#HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'

పడకపై భార్యతో ఒక పురుషుడు

లోగడ నా జీతం విషయంలో నా భర్తకు ఒక అబద్ధం చెప్పాను. వచ్చేదాని కన్నా తక్కువ చెప్పాను. పిల్లల కోసం కొంత డబ్బు బ్యాంకులో పొదుపు చేద్దామని అలా చేశాను. లేదంటే నేను తెచ్చిన జీతం మొత్తం తాగుడుకు తగలేసేవాడే.

నేను అబద్ధం చెప్పానని తెలిస్తే ఏం చేస్తాడో నాకు తెలుసు. దారుణంగా కొడతాడు, తంతాడు. ఆ హింస ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఆయన కొట్టే దెబ్బలకు వీపుపై వాతలు పడతాయి. పొత్తికడుపులో భరించలేనంత నొప్పి వస్తుంది.

అబద్ధం చెప్పానని తెలిస్తే ఆయన ఏమైనా చేయగలడు గానీ, ఒకటి మాత్రం చేయలేడు. అది నేను బాగా నమ్మాను. అదేంటంటే- నన్ను ఎంత హింసించినా, నేను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా దాచిన డబ్బు మాత్రం ఆయన తీసుకోలేడు.

ఆయన కంట పడకుండా కుటుంబం కోసం కొంత డబ్బు పొదుపు చేయాలంటే ఇలా చేయడమే మార్గమని నేను పనిచేసే ఒక ఇంట్లోని మేడం చెప్పారు. ఆమే అంతా వివరించారు. లేకపోతే, పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చి పనిమనిషిగా జీవితాన్ని నెట్టుకొస్తున్న నాలాంటి మహిళకు, బ్యాంకుకు వెళ్లి, ఖాతా తెరిచి, అందులో డబ్బు దాచుకోవచ్చనే విషయం ఎన్నడు తెలియాలి!

#HerChoice - 12 మంది భారతీయ మహిళల వాస్తవగాథలు. ఈ కథనాలు 'ఆధునిక భారతీయ మహిళ' ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ప్రాధాన్యాల గురించి వివరిస్తూ మన భావనల పరిధిని విస్తృతం చేస్తాయి.

నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు. పదేళ్ల కిందట ఇంకో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకొన్నాను. అది కూడా మా మేడం అంతా వివరించాకే. ఈ విషయాన్నీ నా భర్తకు చెప్పకుండా దాచిపెట్టాను.

నా నిర్ణయాన్ని అమల్లోకి తేవాలంటే చాలా ఆందోళనగా అనిపించింది. నిర్ణయమేంటంటే- పిల్లలు పుట్టకుండా నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం. నలుగురు పిల్లలు పుట్టాక తీసుకొన్న నిర్ణయమిది.

ఈ ఆపరేషన్ చేయించుకొంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చని కొందరు అనగా విన్నాను. అయినా సరే, ఆపరేషన్ చేయించుకోవాలనే నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే నేను అప్పటికే జీవచ్ఛవంలా ఉన్నాను.

22 ఏళ్లకే 40 ఏళ్ల మహిళలా కనిపించేదాన్ని. బాగా సన్నగా ఉండేదాన్ని. ఏ ఉత్సాహమూ నాలో కనిపించేది కాదు. ఎముకల గూడును తలపించేలా ఉండేదాన్ని. కళ్ల కింద నల్లటి చారలు ఉండేవి.

ముఖంలో అమాయకత్వం, యవ్వనం స్థానంలో నిరుత్సాహం, అలసట కనిపించేవి. నడుస్తుంటే శరీరం ఒంగిపోయినట్లు అనిపించేది. నిటారుగా నడుస్తున్నట్లు అనిపించేది కాదు. ఇవన్నీ బయటకు కనిపించేవి. కంటికి కనిపించని బాధ ఎంతో ఉండేది. అది మనసులో గూడుకట్టుకొని ఉండేది. ఆ బాధ, ఆ దుఃఖం నాకు మాత్రమే తెలుసు.

నాకు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. గ్రామం నుంచి భర్తతోపాటు నగరానికి వచ్చాను. నా భర్త పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆయనకు టేబుల్‌పై భోజనం సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత, పక్కపై నేనుండాలి.

పడకపై నేను పక్కన ఉండటం ఆయనకు కేవలం అవసరం. అవసరం మాత్రమే. నా పరిస్థితి, నా ఆలోచనలు, నా ఉద్వేగాలు ఇవేవీ ఆయనకు అవసరం లేదు. నన్ను మనిషిలాగా ఎన్నడూ చూడలేదు. కేవలం ఒక శరీరంలా మాత్రమే చూశాడు.

ఆయన నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించకూడదని నాకు క్రమేణా అర్థమైంది. పరిస్థితి ఇలాగే ఉంటుందని మా అమ్మ నాకు వివరంగా చెప్పేది.

