'అతిలోకసుందరి' శ్రీదేవి హఠాన్మరణం

  • 25 ఫిబ్రవరి 2018
శ్రీదేవి Image copyright AFP GETTY

ప్రముఖ నటి శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో కన్నుమూశారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు.

శ్రీదేవి 'కార్డియాక్ అరెస్ట్' (గుండె హఠాత్తుగా ఆగిపోవడం)తో చనిపోయారంటూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారని చెప్పింది.

శ్రీదేవి వయసు 54 సంవత్సరాలు.

శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు.

1967లో నాలుగేళ్ల వయసులో ఒక తమిళ సినిమాతో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించారు.

తెలుగు, మలయాళం సినిమాల్లోనూ బాలనటిగా కనిపించారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత 1979లో శ్రీదేవి హిందీ చిత్రపరిశ్రమలో కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించారు.

హిందీలో కథానాయికగా 'సోల్‌వా సావన్' ఆమె మొదటి చిత్రం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2006లో ఒక కార్యక్రమంలో శ్రీదేవి

హిందీ చిత్రపరిశ్రమలో 1980లను శ్రీదేవి దశకంగా విమర్శకులు అభివర్ణిస్తారు. ఆమె నటించిన హిమ్మత్‌వాలా, తోఫా, మిస్టర్ ఇండియా లాంటి సినిమాలు ఘన విజయం సాధించాయి.

తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల సరసన శ్రీదేవి నటించారు.

ఆయా భాషల్లో దాదాపు అందరు అగ్రకథానాయకులతోనూ ఆమె కలిసి నటించారు.

శ్రీదేవి 1996లో సినీ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లి చేసుకొన్నారు. శ్రీదేవి, బోనీకపూర్‌లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

1997లో 'జుదాయీ' చిత్రం తర్వాత 15 ఏళ్లపాటు శ్రీదేవి సినిమాల్లో నటించలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2013 ఏప్రిల్ 5న దిల్లీలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మ శ్రీ’ పురస్కారాన్ని అందుకొంటున్న శ్రీదేవి

తిరిగి 2012లో 'ఇంగ్లిష్-వింగ్లిష్'తో ఆమె మళ్లీ వెండితెరపైకి వచ్చారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

శ్రీదేవి నటించిన 300వ చిత్రం 'మామ్' నిరుడు విడుదల అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం 2013లో శ్రీదేవికి 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రదానం చేసింది.

శ్రీదేవి హఠాన్మరణంపై సినీ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు.Image copyright Twitter

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం