భూవివాదాలకు ‘బ్లాక్‌చైన్‌’ కళ్లెం వేస్తుందా?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
పొలంలో రైతు

ఫొటో సోర్స్, Getty Images

మీకో, మీ స్నేహితులకో, మీకు తెలిసినవారికో ఏదో సమయంలో భూవివాదాలవల్ల ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం- 'బ్లాక్‌చైన్ టెక్నాలజీ' ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపుతుందని నిపుణులు, అధికారులు భావిస్తున్నారు.

ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్యాంకింగ్, బీమా రంగాల్లో, రెవెన్యూ, భూరికార్డుల వ్యవహారాల్లో పారదర్శకతను పెంచొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో ప్రాచుర్యంలోకి వచ్చిన వర్చువల్ కరెన్సీ 'క్రిప్టోకరెన్సీ' బ్లాక్‌చైన్ టెక్నాలజీతోనే పనిచేస్తుంది.

బ్లాక్‌చైన్ టెక్నాలజీని పాలనా వ్యవహారాల్లోనూ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు ఎలా ఉపయోగించవచ్చో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ-2018)'లో జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి నిపుణులు పలువురు చర్చించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

పత్రాన్ని రూపొందిస్తున్న నీతీ ఆయోగ్

పారదర్శకతతో వ్యాపార లావాదేవీలు చేసేందుకు, మోసాలు అరికట్టేందుకు ఈ పరిజ్ఞానం తోడ్పడుతుందని కెనడాకు చెందిన 'టాప్‌స్కాట్ గ్రూప్' ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) డాన్ టాప్‌స్కాట్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే సమాచారాన్ని మార్చేందుకు ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు.

ఈ-పరిపాలన(e-governance)తో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఎలా అనుసంధానించొచ్చనే అంశంపై భారత్‌లో ఉన్నతస్థాయుల్లో చర్చ జరుగుతోంది. ఈ-పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు ఉన్న మార్గాలపై నీతీ ఆయోగ్ ఒక పత్రాన్ని రూపొందించే పనిలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రధాని నరేంద్ర మోదీ

డబ్ల్యూసీఐటీ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- బ్లాక్‌చైన్ టెక్నాలజీని సత్వరం అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. ''ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాలు మన జీవన విధానాన్ని, పని విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి'' అని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, కొన్ని ఇతర రాష్ట్రాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఈ-పరిపాలనకు అనుసంధానించే ప్రయత్నాల్లో ఉన్నాయి.

సమాచార భద్రత సులభం

తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందుపరచడానికి, భూరికార్డులను డిజిటైజ్ చేయడానికి ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నంలో ఉంది.

''బ్లాక్‌చైన్ టెక్నాలజీతో సమాచార భద్రత, ట్రాకింగ్ సులభం. భూరికార్డుల నిర్వహణలో ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది'' అని భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం డైరెక్టర్ వాకాటి కరుణ తెలిపారు.

కేపీఎంజీ సంస్థ టెక్నాలజీ, బీపీఎం రంగ నేషనల్ హెడ్ అఖిలేష్ తుతేజ మాట్లాడుతూ- "బ్లాక్‌చైన్ టెక్నాలజీకి అంతర్లీన శక్తి చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ఎలా ఉపయోగించవచ్చనే కోణంలో ఆలోచిస్తోంది'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)