జస్టిస్ థిప్సే: ‘‘అమిత్ షాపై కేసును తిరగదోడాలి’’

సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో అవకతవకలు జరిగాయని అలహాబాద్, ముంబై హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్ అభయ్ థిప్సే అన్నారు.
ఈ కేసులో అమిత్ షాతోపాటుగా మరికొందరు ఐపిఎస్ అధికారులను నిర్దోషులని వెలువరించిన తీర్పును పునర్విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సొహ్రాబుద్దీన్ కేసును న్యాయ విచారణ చేసిన జడ్జి బ్రిజ్గోపాల్ హరికృషన్ లోయా 2014లో నాగ్‌పూర్‌లో మృతి చెందారు. లోయా మృతిపై ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి.
లోయా ఫోన్ కాల్ రికార్డును సేకరించి దర్యాప్తు చేయాలని అభయ్ థిప్సే డిమాండ్ చేశారు.
బీబీసీ ప్రతినిధి అభిజీత్ కాంబ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభయ్ థిప్సే.. సొహ్రాబుద్దీన్ కేసులోని మూడు విషయాలను ప్రస్తావించారు. అందులో మొదటి విషయం గురించి మాట్లాడుతూ..
''ముద్దాయిలను నిర్దోషులుగా తేల్చిన విధానం సరైంది కాదు. నిందితులకు కొన్ని సంవత్సరాలపాటు బెయిల్ మంజూరు కాలేదు. వారి బెయిల్ అప్లికేషన్లు కూడా పలు కోర్టుల్లో తిరస్కరణకు గురయ్యాయి. ఎటువంటి ఆధారాలు లేకపోతే వారికి బెయిల్ వచ్చివుండేది కదా! కానీ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలూ లేవని స్పెషల్ కోర్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది'' అన్నారు.
ఫొటో సోర్స్, CARAVAN MAGAZINE
కేసు విచారణ జరుగుతున్న సమయంలో వార్తా కథనాలు రాయవద్దంటూ న్యాయస్థానం మీడియాపై ఆంక్షలు విధించింది. ఈ విషయంలో కూడా అభయ్ థిప్సే అభ్యంతరం వ్యక్తం చేశారు.
''న్యాయ విచారణ ఎప్పుడూ పారదర్శకంగా జరగాలి. అప్పుడే నిందితుల హక్కులకు భంగం వాటిల్లదు. కానీ సొహ్రాబుద్దీన్ కేసులో నిందితులే.. మీడియాపై ఆంక్షలు విధించాలని కోరారు. అందుకు న్యాయస్థానం కూడా వెంటనే అంగీకరించింది. ఇది రెండవ విషయం.''
మూడవ విషయం గురించి ప్రస్తావిస్తూ..
ఫొటో సోర్స్, AFP
''కేసు విచారణను గుజరాత్లో కాకుండా మహారాష్ట్రలో చేపట్టాలని, విచారణ చివరి వరకూ అదే న్యాయమూర్తినే కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ జరిగింది వేరు. తన పదవీకాలం ముగియక ముందే ఆ న్యాయమూర్తిని మార్చేశారు. ఆ స్థానంలో జస్టిస్ లోయాను నియమించారు. న్యాయమూర్తిని మార్చిన విషయంలో స్పష్టత ఇవ్వాలి.''
జస్టిస్ లోయా మరణం గురించి మాట్లాడుతూ.. ''జస్టిస్ లోయాది సహజ మరణమా కాదా అన్న విషయం గురించి నేను మాట్లాడను. లోయా మరణంపై చాలా ఆరోపణలు వచ్చాయి. కొందరు ప్రసిద్ధ న్యాయ నిపుణులు కూడా లోయా మరణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనుమానాలను నివృత్తి చేయడానికైనా విచారణ చేపట్టాలి.''
లోయా కేసులో కొన్ని ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. లోయాతో సంప్రదింపులు జరపడానికి కొందరు ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. లోయా కాల్ రికార్డును పరిశీలిస్తే విషయాలు వెలుగులోకి వస్తాయి. ముద్దాయిలను నిర్దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పునర్విచారణ చేయవచ్చు.''
ఎవరీ సొహ్రాబుద్దీన్ షేక్?
2005లో గుజరాత్లో సొహ్రాబుద్దీన్ మరణించారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో చనిపోయాడని గుజరాత్ పోలీసులు చెబుతున్నారు. కానీ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలున్నాయి.
ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షాతోపాటు ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు. వీరిలో కొందరు సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.
ఈ కేసు విచారణ గుజరాత్లో కాకుండా మహారాష్ట్రలో జరగాలని 2012లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో అమిత్ షా అరెస్ట్ అయ్యి, బెయిల్‌పై విడుదలయ్యారు.
2014లో స్పెషల్ కోర్టు అమిత్ షాతోపాటుగా తక్కిన వారిని కూడా నిర్దోషులుగా తేల్చి, కేసు నుంచి తప్పించింది.
అమిత్ షాను కేసు నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. ముంబై లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసిందని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ ఇంకా పూర్తి కాలేదు.
ఫొటో సోర్స్, BHAREDRESH GUJJAR
సొహ్రాబుద్దీన్ సోదరుడి తరపు న్యాయవాది గౌతమ్ తివారి మాట్లాడుతూ..
''15 మంది నిందితుల్లో ఎమ్.ఎన్.దినేష్, డి.జి.వంజారా, రాజ్‌కుమార్ పాండ్యన్లను కేసు నుంచి తప్పించడం పట్ల మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం.
వీరంతా సీనియర్ పోలీస్ అధికారులే! వీరిని నిర్దోషులుగా తేల్చిన తీర్పును మేం సవాలు చేస్తున్నాం. ఈ కేసులోని 30 మంది సాక్షులను ఇప్పటికే ప్రభావితం చేశారు'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)