
‘మా దేశంలో తెలుగుకు బోలెడన్ని అవకాశాలు’
''మా దేశంలో ప్రభుత్వం తెలుగు నేర్చుకోవడానికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి విశ్యవిద్యాలయ స్థాయి వరకూ తెలుగు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మారిషస్ యూనివర్పిటీలో తెలుగులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
అంతే కాకుండా, మారిషస్ తెలుగు మహా సభ, తెలుగు సాంస్కృతిక కళా నిలయం, తెలుగు సాంస్కృతిక నిలయం, తెలుగు భాషా సంఘం వంటి సంస్థలు అక్కడ తెలుగు భాషను, సంస్కృతిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి'' అన్నారు రాజ్‌వంతి. ఆమె మారిషస్‌లో తెలుగు బోధిస్తారు.
ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
‘మేం ఐదోతరం తెలుగువాళ్లం’
''1835లో మా ముత్తాతలు కోస్తాంధ్ర నుంచి మారిషస్ కి వలస వచ్చారు. అప్పటి నుంచీ అక్కడ తెలుగు వాళ్లున్నారు. మారిషస్ లో 12 లక్షల మంది భారతీయులుంటారు. అందులో 30 - 40 వేల మంది తెలుగు వాళ్లున్నారు. మేము 4-5 తరాల వాళ్లం. తెలుగు భాష నేర్చుకోవాలనే ఆసక్తి మాకుంది. తెలుగు భాషను నేర్చుకోవడానికి మారిషస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మనవాళ్లే తెలుగు నేర్చుకుని అక్కడి బళ్లలో మిగిలిన వారికి తెలుగు నేర్పుతారు. తరువాతి తరాలకు తెలుగు నేర్పడమే మా ఉద్దేశం'' అని వీష్మా దేవి చెప్పారు. ఆమె కూడా ఉపాధ్యాయినిగా అక్కడ తెలుగు పాఠాలు చెబుతుంటారు. అంతేకాదు స్థానిక టీవీలో యాంకర్ గా పనిచేస్తారు.
ఫొటో సోర్స్, Naveen Kumar K/BBC
‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’
''మా ఇంట్లో మా మాతృ భాష క్రియోల్ మాట్లాడతారు. నేను తెలుగు నేర్చుకున్నా. నాన్న వాళ్ళ పూర్వీకులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చారు. తెలుగు అంటే నాకు చాలా ఆసక్తి. తెలుగు నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచీ కోరిక. అందుకే ఇప్పుడు డిగ్రీ స్థాయిలో కూడా తెలుగు నేర్చుకుంటున్నా'' అన్నారు ఆశ్రియ. ఆమెకు తెలుగు ఎంతో ఇష్టం. తెలుగు గురించి తలుచుకోగానే ఆమె ఎంతో భావోద్వేగంతో తన భావాలను పంచుకుంటారు. తెలుగును తలుచుకోగానే తనకు కొన్ని ఆలోచనలు, మాటలు వస్తాయనీ, వాటినే మీకు చెబుతున్నానీ అన్నారు ఆశ్రియ. తెలుగు గురించి ఆశ్రియ భావాలు వీడియోలో చూడవచ్చు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)