ప్రెస్ రివ్యూ: చంద్రబాబు తన హీరో అన్న కమల్ హాసన్

కమల్ హసన్

ఫొటో సోర్స్, TWITTER @ikamalhaasan

ఏపీ సీఎం చంద్రబాబు తన హీరో అని కమల్‌ హాసన్‌ పేర్కొన్నారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

ఆయన దేశంలోనే ఆదర్శ పాలకుడని.. అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న నాయకుడని కొనియాడారు. రామేశ్వరంలో కమల్‌ మాట్లాడుతూ చంద్రబాబు మంగళవారం రాత్రి తనకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారని వెల్లడించారు. తాను కమల్‌ అభిమానినని, మదురై సభకు రాలేకపోతున్నానని చెప్పారని అన్నారు.

'మీ కార్యాచరణను ప్రారంభించండని ఆయన నన్ను ప్రోత్సహించారు. మీ సిద్ధాంతాలు, నా సిద్ధాంతాలు వేర్వేరు. అయినా నేను మీ వీరాభిమానినని ఆయనకు చెప్పాను. ప్రజలకు ఏది అవసరమో అదే చేయండి.. సంక్షేమ పథకాల జాబితా సిద్ధం చేసుకోండని సూచించారు.

ఆయన అలా చెప్పడం నాకెంతో మనోధైర్యాన్నిచ్చింది. ఆయన మంచి సిద్ధాంతాలున్న మహనీయుడు. చంద్రబాబు మాటలు శిరసావహిస్తాను' అని కమల్‌ పేర్కొన్నారు.

ద్రావిడ సిద్ధాంతాలను అనుసరిస్తానని ప్రకటించిన కమల్‌.. శుభముహూర్తాన్ని ఎంచుకున్నారా?.. నాస్తికుడైన ఆయన.. పెద్దల మాటల మేరకు మంచి నక్షత్రంలోనే పార్టీ ప్రకటించారా?.. అవుననే అంటున్నాయి ఆయన వ్యతిరేక వర్గాలు.

'భరణి నక్షత్రంలో పుట్టినవారు ధరణిని ఏలుతారు' అని తమిళుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కమల్‌ ఆ నక్షత్రం రోజున పార్టీ ప్రకటన కార్యక్రమాన్ని ఎంచుకున్నారని పండితులు చెబుతున్నారు.

అంతేగాక బుధవారం షష్టీ తిథి కూడా విజయానికి దోహదపడుతుందని తమిళుల నమ్మకం. కనుకనే ఈ రెండూ కుదిరిన సమయంలో కమల్‌ పార్టీ పేరును ప్రకటించారని వారు పేర్కొంటున్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, KTR/FACEBOOK

ప్రమిద ఆకృతిలో అమరుల స్మృతివనం

తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళిగా సచివాలయం ఎదురుగా హుస్సేన్‌సాగర్‌ తీరంలోని 12 ఎకరాల సలంలో నిర్మించనున్న స్మృతివనం, స్తూపం ఆకృతుల నమూనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ఖరారు చేశారని 'ఈనాడు' తెలిపింది.

మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులు, పార్టీ నేతలతో చర్చించాక వీటికి ఆమోదం తెలిపారు. కేటీఆర్‌ వాటి నమూనా చిత్రాలను ట్విట్టర్‌లో పెట్టారు. స్మృతి వనం నమూనా వెలుగుతున్న దీపపు ప్రమిద ఆకారంలో ఉండగా, స్థూపం సైతం స్ఫూర్తిదాయక రీతిలో ఉంది.

శిఖరం అంచున తెలంగాణ తల్లి బొమ్మ ఉండేలా, వెనకభాగంలో వెలుగులీనేలా చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని, అమరవీరుల త్యాగనిరతిని భవిష్యత్తు తరాలు తలచుకునేలా స్మృతివనం, స్థూపం నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటికి ప్రముఖ సంస్థల నుంచి ఆకృతులను తయారు చేయించారు. వచ్చిన వాటన్నింటిని పరిశీలించి తుది ఎంపిక జరిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించాలని ఆయన అధికారులకు నిర్దేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సమాచారంతో స్మృతివనాన్ని సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా, తెలంగాణ గౌరవం ఉట్టిపడేలా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.

