సెల్‌ఫోన్లలో ఎక్కువ రేడియేషన్ ప్రభావం ఉన్నవి ఏవి? సెల్‌ఫోన్ రేడియేషన్ తప్పించుకోవటం ఎలా?

  • బీబీసీ ముండో
  • ...
రేడియేషన్ ప్రభావం చూపడం

ఫొటో సోర్స్, Getty Images

సెల్ ఫోన్ల రేడియేషన్ వల్ల కేన్సర్ వస్తుందా?

ప్రస్తుతం ఈ అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ వాటికి సమాధానాలే దొరకడం లేదు.

కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయనాలు చేస్తున్నారు. కానీ కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు.

రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు నాన్ ఐయొనైజింగ్ రేడియేషన్‌ను కలిగి ఉంటాయి. కానీ ఈ తరంగాలు.. ఎక్స్-రే, అల్ట్రా వయొలెట్ కిరణాల నుంచి వెలువడే ఐయొనైజింగ్ రేడియేషన్ కంటే తక్కువ ప్రభావం కలిగివుంటాయి.

సెల్‌ఫోన్ల వాడకం.. తల, మెడ, మెదడు భాగాల్లో కేన్సర్ కణతులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందా? అన్న అంశాన్ని అమెరికన్ కేన్సర్ సొసైటీ తన వెబ్‌సైట్లో వివరించింది.

అందులో.. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తరంగాలు డిఎన్ఎను నేరుగా దెబ్బతీసేంత తీవ్రంగా ఉండవని, శరీరంలోని కణజాలాన్ని వేడికి గురిచేయలేవని వివరించారు. అంతేకాకుండా.. సెల్‌ఫోన్ల నుంచి కేన్సర్ ఏవిధంగా వస్తుందో అన్న అంశంలో కూడా స్పష్టత లేదు.

కేన్సర్ వస్తుందన్న వాదనను చాలా అధ్యయనాలు బలపరుస్తున్నా, వాటిలో కూడా ఎలాంటి ఆధారాలూ లేవు.

ఫొటో సోర్స్, iStock

ఏఏ ఫోన్ల నుంచి ఎక్కువ రేడియేషన్ వెలువడుతుంది?

స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్ (ఎస్.ఎ.ఆర్) ద్వారా రేడియేషన్ ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు. ప్రతి సెల్‌పోన్‌కూ ఓ ఎస్.ఎ.ఆర్ ప్రమాణం ఉంటుంది. తయారీ సంస్థలు కూడా వారి కంపెనీ ఉత్పత్తుల ఎస్.ఎ.ఆర్ స్థాయిలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు ముందుగానే తెలపాలి.

అయితే.. చాలా మంది వినియోగదారులు ఫోన్లను కొంటున్నపుడు, వాడుతున్నపుడు ఈ విషయాన్ని పట్టించుకోరు.

జర్మనీలోని రేడియేషన్ ప్రొటెక్షన్ కార్యాలయం.. రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఎక్కువగా వెలువరించే ఫోన్ల జాబితాను తయారుచేసి, ప్రజలకు అందుబాటులో ఉంచింది.

ఫొటో సోర్స్, iStock

ఇదే ఆ ఫోన్ల జాబితా!!

ఈ జాబితాలో వన్ ప్లస్, హువాయ్ లాంటి చైనా కంపెనీలు, నోకియా, మైక్రోసాఫ్ట్ లుమియా 630 ఫోన్లు అగ్రభాగంలో ఉన్నాయి.

జాబితాలో ఐఫోన్ 7 పదో స్థానంలో, ఐఫోన్ 8 పన్నెండవ స్థానంలో, ఐఫోన్ 7 ప్లస్ పదిహేనవ స్థానంలో ఉన్నాయి. ఇక సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్-1 కాంపాక్ట్ 11వ స్థానంలో, బ్లాక్‌బెర్రీ డి.టి.ఇ.కె. 60 14వ స్థానాల్లో ఉన్నాయి.

అయితే టెలిఫోన్ రేడియేషన్‌కు సంబంధించి ఎటువంటి అంతర్జాతీయ ప్రమాణాలూ లేవు.

కానీ జర్మనీ ప్రభుత్వం మాత్రం, రేడియేషన్ స్థాయి 0.60 వాట్స్/కిలోగ్రామ్‌కు మించని ఫోన్లకు అనుమతులు ఇస్తుంది. అయినాకానీ జర్మన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో అన్ని ఫోన్లు 0.60 వాట్స్/కిలోగ్రామ్‌ కంటే రెట్టింపు స్థాయిని కలిగివున్నాయి.

వీటిలో వన్ ప్లస్ 5టి (1.68) మొదటి స్థానంలో ఉంది.

తక్కువ రేడియేషన్ వెలువరించే పోన్ల జాబితాలో సోనీ ఎక్స్‌పీరియా ఎమ్5 (0.14), సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (0.17) ఎస్6 ఎడ్జ్ ప్లస్ (0.22), గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ (0.25), సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 (0.26), ఎస్7 ఎడ్జ్ (0.26) ఉన్నాయి. జర్మన్ సంస్థ ప్రకారం.. అమెరికన్ మోటొరోలా కంపెనీకు చెందిన మోటో జీ5 ప్లస్, మోటో జడ్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మీ ఫోన్ యొక్క రేడియేషన్ స్థాయిని తెలుసుకోవాలనుకుంటే.. మీ ఫోన్ యూజర్ మాన్యువల్, లేదా ఆ కంపెనీ వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్,

మొబైల్ ఫోన్లతో కేన్సర్ వస్తుందన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు

రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలకు మనం ఎలా గురవుతాం?

ఫోన్ లోపల పొందుపరచిన యాంటెనా వద్ద ఈ తరంగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి తలను దగ్గరగా ఉంచినపుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కింది విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. గమనించండి.

  • ఫోన్లో మాట్లాడే సమయం
  • సెల్ టవర్‌కు, మీకు మధ్య దూరం (సెల్ టవర్ దూరంగా ఉంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది)
  • సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాఫిక్ (ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నపుడు తరంగాలు ఎక్కువ ఉంటాయి)
  • మీరు వాడుతున్న ఫోన్ మోడల్

అమెరికన్ కేన్సర్ సొసైటీ.. ఇలా చేయమని చెబుతోంది..

  • ఫోన్లో మాట్లాడేటపుడు దాదాపుగా స్పీకర్, లేదా హెడ్ ఫోన్స్ వాడాలి. బ్లూ టూత్‌ను తరచూ వాడే వారికి ఇది మరీ అవసరం.
  • మెసేజ్‌లను ఎక్కువగా ఉపయోగించి, వీలయినన్ని తక్కువ కాల్స్ చేయాలి. (డ్రైవింగ్‌ చేస్తున్నపుడు కాదు)
  • సెల్‌ ఫోన్ వాడకం తగ్గించడం.
  • ఎస్.ఎ.ఆర్ స్థాయి తక్కువగా ఉన్న ఫోన్ల వాడకం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)