'శ్రీదేవి.. ఓ సమ్మోహన శక్తి'

  • అవినాష్ దాస్
  • బీబీసీ కోసం
శ్రీదేవి

ఫొటో సోర్స్, Chandni Movie/Yashraj Films

శ్రీదేవి నాకన్నా 13 ఏళ్లు పెద్ద. నాకు 13 ఏళ్లప్పుడు, భారత చిత్రసీమలో ఆమె ఒక ధ్రువతారగా వెలిగిపోతున్నారు.

హిమ్మత్‌వాలా, ఆఖిరీ రాస్తా, సద్మా, నగినా, మిస్టర్ ఇండియా సహా 30కి పైగా చిత్రాల్లో శ్రీదేవి అందచందాలు, అభినయం చూసిన ప్రేక్షకులు అప్పటికే మంత్రముగ్ధులయ్యారు.

''శ్రీదేవితో పోటీపడగల హీరోయిన్ ఎవరైనా ఉంటే చూపించు'' అంటూ నాలాంటి వాళ్లం స్నేహితులను సవాలు చేసేవాళ్లం.

అప్పట్లో గూగుల్, మొబైల్ ఫోన్లు లేవు. అయినా ఏయే సినిమాలు బాగా ఆడుతున్నాయనేది మాకు తెలిసేది. విజయవంతమయ్యే సినిమాల్లో చాలా వరకు శ్రీదేవివే ఉండేవి.

హిందీ సినీ ప్రపంచంలో జయా బాధురి, రేఖ ప్రాభవం తగ్గిపోతున్న, ప్రేక్షకులకు మాధురీ దీక్షిత్ మరీ అంతగా చేరువకాని రోజులవి.

ఫొటో సోర్స్, Twitter@SrideviBKapoor

ఆ రోజుల్లో నాలాంటి వాళ్లకు సినీ తారలంటే ఆకాశంలో నక్షత్రాల్లాంటివారు. వాళ్లను ఎప్పటికీ దగ్గరగా చూడలేములే అనుకొనేవాణ్ని.

శ్రీదేవిని సినిమాల్లో చూడటం మొదలయ్యాక చాలా సంవత్సరాలకు, ఒక సందర్భంలో ఆమెను నేరుగా చూడగలిగాను. అప్పుడు నా కళ్లను నేను నమ్మలేకపోయాను. ఆమె పక్కన బోనీ కపూర్ ఉన్నారు. కానీ నేను మాత్రం ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాను.

అదో అవార్డు ప్రదానోత్సవం. అవార్డు అందజేసేందుకు శ్రీదేవి వచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించి నాకు శ్రీదేవి మాత్రమే గుర్తున్నారు. మరే వ్యక్తిగాని, శ్రీదేవి చుట్టూ నాడు కనిపించిన విద్యుత్ కాంతులుగాని నాకు గుర్తు లేవు. ఒక్క శ్రీదేవి తప్ప మరేదీ గుర్తు లేదు.

అప్పట్లో ఎంతో మంది శ్రీదేవి సౌందర్యానికి ఇలా సమ్మోహితులయ్యుంటారు.

ఫొటో సోర్స్, AFP

'జుదాయి'(1997) తర్వాత పదిహేనేళ్లపాటు శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పుడు ప్రేక్షకుల మదిలో, వారి ఉద్వేగాల్లో ఏర్పడిన వెలితిని మరే నటీ పూడ్చలేకపోయారు.

1990ల తర్వాత ఎంతో అందమైన నటీమణులు చాలా మంది తెరపైకి వచ్చారు. కానీ ఆ లోటును ఎవరూ పూడ్చలేకపోయారు.

తర్వాత అప్పుడప్పుడు శ్రీదేవి మళ్లీ తెరపై కనిపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకొంటూ వచ్చారు. శ్రీదేవి సుదీర్ఘకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో, ఆమె సినిమాలను చూసినవే మళ్లీ మళ్లీ చూసేవాళ్లు.. టీవీ ఛానళ్లలో. శ్రీదేవి ఎప్పుడూ తెరపై కనిపించేవారు.

'మిస్టర్ ఇండియా' లెక్కలేనన్ని సార్లు చూసుంటాం. ఆమె ఉన్న పాటలు చూస్తూ మైమరచిపోయేవాళ్లం.

'మిస్టర్ ఇండియా' కావొచ్చు.. 'సారీ దీదీ' కావొచ్చు.. సినిమా ఎంత నచ్చినా చూసేటప్పుడు ఏ మాత్రం గోల చేసేవాళ్లం కాదు. 'బిజిలీ కీ రాణీ మై హూఁ ఆయీ', 'కహతే హై ముజ్‌కో హవా హవాయీ' పాటలు వచ్చినప్పుడు శ్రీదేవిని అలా చూస్తూ ఉండిపోయేవాళ్లం. ఆమె మరణవార్త మనసును మెలిపెడుతోంది. ఈ పాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి.

