ప్రెస్ రివ్యూ : వీరి స్థానంలో కొత్తగా అవకాశం ఎవరికి?

  • 24 ఫిబ్రవరి 2018
Image copyright Getty Images

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నిక జరుగనుందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించిన జేడీయూ సభ్యుడు వీరేంద్రకుమార్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదేరోజు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఎన్నికలు జరుగబోయే మొత్తం స్థానాల సంఖ్య 59 కానుంది.

ఈమేరకు కేంద్ర ఎన్నికలసంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో మూడు చొప్పున మొత్తం 6స్థానాలకు ఎన్నిక జరుగనుంది.

పదవీవిరమణ చేయబోతున్నవారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌, తెలంగాణ నుంచి సీఎంరమేష్‌, రాపోలు ఆనందభాస్కర్‌లు ఉన్నారు.

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికీ ఇప్పుడు ఎన్నిక జరుగనుంది.

ప్రముఖ క్రికెటర్ సచిన్ తెండూల్కర్, సినీ నటులు రేఖ, జయాబచ్చన్‌ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 10 స్థానాలకు, బిహార్‌, మహారాష్ట్ర నుంచి ఆరు, పశ్చిమబంగ, మధ్యప్రదేశ్‌ నుంచి అయిదుస్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటుగా 8 మంది కేంద్ర మంత్రులు రిటైర్ కాబోతున్నారు.

అత్యధికంగా భాజపా నుంచి 17మంది, కాంగ్రెస్‌ నుంచి 14, ఎస్పీ నుంచి 6, జేడీయూ, టీఎంసీ, నామినేటెడ్‌ విభాగం నుంచి ముగ్గురుచొప్పున, జేడీయూ, టీడీపీ, ఎన్సీపీ, ఇండిపెండెంట్ల నుంచి ఇద్దరు చొప్పున రిటైర్‌ అవుతున్నారు.

జీఎంఎం, బీఎస్పీ, శివసేన, సీపీఎం నుంచి ఒకొక్కరు ఉన్నారని ఈనాడు పేర్కొంది.

Image copyright Getty Images

హెచ్ 1బీ మరింత కష్టం

హెచ్ 1బీ వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ ట్రంప్ యంత్రాంగం కొత్త విధానాన్ని ప్రకటించిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

ఈ విధానం తక్షణం అమల్లోకి రానుంది. తాజా నిబంధనలు భారత ఐటీ సంస్థలు, వాటి ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

'అమెరికా ఉత్పత్తులనే కొనాలి, అమెరికన్లనే నియమించుకోవాలి' అంటూ ట్రంప్ జారీ చేసిన కార్య నిర్వహక ఉత్తర్వుల్లో భాగంగానే సంబంధిత విభాగం తాజాగా ఏడు పేజీల విధాన పత్రాన్ని ప్రకటించింది.

ఏప్రిల్ 2నుంచి హెచ్ 1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కఠిన నిబంధనలు అమల్లోకి రావడం గమనార్హం.

మూడో పార్టీ సైట్‌లో తమ ఉద్యోగులతో పని చేయించడానికి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే కంపెనీలకు ఇకపై పత్రాల పని ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగిని నియమించుకున్న కంపెనీ.. తన సేవలు అందించేందుకు వేరే సంస్థకు ఆ వ్యక్తిని పంపిస్తే ఆ మరో సంస్థ మూడో పార్టీ సైట్ అవుతుంది.

తాజా మార్గదర్శకాల ప్రకారం..

మూడో పార్టీ సైట్‌లో ఎంతకాలం పని ఉందో అంత కాలానికే హెచ్ 1బీ వీసాలను మంజూరు చేస్తారు. ఇప్పటివరకు వీటిని కనీసం మూడేళ్ల కాలానికి జారీ చేస్తుండగా ఇక నుంచి మూడేళ్ల కన్నా తక్కువ కాలానికి కూడా పరిమితం చేయవచ్చు.