ఆయన అలా ఉన్నా కూడా నేను సర్దుకుపోతూ వచ్చాను. ఇంతలో మాకు బిడ్డ పుట్టింది. అప్పుడు తొలిసారిగా నన్ను తీవ్రంగా కొట్టాడు. తొలిసారిగా మద్యం తాగాడు. తనకున్న కోపమంతా పడక మీద చూపించాడు. తర్వాత రెండో కూతురు పుట్టింది. తను పనిచేయడం మానేశాడు. నేను పనిలో చేరాను. ఆ తర్వాత మాకు మూడో బిడ్డ పుట్టింది.

నన్ను కొట్టడం, నేను తెచ్చే జీతంతో మద్యం తాగడం కొనసాగిస్తూ వచ్చాడు. నన్ను పక్కలో సుఖానికి వాడుకునేవాడు.

నేను ఎన్నడూ ఆయన్ను ఎదిరించలేదు. చాలా మంది ఆడవాళ్ల పరిస్థితి ఇంతేనంటూ మా అమ్మ నాకు సర్దిచెప్పేది.

కొంత కాలానికి నేను నాలుగోసారి గర్భం దాల్చాను. అప్పటికి నాకు 20 ఏళ్లు. అప్పుడు నా శరీరం జీవం లేని శరీరంలా ఉంది.

అప్పటికే ముగ్గురు పిల్లలున్న నేను, మరోసారి గర్భం దాల్చడం, అదీ శారీరకంగా బలహీనంగా ఉండి కూడా గర్భం దాల్చడం మా మేడంకు కోపం తెప్పించింది. అసలు నువ్వు ఇంకో శిశువుకు జన్మనివ్వగల స్థితిలో ఉన్నావా, నీ శరీరానికి అంత శక్తి ఉందా అని నన్ను ఆమె అడిగింది. ''పర్లేదు, ఆందోళన చెందకండి'' అని బదులిచ్చాను.

అయినా మా మేడం లాంటి ఆధునిక మహిళలకు నాలాంటి మహిళల పరిస్థితి ఏం అర్థమవుతుందిలే అని నాలో నేను అనుకున్నాను. నాలాంటి మహిళలు కొడుకు పుట్టే వరకు పిల్లల్ని కంటూనే ఉండాలి కదా!

బ్యాంకు ఖాతా తెరవడం, డబ్బు పొదుపు చేసుకోవడం గురించి సలహా ఇవ్వడం వేరు.. నా లాంటి మహిళల కుటుంబ పరిస్థితులను, సామాజిక ఒత్తిళ్లను అర్థం చేసుకోవడం వేరు. అందువల్లే, నేను గర్భవతిని అన్న సంగతి ఎవరికీ తెలియకపోతే బాగుండు అని కూడా నాకు అనిపించింది.

నాకు కొడుకు పుడితే పరిస్థితులన్నీ సర్దుకుంటాయని నమ్మేదాన్ని. మా ఆయన మద్యం తాగడం, నన్ను హింసించడం, పక్కపై క్రూరంగా ప్రవర్తించడం- ఇలాంటివన్నీ ఆగిపోతాయని అనుకునేదాన్ని.

ఆస్పత్రిలో నా బెడ్‌ పక్కన నిలబడ్డ నర్సు, ''నీకు కొడుకు పుట్టాడు'' అని చెప్పగానే, నాకు సంతోషంతో కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఏడ్చేశాను కూడా. బలహీనంగా ఉన్న నేను తొమ్మిది నెలలపాటు గర్భాన్ని మోసేందుకు పడ్డ కష్టం, ప్రసవానికి ముందు పది గంటలపాటు నొప్పుల సమయంలో భరించిన బాధ ఒక్కసారిగా మాయమయ్యాయి.. ఆ క్షణంలో.

కొడుకు పుట్టినా మా ఆయన విషయంలో నేను అనుకున్నట్లు జరగలేదు. ఆయన హింస మళ్లీ కొనసాగింది.

ఇప్పుడు నా వైపు నుంచి తప్పేముంది, కొడుకు కూడా పుట్టాడు కదా! మా ఆయన తీరు చూశాక, నాకోటి అనిపించింది- నా పట్ల క్రూరంగా ప్రవర్తించడం ఆయనకు అలవాటుగా మారింది.

నా శరీరం శుష్కించిపోయినట్లు అనిపించేది. మళ్లీ ఎక్కడ గర్భం వస్తుందోనని ఎప్పుడూ భయపడేదాణ్ని. ఓ సందర్భంలో, అలసటగా ఉన్న నా ముఖం వైపు చూసి, మా మేడం నన్నో మాట అడిగింది. ''నీ జీవితంలో ఏదైనా ఒక్కటి నువ్వు మార్చుకోగలిగే అవకాశముంటే, ఏది మార్చుకుంటావు'' అని ప్రశ్నించింది. నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే నాకు అలాంటి ఆలోచనే ఎన్నడూ రాలేదు. ఆ ప్రశ్నా అప్పటివరకు ఎవరూ అడగలేదు.

