ప్రెస్ రివ్యూ : ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు?’

  • 23 ఫిబ్రవరి 2018
Image copyright AndhraPradeshCM/facebook

29 సార్లు దిల్లీ వెళ్లాను..

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ కథనంలో..

కేంద్రం అరకొరగా సహకారం అందించి, చేయి దులుపుకొనే పరిస్థితికి వచ్చిందని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదన్నారు.

చట్టంలోని హామీలతో పాటు రాజ్యసభలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాల్సిందేనన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద 'కియా మోటార్స్‌' ఫ్రేమ్‌వర్క్‌ ఇన్‌స్టలేషన్‌ విభాగం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చాలా ఓపిగ్గా 29 సార్లు దిల్లీ వెళ్లానని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కష్టపడి సాధించుకున్నదేనన్నారు.

''14 ఆర్థికసంఘం వద్దంది కాబట్టే ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేకసాయం చేస్తామని అన్నారు. అదీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరు?

విభజనతో నష్టపోయాం. కేంద్రానికి బాధ్యత ఉంది. హామీలు నెరవేర్చాల్సిందే. మా హక్కులు కాపాడాలి'' అని చంద్రబాబు పేర్కొన్నట్టుగా సాక్షి దినపత్రిక తెలిపింది.

Image copyright High court website

దసరా సెలవుల్లో హైకోర్ట్‌..

దసరా సెలవుల్లో హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చే అవకాశాలున్నట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది. అందులో..

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ఫుల్‌కోర్టు గురువారం సాయంత్రం హైకోర్టు సమావేశ మందిరంలో సమావేశమైంది. హైకోర్టు ఏర్పాటు కోసం భవనాల పరిశీలనకు బిల్డింగ్‌ కమిటీ గతవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

తాను పరిశీలించిన భవనాలపై ఆ కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

ఈ భవనాలు హైకోర్టు ఏర్పాటుకు అనువుగా లేవని పేర్కొన్నట్లు సమాచారం. సిటీ సివిల్‌ కోర్టుకు అనుమతించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ సారాంశాన్ని జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ న్యాయమూర్తులకు ఈ సందర్భంగా వివరించినట్లు తెలిసింది.

అమరావతిలో నిర్మించ తలపెట్టిన జస్టిస్‌ సిటీ సమీపంలోనే నేలపాడు వద్ద సిటీ సివిల్‌ కోర్టు భవనాలు నిర్మిస్తామని, ఇది శాశ్వత హైకోర్టు నిర్మించే ప్రాంతానికి సమీపంలోనే ఉంటుందని సదరు లేఖలో ప్రభుత్వం తెలియజేసింది.

మార్చి 15 నుంచి సిటీ సివిల్‌ కోర్టు నిర్మాణాలు ప్రారంభించి ఆగస్టు చివరకు.. లేదా వచ్చే దసరా సెలవులకల్లా పూర్తి చేస్తామని, ఆ భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.

హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక అందులోకి మారవచ్చని, తాత్కాలికంగా సిటీ సివిల్‌ కోర్టు భవనం నిర్మాణానికి అనుమతించాలని అభ్యర్థించింది. ఈ ప్రతిపాదనలకు ఫుల్‌కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

రాయలసీమలో ఆందోళనలు..

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్న న్యాయవాదులను కర్నూలు పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

మరికొందరిని ముందస్తు అరెస్ట్‌ చేశారు. గురువారం అనంతపురం జిల్లా పెనుకొండలో ముఖ్యమంత్రిని కలిసి రాయలసీమలో హైకోర్టును ఏర్పాటుచేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని న్యాయవాదులు నిర్ణయించారు.

అయితే వారి ప్రయత్నాన్ని అడ్డుకునే వ్యూహంలో భాగంగా పోలీసులు ముందుగానే గృహనిర్బంధాలు, అరెస్టులు చేపట్టారు. పోలీసుల చర్యపై రాయలసీమ హైకోర్టు సాధన సమితి ఆగ్రహం వ్యక్తంచేసింది.