ఇక.. కంపెనీ నియమించుకోవాలనుకుంటున్న హెచ్ 1బీ ఉద్యోగి.. దరఖాస్తులో పేర్కొన్నంత కాలమూ మూడో పార్టీ వర్క్‌సైట్‌లో ప్రత్యేక వృత్తిలో ప్రత్యేక అసైన్‌మెంట్లు చేపట్టనున్నట్లు రుజువు చేయడానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ సదరు కంపెనీ సమర్పించాల్సివుంటుంది.

లబ్దిదారును ఎంత కాలం కోసం నియమించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారో అంతకాలానికీ వారితో హెచ్ 1బీ దరఖాస్తు చేసే సంస్థ యజమాని - ఉద్యోగి సంబంధాన్ని కొనసాగించాలని ఈనాడు పత్రిక పేర్కొంది.

మానవ హారం Image copyright Getty Images

మహిళలకు ఉచిత కేన్సర్ పరీక్షలు : కేంద్రం

దేశంలోని మహిళలందరికీ కేన్సర్‌ పరీక్షలు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..

ఇటీవల కాలంలో కేన్సర్‌ వ్యాధి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా 30 ఏళ్లు దాటిన మహిళలందరికీ పరీక్షలు చేయాలన్న అంశంపై సమావేశంలో చర్చించింది.

ఇప్పటికే తెలంగాణలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరుగుతుండడంతో దేశమంతా ఇదే తరహాలో అమలు చేయాలని, ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరనుంది.

ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 8 జిల్లాల్లో 3లక్షల మంది మహిళలకు కేన్సర్‌ పరీక్షలు నిర్వహించారు.

తొలుత పెద్దపల్లి, జనగామ జిల్లాలో ఇంటింటికీ కేన్సర్‌ పరీక్షలు విజయవంతం కావడంతో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల, భూపాలపల్లి, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రస్తుతం కేన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు జరుగుతున్నాయి.

పరీక్షలు జరిపిన 3 లక్షల మందిలో కొత్తగా 500 మందికి కేన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యులు, నర్సులకు కేన్సర్‌ నిర్ధరణ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న దానిపై శిక్షణ ఇస్తున్నారు.

అవసరమైతే ముంభైలోని టాటా ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే కేన్సర్‌ పరిశోధన కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్లాస్‌లు ఇప్పిస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన వైద్య బృందం మళ్లీ ప్రతి జిల్లాలో స్థానికంగా ఉండే వైద్యులు, స్టాఫ్‌ నర్సులకు ట్రైనింగ్‌ ఇస్తోంది.

శిక్షణ పొందిన నర్సులు ఒక్కొక్కరు కనీసం 20-30 గృహాలను సందర్శించి 30 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు కేన్సర్‌ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి ఉందన్న అనుమానం ఉంటే వెంటనే జిల్లా కేంద్రానికి పంపుతున్నారు.

అక్కడ బయోప్సీ నిర్వహించి కేన్సర్‌ ఉందని తేలితే అక్కడి నుంచి ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇలా 5నెలలుగా తెలంగాణలో కేన్సర్‌ నిర్ధరణ పరీక్షలు కొనసాగుతున్నాయి.

Image copyright TelanganaCMO/facebook

పాస్‌బుక్‌కు ఆధార్..

పట్టాదారు పాస్‌ పుస్తకానికి ఆధార్‌ నంబర్‌ను కచ్చితంగా అనుసంధానం చేయాలని రైతులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. లేదంటే పాస్‌ పుస్తకాల్లోని భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

భూ రికార్డులకు ఆధార్‌ కార్డు లింక్‌ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని, ఇప్పటికైనా వారందరూ ఆధార్‌ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

''భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తున్నాం. మేడ్చల్, రంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో కొందరు తమ ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయించుకోలేదు. అలాంటి వారందరూ అధికారులకు ఆధార్‌ నంబర్‌ ఇవ్వాలి. లేకుంటే అవన్నీ బినామీలుగా గుర్తించే అవకాశం ఉంది''అని స్పష్టం చేశారు.

ఇతర పట్టాదారులతోపాటుగానే అసైన్డ్‌ భూములున్న వారికి కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

సుజనా చౌదరి మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఏమిటి

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు