ప్రెస్ రివ్యూ: ట్రంప్ నిర్ణయంతో వారెన్ బఫెట్‌కు లక్షల కోట్ల లాభం

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథవే లాభాల్ని అమాంతం పెంచేసిందని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. అగ్రరాజ్య నూతన పన్ను చట్టంతో సంస్థ లాభం ఏకంగా రూ. 2 లక్షల కోట్ల మేర ఎగబాకిందని చెప్పింది.
‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రకారం.. గతేడాది కంపెనీకి 65.3 బిలియన్ డాలర్ల నిర్వహణపరమైన లాభం రాగా, ఇందులో వ్యాపార కార్యకలాపాల వల్ల వచ్చింది 36 బిలియన్ డాలర్లు మాత్రమే. 29.3 బిలియన్ డాలర్లు కార్పొరేట్ పన్ను కోతలతోనే మిగిలాయి. డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం ఇది రూ. 1,89,600 కోట్లతో సమానం. ఈ విషయాన్ని భాగస్వాములకు రాసిన వార్షిక లేఖలో బెర్క్‌షైర్ చైర్మన్, సీఈవో వారెన్ బఫెట్ పేర్కొన్నారు.
అమెరికా కార్పొరేట్ సంస్థలు చెల్లించే పన్నును నిరుడు డిసెంబర్లో 35 శాతం నుంచి 21 శాతానికి ట్రంప్ సర్కారు తగ్గించిన సంగతి విదితమే. ఇది అక్కడి కార్పొరేట్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా, బిలియనీర్ ఇన్వెస్టరైన బఫెట్‌కు మరింత కలిసొస్తున్నది. ట్రంప్ నిర్ణయం.. బెర్క్‌షైర్ కార్పొరేట్ పన్ను చెల్లింపులను భారీగా తగ్గించింది. ఇక 2017లో బెర్క్‌షైర్ నికర ఆదాయం ఒక్కసారిగా 44.94 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 2016లో ఇది 24.07 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. తగ్గిన కార్పొరేట్ పన్నుతో మా ఆదాయం కూడా పెరిగిందని వారెన్ బఫెట్ తన లేఖలో స్పష్టం చేశారు.
బెర్క్‌షైర్ హాథవేకు పదుల సంఖ్యలో సంస్థలుండగా, డైరీ క్వీన్ నుంచి డ్యూరాసెల్ వరకు బెర్క్షైర్వే. అంతేగాక అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, చార్టర్ కమ్యూనికేషన్స్, కోకా-కోలా, డెల్టా ఎయిర్‌లైన్స్, జనరల్ మోటార్స్, గోల్డ్‌మన్ సాచ్స్, మూడీస్, వెల్స్ ఫార్గో, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తదితర సంస్థల్లోనూ బెర్క్‌షైర్‌కు చెప్పుకోదగ్గ వాటాలే ఉన్నాయని ‘నమస్తే తెలంగాణ’ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
దేశంలో మహిళా పోలీసులు 7 శాతమే!
దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో మహిళలు కేవలం 7.28 శాతమే ఉన్నారని హోంశాఖ తాజా గణాంకాల్లో తేలిందని ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులతో తమిళనాడు పోలీస్‌శాఖ తొలిస్థానంలో నిలవగా.. కేవలం 2.47 శాతం మహిళా ఉద్యోగులతో తెలంగాణ పోలీస్ విభాగం చివరన ఉందని ఆ కథనం పేర్కొంది.
‘సాక్షి’ కథనం ప్రకారం.. కశ్మీర్‌లోని 80 వేల మంది పోలీస్ సిబ్బందిలో 3.05 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో మహిళలపై 3,29,243 నేరాలు జరగగా.. ఈ సంఖ్య 2016 నాటికి 3,38,954కు చేరింది. పోలీస్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2009, 2012, 2016ల్లో మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ పరిస్థితి మారలేదని హోంశాఖ తెలిపింది.
తెలంగాణలోని 60,700 మంది పోలీస్ సిబ్బందిలో కేవలం 2.47 శాతం మహిళలు ఉండగా, యూపీలోని 3.65 లక్షల సిబ్బందిలో 3.81 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయలలోనూ మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తమిళనాడు తర్వాత హిమాచల్, మహారాష్ట్ర, గోవాలలో మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ పోలీస్‌విభాగంలో మహిళలు అత్యధికంగా ఉండగా, ఢిల్లీ పోలీస్ విభాగంలో కేవలం 8.64 శాతం మహిళా సిబ్బంది ఉన్నారు.