Image copyright FACEBOOK

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జీహెచ్ఎంసీ

అధునాతన రహదారుల వ్యవస్థ కోసం హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ గురువారం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజిలో చేరిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

జీహెచ్ఎంసీ చరిత్రాత్మక అడుగేసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజిలో చేరిన ప్రారంభ క్షణాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, మేయర్‌ రామ్మోహన్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలో గంట మోగించి ప్రకటించారు.

బీఎస్‌ఈలో చేరిన మూడు నిముషాల్లోనే బాండ్ల రూపంలో రూ.200 కోట్లు సమీకరించింది. రానున్న రెండేళ్లలో మరో రూ.800 కోట్లు తీసుకుని దేశంలోని ఇతర నగరపాలక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు.

‘‘దేశవ్యాప్తంగా ఉన్న 4041 పురపాలక సంస్థల్లో రూ.1000 కోట్ల నిధుల్ని బాండ్ల ద్వారా సమీకరించే ధైర్యం ఎక్కడా జరగలేదు.

ఆర్థిక స్థోమత, స్థిరమైన ఆదాయ వనరులను పరిశీలించిన వేర్వేరు సంస్థలు బల్దియాకు ‘ఏఏ స్టేబుల్‌’ రేటింగ్‌ ఇచ్చాయి. దానిని ఉపయోగించుకుని ఎస్‌బీఐ క్యాపిటల్‌ ద్వారా బీఎస్‌ఈలో చేరాం.

మూడు నిమిషాల్లోనే 200 శాతానికి పైగా స్పందన వచ్చింది. కోరింది రూ.200 కోట్లు అయితే పెట్టుబడిదారులు రూ.455 కోట్లు ఇస్తామని ముందుకొచ్చారు. బలమైన ఆర్థిక మూలాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఫలితాలే అందుకు దోహదపడ్డాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ప్రపంచ వేదికపై చేరింది. విడతల వారీగా రూ.200 కోట్ల చొప్పున నిధులు సమీకరించి వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్‌ఆర్‌డీపీ) ముందుకు తీసుకెళ్తాం.

ఏడాదిలో హైదరాబాద్‌లోని రోడ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతాం'' అని మేయర్ చెప్పినట్టు ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright FACEBOOK

హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్..!

తెలంగాణ రాష్ట్రం లైఫ్‌సైన్సెస్, ఐటీరంగాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ లీడర్‌గా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నట్లు నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రాబోయే పది సంవత్సరాల్లో లైఫ్‌సైన్సెస్ రంగం ద్వారా సుమారు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవడం, వీటిద్వారా నాలుగులక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

నాలుగు లక్షల ఉద్యోగాల్లో అత్యధికం తయారీరంగంలోనే రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 800 కంపెనీలు, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయన్నారు.

హెచ్‌ఐసీసీలో మూడురోజులపాటు జరిగే 15వ బయో ఏషియా సదస్సు ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

''లైఫ్‌సైన్సెస్ ఆవిష్కరణలు, ఉత్పత్తి హబ్‌ల ఏర్పాటులో తెలంగాణ బలోపేతం అవుతున్నది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో మన హైదరాబాద్ ఒక్కటే దాదాపు 35 శాతం వాటా కలిగి ఉన్నది.

ప్రపంచానికి, దేశానికి తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్‌హబ్‌గా పేరుపొందింది. ప్రపంచానికి అవసరమయ్యే వ్యాక్సిన్లలో 33శాతం మనవద్దే ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రపంచస్థాయి ఫార్మా సంస్థలను విశేషంగా ఆకట్టుకోవడానికి బయోఏషియా సదస్సు తోడ్పడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

14వ బయో ఏషియా సమ్మిట్‌లో ఇచ్చిన వాగ్దానం మేరకు జీనోమ్‌ వ్యాలీకి ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ స్టేటస్‌ను మంజూరు చేశామని సహర్షంగా ప్రకటిస్తున్నాను'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)