ఉత్తరం, దక్షిణం దగ్గరవుతున్నాయా? మలుపు తిరిగిన కొరియా దేశాల సంబంధాలు!!

  • ప్రొఫెసర్ రాబర్ట్ కెల్లీ
  • పుసాన్ నేషనల్ యూనివర్సిటీ
కొరియా నృత్యకారిణి

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ కొరియాలో జరుగుతున్న 2018 వింటర్ ఒలింపిక్స్‌లో అత్యంత ముఖ్యమైన వార్త ఏమిటంటే.. అందులో ఉత్తర కొరియా పాల్గొనటం.. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంభాషణలు జరగటం.

మరైతే.. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను శాశ్వతంగా మెరుగుపరచిన ఘనత ఈ ఒలింపిక్స్‌కు లభిస్తుందా?

ప్యాంగ్‌చాంగ్‌లో క్రీడలు ప్రారంభోత్సవంలో.. ఉత్తర, దక్షిణ కొరియాల క్రీడాకారులు కలిసి ఒకే టీం లాగా కవాతు చేశారు.

ఇరు దేశాల వారూ.. తెలుపు రంగు మీద ‘‘ఏకీకృత’’ కొరియా ద్వీపకల్ప చిత్రం ఉన్న జెండాను ప్రదర్శించిన ఆ క్షణం చాలా ఉద్వేగభరిత సంకేతాన్నిచ్చింది.

ఆపైన.. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ సోదరి కిమ్ యో-జోంగ్.. ఒలింపిక్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ఇరు దేశాల అథ్లెట్లతో కూడిన సంయుక్త మహిళా ఐస్ హాకీ టీమ్ క్రీడల్లో పొల్గొంది. ఉత్తర కొరియా చీర్‌లీడర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు.

కొరియాల మధ్య ఈ ఒలింపిక్ స్నేహపునరుద్ధరణ ఇలాగే కొనసాగుతుందా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2018 వింటర్ ఒలింపిక్స్‌లో ఏకీకృత కొరియా జెండాను ప్రదర్శస్తున్న ఉత్తర కొరియా చీర్‌లీడర్లు

ఇది ఎంతకాలం కొనసాగుతుంది?

ఈ సందర్భంగా వినిపించిన అసాధారణ స్నేహపూర్వక సంభాషణల మీద ఆశల బరువు చాలా ఎక్కువగానే ఉంది.

దక్షిణ కొరియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మీడియా కవరేజీలో.. కొరియాల మధ్య సంబంధాల్లో పురోగతి కనిపిస్తోందన్న సూచనలు ప్రధానంగా ప్రతిఫలించాయి.

ఉత్తర కొరియాతో చర్చలు ‘‘ఒలింపిక్ స్ఫూర్తి’’తో మృదువుగా మారాయని దక్షిణ కొరియా ఉదారవాద మీడియా వ్యాఖ్యానిస్తోంది. అధ్యక్షుడు మూన్ జే-ఇన్ సారథ్యంలోని దక్షిణ కొరియా ఉదారవాద ప్రభుత్వం కూడా అదే స్వరం వినిపిస్తోంది.

కానీ అందరూ అంత సంతోషంగా లేరు.

సంప్రదాయవాదులు చాలా కలవరపాటుకు లోనయ్యారు. ఉత్తర కొరియాతో ఎలాంటి చర్చల్లోనైనా మరీ ఎక్కువగా తలూపకూడదంటూ దక్షిణ కొరియాలోని మితవాద మీడియా పదే పదే వాదిస్తోంది.

ఉత్తర కొరియా తన క్షిపణి, అణు కార్యక్రమాలను నిలిపివేస్తానని అస్పష్ట హామీని ఇచ్చి.. దానికి బదులుగా దక్షిణ కొరియా, అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలను ఆపివేయాలని ఉత్తర కొరియా అడగవచ్చునని, ఆ తర్వాత తన హామీని పాటించకుండా మోసం చేయవచ్చునని వీరి నుంచి వ్యక్తమవుతున్న ఒక ఆందోళన.

నిజం ఏమిటంటే.. అందరి ఆకాంక్షలు వాస్తవికమైనవి కాకపోవచ్చు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథాపూర్వ స్థితికి తిరిగివెళ్లే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు.

ఈ రెండు దేశాల మధ్య లోతుగా ఉన్న రాజకీయ విభేదాల మీద.. ఓ క్రీడా కార్యక్రమం పెద్దగా ప్రభావం చూపే అవకాశం తక్కువ.

దశాబ్దాల పాటు జరిగిన చర్చలు ఈ రెండు దేశాల మధ్య రాజీని కుదర్చలేకపోయాయి. ఈ మాటలు తీవ్ర నిస్పృహగా అనిపించినా కానీ.. ఈ సంబంధాలు మళ్లీ ఉద్రిక్తపూరిత, ఇబ్బందికర, ఆందోళనకర రూపానికి.. అయినా స్థిరమైన రూపానికి తిరిగివచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

65 ఏళ్ల కిందట కొరియా యుద్ధం ముగిసినప్పటి నుంచీ కొరియా యథాతథస్థితి ఆశ్చర్యం కలిగించేంత స్థిరంగా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో కలిసి ఓ క్రీడను వీక్షిస్తున్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ సోదరి కిమ్ యో-జోంగ్

ఎందుకు కలవలేకపోతున్నారు?

