అవని చతుర్వేది: యుద్ధ విమానం ఒంటరిగా నడిపిన తొలి భారత మహిళ

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారత మహిళగా అవని చతుర్వేది చరిత్ర సృష్టించారు.
ఇరవైనాలుగేళ్ల ఈ ధీరవనిత మిగ్-21 బైసన్ విమానాన్ని సోమవారం 30 నిమిషాల పాటు నడిపారని వాయుసేన వెల్లడించింది.
భారత సైనిక దళాల చరిత్రలో ఇది గొప్ప రోజని వాయుసేన అధికార ప్రతినిధి అనుపమ్ బెనర్జీ బీబీసీతో అన్నారు.
భారత వాయుసేనలో చేరిన మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ (యుద్ధ విమాన) పైలట్లలో అవని చతుర్వేది ఒకరు.
మిగ్-21 యుద్ధ విమానం నడిపిన తర్వాత ఆ విమానం పక్కన నిలుచుని ఉన్న అవని ఫొటోను వాయుసేన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 19న ఆమె విమానం నడపగా.. గురువారం వాయుసేన ఆ విషయాన్ని ప్రకటించింది.
మరో ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్లతో పాటు అవని చతుర్వేది కూడా 2016 జూన్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వారిద్దరు సైతం శిక్షణలో భాగంగా త్వరలోనే యుద్ధ విమానాలు నడపనున్నారు.
అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు వాయుసేన కట్టుబడి ఉందని బెనర్జీ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘‘ఆ నిబద్ధత వైపుగా వేసిన మరో ముందడుగు ఇది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2016కు ముందు భారత సాయుధ బలగాల్లో మహిళలు కేవలం 2.5 శాతం మంది మాత్రమే ఉండేవారు. అది కూడా యుద్ధానికి వెలుపలి పాత్రల్లోనే వారికి చోటు లభించేది.
పొరుగు దేశమైన పాకిస్తాన్లో దాదాపు 20 మంది మహిళా యుద్ధ విమాన పైలట్లు ఉన్నారు. పాక్ 2006 నుంచి మహిళలను యుద్ధ రంగ ఉద్యోగాల్లో నియమించటం ప్రారంభించింది.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)