మా మేడం అడిగిన దాని గురించి తర్వాత ఆలోచించాను. ఓ వారం తర్వాత, ''మీరు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది'' అని ఆమెతో అన్నాను. ''నేను ఇక పిల్లల్ని కనలేను.. కానీ మా ఆయన్ను ఎలా నిలువరించాలో నాకు తెలియదు'' అని చెప్పాను.

కుటుంబ ఆర్థిక స్థితి గురించి, నా శారీరక పరిస్థితి గురించి మా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించేదాన్ని. నలుగురు పిల్లల్ని పోషించేంత స్తోమత మనకు లేదని ఆయనతో చెప్పేదాన్ని. కానీ పక్కపై తనను తాను నియంత్రించుకొనేవాడు కాదు. శారీరకంగా నేను బలహీనంగా ఉన్నాననే కనీస పట్టింపు కూడా ఆయనకు ఉండేది కాదు. పిల్లల బాధ్యత ఎన్నడూ తీసుకొనేవాడు కాదు కాబట్టి, వాళ్ల పోషణ, ఇతరత్రా అంశాల గురించి కూడా ఆలోచించేవాడే కాదు.

ఐదోసారి గర్భం దాల్చాలని నేను కోరుకోవట్లేదని చెప్పిన తర్వాత, ''పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకో'' అని మేడం నాకు సలహా ఇచ్చారు. ''ఇదొక్కటే నీ చేతుల్లో ఉంది. రాత్రి వేళ పక్కపై నీ భర్తను నిలువరించలేకపోయినా, నువ్వు ఆపరేషన్ చేయించుకొంటే కనీసం గర్భం రాకుండా చూసుకోవచ్చు'' అని ఆమె వివరించారు.

ఈ ఆపరేషన్ గురించి నాకేమీ తెలియదు. చాలా రోజులు గడిచాయి. నాకు చాలా సందేహాలు ఉండేవి. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పీ చెప్పీ విసుగెత్తిపోయిన మా మేడం, ఒక క్లినిక్ చిరునామా ఇచ్చింది.

ఆ ఆస్పత్రి వద్ద నా లాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఈ ఆపరేషన్‌కు ఎంతో సమయం పట్టదని, కానీ ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాల మీదకు రావొచ్చని వారిలో కొందరు చెప్పారు.

దీని గురించి కొన్ని నెలలపాటు ఆలోచించాను. నా భర్తకు, పిల్లలకు అబద్ధం చెప్పి, ఆస్పత్రికి చేరుకున్నాను. అప్పుడు నాకెంతో భయంగా అనిపించింది. కానీ అప్పటికే వరుస కాన్పులతో అలసిపోయాను. భయంతోపాటు నిస్పృహ కూడా నన్ను ఆవరించి ఉంది.

ఆపరేషన్ గురించి భయం ఉన్నా, ఇది చేయించుకొంటే నా జీవితం కొంత మేరకైనా నా నియంత్రణలో ఉంటుందని నమ్మాను. అందుకే ఆపరేషన్ చేయుంచుకోవాలనే నిర్ణయించుకొన్నాను, చేయించుకున్నాను.

ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. నిస్సత్తువగానూ, బాధగానూ అనిపించేది.

ఆపరేషన్ చేయించుకొని ఇప్పటికి పదేళ్లయ్యింది. ఇంతవరకు నాకు మళ్లీ గర్భం రాలేదు. ఇది నా భర్తకు అసాధారణమేమీ అనిపించలేదు. ఆయన ఎప్పట్లాగే మద్యం తాగుతున్నాడు, నన్ను కొడుతున్నాడు, నాతో పడక సుఖం పొందుతున్నాడు. ఆయన ఏ బాధ్యతా తీసుకోవడం లేదు. పిల్లల పోషణ కోసం నేను పనిమనిషిగా చేస్తున్నాను.

నా భర్తను వదిలేయలేను. ఎందుకంటే అలా చేయొద్దని అమ్మ చెప్పింది. ఆయన్ను నేను మార్చనూ లేను. ఆయన చేసేవి భరించే కొద్దీ నాకు అంతా అలవాటైపోయింది.

నాకు ఇప్పుడు మనశ్శాంతి ఉంది. ఎంతోకొంత నన్ను నేను పట్టించుకోగలుగుతున్నాను. నేను ఆపరేషన్ చేయించుకొన్న విషయాన్ని ఆయన వద్ద ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతాను. అది నా రహస్యం.

నేను నా కోసం తీసుకొన్న నిర్ణయం అది. ఆ నిర్ణయం తీసుకోగలిగినందుకు నేను గర్వపడతాను.

(ఉత్తర భారతదేశంలోని ఓ మహిళ నిజ జీవిత కథ ఇది. ఆమె దీనిని బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో పంచుకొన్నారు. ఆ మహిళ వివరాలను ఆమె కోరిక మేరకు వెల్లడించడం లేదు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)