తెలంగాణ కోసం జీవితకాలం పోరాడిన ఆచార్య జయశంకర్‌ వంటి ప్రముఖుల చరిత్రను ఇందులో పొందుపరచాలని ఆయన ఆదేశించారు. శాశ్వత మ్యూజియం, దృశ్యశ్రవణ మందిరం, సమావేశ మందిరం, భోజనశాల వంటివి ఇందులో ఉంటాయిని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/Getty Images

ఫొటో క్యాప్షన్,

కోదండరామ్

కోదండరాంతో అసంతృప్త టీఆర్ఎస్ నేతల రహస్య మైత్రి'

ప్రొఫెసర్‌ కోదండరాంతో టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు రహస్య మైత్రి కొనసాగిస్తున్నారా? టీజేఏసీకి, టీజేఏసీ పెట్టబోయే పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఇందుకు టీజేఏసీతోపాటు టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వస్తున్నాయిని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనాన్ని రాసింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్‌ మార్చ్‌ను నిర్వహించిన మార్చి 10వ తేదీన టీజేఏసీ నుంచి రాజకీయ పార్టీ ప్రకటన రావచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం ప్రకారం నూతన పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లు చక్కబెట్టడానికి 200 మందితో కమిటీ ఏర్పాటైంది.

ఈ పరిణామాలపై అధికార టీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును స్వాగతిస్తూనే.. ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది? ఇప్పటివరకు కోదండరాం మినహా ప్రజలందరికీ తెలిసిన నేతలు ఎవరూ లేకుండా ఏర్పాటయ్యే కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందా? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి టీఆర్‌ఎస్‌, టీజేఏసీ మధ్య గత కొంతకాలంగా ఉప్పు, నిప్పు వాతావరణం కొనసాగుతోంది. కోదండరాం పనిగట్టుకొని తమ ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారనే ఆగ్రహం టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ వేర్వేరు కారణాలతో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరు కోదండరాంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు కోదండతో ఏదో ఒక రకంగా టచ్‌లో ఉంటున్నారన్న విషయం 'గులాబీ' అధినాయకత్వానికి కూడా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు ప్రభుత్వం, పార్టీలో కొందరు నేతలు ప్రాబల్యాన్ని చాటుతుండటం ఇష్టంలేని నేతలు కూడా పలువురు కోదండరాంతో సంబంధాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Sridhr Raju

హిందూయేతర ఉద్యోగులను తొలగించొద్దు

తిరుమల, తిరుపతి దేవస్థానాలతో పాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే దేవాలయాలు, ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు తొలగించవద్దని హైకోర్టు బుధవారం టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈవో)ను ఆదేశించిందని 'సాక్షి' తెలిపింది.

అయితే ఈవో జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు మాత్రం సమాధానం ఇవ్వాలని హిందూయేతర ఉద్యోగులకు స్పష్టం చేసింది.

ఈవో జారీ చేసిన షోకాజ్‌ నోటీసుల చట్టబద్ధతపై తరువాత లోతుగా విచారణ జరుపుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసిందని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, NAGAMJANARDHANREDDY/FACEBOOK

కాంగ్రెస్‌లోకి నాగం జనార్దన్‌రెడ్డి!

మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయిని ఈనాడు పేర్కొంది.

ప్రస్తుతం భాజపాలో ఉన్న ఆయన..కొద్దికాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో భాజపా నుంచి జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీగా, ఆయన కుమారుడు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి..ఇద్దరూ ఓడిపోయారు.

అప్పటి నుంచి జనార్దన్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భాజపా కార్యక్రమాలకూ హాజరుకావడం లేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రావడంతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

తాజాగా రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు జనార్దన్‌రెడ్డిని రాహుల్‌ దగ్గరకు తీసుకువెళ్లినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నాగం ఆసక్తి చూపిస్తున్నారని...రాహుల్‌ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలిసింది. మార్చి 18 తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయి.

దీనిపై నాగంను సంప్రదించగా..నియోజకవర్గంలో తన అభిమానులు కాంగ్రెస్‌ పార్టీలో చేరమని కోరుతున్నారన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారని ఈనాడు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)