దేశవ్యాప్తంగా 2015లో 34,651 రేప్ కేసులు నమోదుకాగా, 2016 నాటికి ఆ సంఖ్య 38,947కు చేరుకుందని పేర్కొంది. దేశంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళలపై నేరాల్లో భర్త, కుటుంబ సభ్యులపై నమోదైన కేసులే ఎక్కువ. మహిళలపై దాడి, అపహరణ, అత్యాచారం వంటి నేరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ‘సాక్షి’ కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
లైంగిక దాడి బాధితుల్లో అత్యధికులు మైనర్లే
దేశంలో జరుగుతున్న లైంగిక దాడుల కేసుల్లో అత్యధిక బాధితులు మైనర్లే అని తాజా అధ్యయనం వెల్లడించినట్లు ‘ప్రజాశక్తి’ దినపత్రిక కథనం పేర్కొంది. లైంగిక దాడుల పరిశోధనలకు సంబంధించిన పూనెలోని ఒక కేంద్రంలో దాదాపు తొమ్మిది వందల కేసులను మెడికో లీగల్ ఎనాలిస్టులు విశ్లేషించారు.
‘ప్రజాశక్తి’ కథనం ప్రకారం.. లైంగిక దాడుల బాధితుల్లో 60 శాతం మంది 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గలవారేనని పేర్కొన్నారు. పూనెలోని బి జె మెడికల్ కాలేజి అండ్ సస్సూన్ జనరల్ హాస్పటల్‌కు చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్సికాలజి విభాగం అధికారులు వెల్లడించిన డేటా మేరకు తాము పరిశోధించిన 890 లైంగిక దాడుల కేసుల్లో 534 కేసుల్లో బాధితులు పిల్లలు లేదా యుక్తవయస్సులో ఉన్నవారని తెలిపింది.
నవంబరు 2015-సెప్టెంబరు 2017 మధ్య కాలంలో వీరిని చికిత్స నిమిత్తం సస్సూన్ ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. లైంగిక దాడులకు సంబంధించి నమోదైన మొత్తం కేసుల్లో 60.23 శాతం మంది మైనర్లేనని తెలిపింది. ఇటువంటి కేసుల్లో అత్యధికులు బాలికలేనని, వీరి సంఖ్య 92.88 శాతంగా ఉందని, బాలుర సంఖ్య 7.12 శాతంగాఉందని ఆ నివేదిక వెల్లడించింది.
అత్యధిక కేసుల్లో 62.55 శాతం మంది 15-18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారేనని పేర్కొంది. అత్యధిక కేసు ల్లో అంటే దాదాపు 93.63 శాతం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారే కావడం విశేషం. దాదాపు 39.51 శాతం కేసుల్లో బాధితుల బారు ఫ్రెండే నిందితుడవుతున్నాడని అధ్యయనం వెల్లడించింది.
అత్యధిక కేసుల్లో అద్దెకు తీసుకున్న గదులలోనే దాడులు జరగుతున్నాయి. 26.40 శాతం కేసుల్లో దాడులు అద్దెకుతీసుకున్న గదుల్లో జరుగుతుంటే, 21.72 శాతం కేసుల్లో దుండగుల నివాసాల్లోనూ, 20.97 శాతం కేసుల్లో బాధితుల నివాసాల్లోనూ లైంగిక దాడులు జరుగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.
అత్యధికంగా 61.80 శాతం కేసుల్లో దుండగులు 21-30 సంవత్సరాల మధ్య వయసుస కలవారున్నారని అధ్యయనం పేర్కొంది. అలాగే 17.80 శాతం కేసుల్లో నిందితులు 11-20 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు కావడం విశేషం. కనీసం 34 శాతం కేసుల్లో నిందితులు 16-18 సంవత్సరాల మధ్య వయస్సు వారిగా ఉన్నారని అధ్యయనం పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన లైంగిక దాడుల నిందితుల్లో అతి చిన్నవాడి వయస్సు 11 సంవత్సరాలు కాగా, అతి పెద్ద వాడి వయస్సు 55 సంవత్సరాలని అధ్యయనం తేల్చినట్లు ‘ప్రజాశక్తి’ కథనం వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
కార్పొరేట్లకు లక్ష కోట్లకుపైగా మాఫీ.. అన్నం పెట్టే రైతులపై స్పందించరా?
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని, వీటిలో మార్పు వచ్చేంతవరకు పోరాటం చేయాల్సిందేనని పలువురు వక్తలు పిలుపునిచ్చినట్లు ‘ఈనాడు’ దినపత్రిక కథనం పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. అన్నదాతలు బలహీనతతో ఆత్మహత్యలు చేసుకోవట్లేదని, వారిని బలవన్మరణానికి పురికొల్పేలా విధానాలున్నాయని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.1.14 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన పాలకులు అన్నం పెడుతున్న రైతులు చనిపోతే మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్(సిసిసి) ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. మెగసెసే అవార్డు గ్రహీత, విశ్రాంత ఐఏఎస్ కె.ఆర్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతోనే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. వేల కోట్ల కుంభకోణాలు చేసినవాళ్లు విదేశాలకు వెళ్లిపోతుంటే.. బ్యాంకుల నష్టాలకు రైతులకు రుణాలివ్వడమే కారణమనడం సిగ్గుచేటని అన్నారు.
సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాధితుల్లో అర్హులందరికీ సాయం అందట్లేదని, వచ్చినవారికీ ఆ సాయం చాలట్లేదన్న అభిప్రాయముందన్నారు. ఆత్మహత్యల నివారణకు అన్ని పార్టీలు, నాయకులు మార్గాలను అన్వేషించాలని బాధిత కుటుంబాలకేం చేస్తారో చేబుతూ వాటిని వచ్చే ఎన్నికల ప్రణాళికల్లో చేర్చాలని కోరారు.
మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. వేలకోట్లు దోచుకున్నోళ్లు దేశం విడిచిపోయే పరిస్థితిని నేతలే కల్పిస్తున్నారని, ఐదారు లక్షలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగితే కేసీఆర్‌ను, ఏపీలో జరిగితే చంద్రబాబును బాధ్యులుగా చేయాలన్నారు.
తెలంగాణలో నాలుగేళ్లలో 3,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం 800 మందికే పరిహారమిచ్చిందని సిసిసి ప్రతినిధి కొండల్‌రెడ్డి విమర్శించారు. రైతు ఆత్మహత్యల నివారణలో సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని వక్తలు కోరారు. బాధిత కుటుంబాలకు ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ చేసినట్లు ‘ఈనాడు’ కథనం తెలిపింది.
ఫొటో సోర్స్, Telangana CMO/Facebook
కేంద్రానికి 20 ఉత్తరాలు రాశా.. పట్టించుకోలేదు: కేసీఆర్
'ఉపాధిహామీ'ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ పదిసార్లు చెప్పినా, 20 ఉత్తరాలు రాసినా కేంద్ర ప్రభుత్వం బుద్ది తెచ్చుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు ‘నవతెలంగాణ’ దినపత్రిక కథనం పేర్కొంది. 13 జిల్లాలకు సంబంధించిన రైతు సమన్వయ సమితుల సభ్యుల అవగాహన సదస్సును ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక నుంచి టార్ఫాలిన్లు కొనుగోలు చేసే రైతులకు 75శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన శాస్త్రీయ పద్దతిలో గోదాముల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
రూ. 12వేల కోట్లతో పెట్టుబడి పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా మే నెలలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. పెట్టుబడి పథకం కింద కోటి 65 లక్షల ఎకరాలకు గాను కోటి 42 లక్షల మందికి లబ్ది చేకూరనున్నదని వెల్లడించారు.
ఇంకా మూడు లక్షల ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నదని, త్వరలో అది కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. పాలమూరు, డిండి, సీతారాం ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టులు జూన్ నెలఖారు వరకు పూర్తయితే, 2020 నాటికి కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. 1.25 వేల కోట్ల విలవైన పంట పండించే పరిస్థితులు రాబోతున్నాయని అన్నారు.
రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర అందకపోతే రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రైతు సమన్వయ సమితులు నేరుగా కొనుగోలు చేస్తాయని చెప్పారు. సుమారు రూ. 6 నుంచి 7 వేల కోట్లు రైతు సమన్వయ సమితులకు బడ్జెట్లో కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ‘నవతెలంగాణ’ కథనం తెలిపింది.
ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/Facebook
టెక్నాలజీలో ఏపీ నంబర్.. మార్చి నెలాఖరుకల్లా కాగితరహిత పాలన
టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ అని.. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సమగ్ర ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ- ఆఫీస్, ఈ-కేబినెట్, బయోమెట్రిక్, ఈ-క్లౌడ్ మేనేజ్మెంట్ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. రాష్ట్రంలో వచ్చే మార్చి నెలాఖరులోగా కాగిత రహిత పాలన వచ్చేస్తుందని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఫైలింగ్, ఈ-ఆఫీస్, బయోమెట్రిక్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు (సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్) రెండో రోజు.. 'రేపటి కోసం సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ ఫర్ టుమారో)' అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
'సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)- ప్రోత్సాహం' అన్న అంశంపై జరిగిన చర్చలోను, రాత్రి రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్‌పై జరిగిన సెమినార్‌లోనూ మాట్లాడారు. 'రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా ఈ-ప్రగతి, ఈ-ఫైలింగ్, బయోమెట్రిక్ హాజరు వంటి విధానాలతో ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమయపాలనతో అందజేయడంలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచాం. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహజ వనరులు మా రాష్ట్రంలో కంటే మిన్నగా దేశంలో ఇంకెక్కడా లేవు. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి' అని తెలిపారు.
దేశంలో ఆధార్ యూనిక్ నంబరు అని, అయితే రాష్ట్రంలో ప్రతి కుటుంబం వివరాలు తెలుసుకునేందుకు ప్రజాసాధికార సర్వే నిర్వహించామని, ఇది మంచి ఫలితమిచ్చిందని చెప్పారు. సిలికాన్ వ్యాలీ మాదిరిగా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం' అని చంద్రబాబు ప్రకటించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం పేర్కొంది.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)