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశంగానే ఉత్తర కొరియా ఇంకా కొనసాగుతోంది. ఆ దేశ అణ్వస్త్ర కార్యక్రమం.. ఆ దేశంతో ఉన్న ప్రమాదాన్ని ఇంకా పెంచుతుంది.

ఆ దేశంతో చర్చల అవకాశాలు - గత జనవరిలో ఆ దేశమే అకస్మాత్తుగా ఆసక్తి చూపినట్లుగా ముందుకువస్తే - ఘర్షణ లేకుండా ఉత్తర కొరియాను నియంత్రించటమెలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్న ప్రపంచంలో సహజంగానే ఆశలు రేకెత్తిస్తాయి.

అయినప్పటికీ.. గత చర్చలు కుప్పకూలాయి. ఒలింపిక్స్ తీసుకొచ్చిన సంతోషకర వాతావరణాన్ని పక్కనపెడితే.. మారింది ఏమీ లేదు.

ఉత్తర కొరియా వాళ్లు చర్చల్లో చతురతతో, మొండిగా వ్యవహరిస్తారు.

అమెరికా కానీ, దక్షిణ కొరియా కానీ ఒప్పుకోవాలని వారు అడిగిన ఏ అంశాన్నైనా సాధ్యమైనంత విస్తృతంగా విశ్లేషిస్తారు. వారు చేయాలని కోరే ఏ అంశాన్నైనా సాధ్యమైనంత స్వల్పంగా వివరిస్తారు.

ఉత్తర కొరియాతో జరిగిన ఒప్పందాల అమలు.. వాటి వ్యాఖ్యానం, అమలు సమయాలు వంటి అంశాల మీద గొడవలతో పదే పదే విఫలమయ్యాయి.

ఇప్పుడు ఒలింపిక్ స్ఫూర్తితో వచ్చిన సుహృద్భావంతో ఉత్తర కొరియా వైఖరి గణనీయంగా మారే అవకాశాలు దాదాపు శూన్యం.

ఇక దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒకవిధమైన సంకేతాలు ఉండాలని దక్షిణ కొరియాలోని వామపక్ష వాదులు ఆశించవచ్చు.

ఉత్తర కొరియాను సైద్ధాంతిక ప్రత్యర్థులుగా కాకుండా.. ప్రచ్ఛన్న యుద్ధం వల్ల వేరుపడిన స్వజాతీయులుగానే ఈ వామపక్షం పరిగణిస్తుంటుంది.

కానీ.. దేశాధ్యక్షుడు మూన్ 41 శాతం ఓట్లతో ఎన్నికయ్యారు. కాబట్టి ఏకపక్షంగా కీలకమైన ఒలింపిక్ రాయితీని దేనినైనా ప్రకటించే వీలు ఆయనకు ఉండకపోవచ్చు.

దక్షిణ కొరియా మితవాదులు తీవ్రంగా మండిపడతారు. ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవటానికి చర్చలే మార్గమని ఎంతో కాలంగా చెప్తున్న.. అధ్యక్షుడు మూన్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని తహతహలాడుతున్నారని ఇప్పటికే కొందరు సంప్రదాయవాదులు ఆందోళన చెందుతున్నారు.

ఇక అమెరికా.. ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ సర్కారు దుందుడుకు స్వభావాన్ని బట్టిచూస్తే.. తీవ్ర అసంతృప్తికి లోనవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియాలో 2000 సంవత్సరంలో సమావేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే-జంగ్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఇల్

గత సదస్సుల్లో ఏం జరిగింది?

సోల్‌లో జరిగిన ఒక చరిత్రాత్మక సమావేశంలో కిమ్ యో-జోంగ్ స్వయంగా అందించిన ఉత్తర కొరియా ఒలింపిక్ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు మూన్ రానున్న నెలల్లో నిజంగా ప్యాంగ్యాంగ్ వెళ్లనూ వచ్చు.

ఇప్పటివరకూ లాంఛనంగా ఒక ఒప్పందం ఏదీ లేనప్పటికీ.. ఉభయ కొరియాలు ‘‘దానిని సాకారం చేయాలని’’ మూన్ పేర్కొన్నారు. అమెరికాతో చర్చలకు తిరిగి రావాల్సిందిగా ఉత్తర కొరియానూ ప్రోత్సహించారు.

అయినా ఇది కూడా చివరికి వట్టి గాలులే అవుతాయి: శిఖరాగ్ర సమావేశం అంటే నిజమైన పురోగతే కావలసిన అవరంలేదు. అసలు ఏం చర్చిస్తారనేది కూడా ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు.

ఉత్తర కొరియాను.. దక్షిణ కొరియా నుంచి దారితప్పిన అంతర్భాగంగా కాకుండా.. ఒక నిజమైన దేశంగా దక్షిణ కొరియా గుర్తించేలా ఈ పర్యటనను ఆ దేశం మలచుకునే ముప్పు కూడా ఉంది.

ఈ విషయంలో దక్షిణ కొరియాలో అభిప్రాయ చీలిక ఉంటుంది. అధ్యక్షుడు మూన్ వర్గం చర్చలు కోరుతుంటే.. సంప్రదాయవాదులు ఉత్తర కొరియాను సంతృప్తిపరచే చర్య అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఇంతకుముందు 2000, 2007 సంవత్సరాల్లో జరిగిన శిఖరాగ్ర సదస్సులు వాస్తవంగా ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు.

2000 నాటి శిఖరాగ్ర సమావేశానికి ముందు ఉత్తర కొరియాకు హ్యూందాయ్ గ్రూప్ 500 మిలియన్ డాలర్లు చెల్లించింది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి తెలిసే అది జరిగింది. దీంతో ఆ సమావేశాన్ని ’’కొనుగోలు’’ చేశారని విమర్శకులు అభివర్ణించారు.

ఇప్పుడు కూడా గత చర్చల వంటి ఫలితమే.. తీవ్ర అపనమ్మకం, సూక్ష్మ విశ్లేషణలతో కూడిన సుదీర్ఘమైన, క్లిష్టమైన బండచాకిరి - వచ్చే అవకాశముంది.

కానీ చర్చలనేవి ఒక రకంగా పురోగతేనని.. పైగా గత ఏడాది ముసురుకున్న యుద్ధ భయాల నేపథ్యంలో ఇరుపక్షాలూ కనీసం మాట్లాడుకుంటున్నాయని వాదించవచ్చు.

అయితే.. 2018లో జరిగిన ఇతర సంఘటనలు ఈ సంప్రదింపులను పట్టాలు తప్పించకపోయినప్పటికీ నెమ్మదింపజేయవచ్చు.

ఉదాహరణకు.. ప్రతి ఏటా అమెరికా - దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. దీనికి ఉత్తర కొరియా తన శత్రువులను నిర్మూలిస్తామనే ఆలంకారిక ప్రకటనతో స్పందిస్తుంది.

ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఈ సంయుక్త సైనిక విన్యాసాలు పునరుద్ధరణ జరిగినపుడు.. ఆ దేశం సంయమనం పాటించే అవకాశం తక్కువ.

అలాగే.. ఉత్తర కొరియా తన అణు, క్షిపణి కార్యక్రమాలను విస్తరిస్తోంది.

చర్చలు కొనసాగేలా చూడటానికి అది తన పరీక్షలను నిలుపుదల చేయవచ్చు. అధ్యక్షుడు మూన్ అమాయకుడైన అనుభవరాహిత్యుడనే విమర్శలు తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి.

ఈ సంబంధాల్లో ఇటువంటి నిరంతర ఒత్తిళ్ల మధ్యనే గత చర్చలు విఫలమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కొరియా మహిళల హాకీ టీమ్‌లో ఉభయ కొరియాల క్రీడాకారులూ ఉన్నారు

ఈసారి ఎవరి వ్యూహం ఏంటి?

బహుశా ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. ఉత్తర కొరియా నిజంగా దిగిరావచ్చు. ఒలింపిక్ స్ఫూర్తితో చర్చలు ప్రారంభించటానికి, తన ఉద్దేశాల మీద అంతర్జాతీయంగా ఉన్న అనుమానాలను అధిగమించటానికి ముందుకు రావచ్చు.

కానీ.. అమెరికా నుంచి దక్షిణ కొరియాను విడదీయటానికి ఆ దేశం ప్రయత్నించే అవకాశం ఎక్కువ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద దక్షిణ కొరియాలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను అందుకు ఆయుధంగా వాడుకోవచ్చు.

దక్షిణ కొరియా తీర్చలేని డిమాండ్లను కూడా ఆ దేశం ముందుకు తెచ్చే అవకాశమూ ఉంది. తమ దేశం నుంచి దక్షిణ కొరియాకు ఫిరాయించిన వారిని అప్పగించాలని ఇటీవల చేసిన విజ్ఞప్తి ఆ కోవలోనిదే.

కాబట్టి.. ఒలింపిక్స్ తర్వాత పరిస్థితులు మారతాయన్న ఆశలు సజీవంగా ఉన్నా.. మరీ ఎక్కువ ఆశలు పెంచుకోకుండా ఉండటం ఉత్తమం.

రాబర్ట్ ఇ. కెల్లీ పుసాన్ నేషనల్ యూనివర్సిటీలోని రాజకీయశాస్త్ర విభాగంలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయను @Robert_E_Kelly ఫాలో కావచ్చు. ఈ వ్యాసాన్ని డంకెన్ వాకర్ ఎడిట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)