ఫొటో సోర్స్, Twitter @SrideviBKapoor

నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా కుటుంబం బిహార్‌లోని దర్భంగాలో ఉండేది. మొహమ్మద్‌పూర్ అనే టౌన్‌షిప్‌లోని ఒక పాఠశాలలో మా నాన్న కొంత కాలంపాటు ప్రిన్సిపల్‌గా చేశారు. ఈ టౌన్‌షిప్ దర్భంగా, సీతామఢీ పట్టణాల మధ్యలో ఉంటుంది.

ఈ టౌన్‌షిప్ వెనకబడ్డ ప్రాంతమే. అక్కడ శాశ్వత మార్కెట్ ఉండేది కాదు. తాత్కాలిక మార్కెట్‌ మాత్రమే పెట్టేవారు. కానీ టౌన్‌షిప్‌లో ఒక సినిమా హాల్ ఉండేది. వెదురుతో ఏర్పాటు చేసిన పొడవాటి గుడిసె అది. అక్కడే సినిమాలు వేసేవాళ్లు. టికెట్ ఒక్క రూపాయి. నేల మీద పరచిన ఎండు గడ్డిపై కూర్చునేవాళ్లం.

1983లో 'హిమ్మత్‌వాలా' నేను ఈ హాల్‌లోనే చూసినట్లు గుర్తు. ఈ సినిమా నుంచే శ్రీదేవి సినిమాలంటే నాలో చాలా ఇష్టం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Twitter / Sridevi

'హిమ్మత్‌వాలా' తర్వాత కొన్నేళ్లకు 'నగినా' వచ్చింది. ఆ సమయంలోనే మేం ఉండే చోట ఒక పెళ్లి జరిగింది. అప్పుడే మా బావ(పెళ్లికొడుకు)తో కలిసి మా కుటుంబ సభ్యులు నగినా సినిమాకు వెళ్లారు. నన్ను తీసుకెళ్లలేదు.

చాన్నాళ్ల తర్వాత ఒక పెళ్లి సందర్భంగా, నేను 'నగినా' చూశాను. వివాహ కార్యక్రమం సందర్భంగా మగపెళ్లివారి కోసం వీసీపీలో సినిమాలు వేయడం అప్పట్లో ఒక ట్రెండ్.

'సరస్వతి పూజ'ను పురస్కరించుకొని నిర్వహించే ఊరేగింపులో ఈ సినిమాలోని ''మై తేరీ దుష్మన్, దుష్మన్ తూ మేరా.. మై నాగిన్ తూ సపేరా'' పాటను లౌడ్‌స్పీకర్లలో వినిపించడం నాకు గుర్తుంది. పెళ్లి ఊరేగింపుల్లోనూ ఈ పాట వినిపించేది. మేళగాళ్లు ఈ పాటను చాలా ఉత్సాహంగా వాయించేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

బాలీవుడ్‌లో మునుపటి తరం నటీమణుల్లో వహీదా రెహ్మాన్, వైజయంతిమాల, షర్మిలా ఠాగూర్, జయా బాధురిలకు వయసు పెరిగే కొద్దీ గ్లామర్ తగ్గిపోయింది.

రేఖ, శ్రీదేవిల విషయంలో మాత్రం అలా జరగలేదు.

ఫొటో సోర్స్, SRIDEVI/TWITTER

శ్రీదేవి హఠాన్మరణం వార్త విన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. అదేంటంటే- ఆమె ఎప్పుడూ ఎలా కనిపించేవారో అలాగే మనకు గుర్తుండిపోతారు.

చాలా కాలం విరామం తర్వాత, 'ఇంగ్లిష్-వింగ్లిష్'లో శ్రీదేవి మళ్లీ కనిపించారు. గతంతో పోలిస్తే ఆమె శరీరాకృతిలో పెద్ద మార్పు రాలేదు. సినిమాలో కొంత కొత్తగానూ అనిపించారు. అభినయం కూడా మెరుగ్గా ఉంది.

'మామ్' సినిమాలోనూ 1980ల్లో ఎలా కనిపించారో దాదాపు అలాగే కనిపించారు.

అందాన్ని, నటనలో నాణ్యతను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం సవాలుతో కూడుకొన్నది. శ్రీదేవి తనకున్న గట్టి పట్టుదలతో ఈ రెండింటిని కాపాడుకొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'సద్మా' చిత్రం శ్రీదేవిని నా స్మృతిపథంలో ఎప్పటికీ నిలిపి ఉంచుతుంది. ఆ సినిమాలో అమాయకంగా కనిపించే ఆమె పాత్ర(రేష్మి), సోమ్ ప్రకాశ్ పాత్రలో కమల్ హాసన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

''సుర్మయీ అఖియో మే నన్హా మున్హా ఏక్ సప్‌నా దే జా రే...'' పాటను ఎన్నటికీ మరచిపోలేం.

సినిమా చివరి సన్నివేశంలో, పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారిన శ్రీదేవి రైల్లో వెళ్లిపోతుంటే కిటికీలోంచి ఆమెను చూస్తూ ప్లాట్‌ఫాంపై కమల్ హాసన్ నిస్సహాయంగా పరుగు తీయడం, ఆమె అతన్ని ఏ మాత్రం గుర్తుపట్టలేకపోవడం మనం ఎన్నటికీ మరచిపోలేం.

రేష్మి(శ్రీదేవి) దూరమవుతున్నప్పుడు సోమ్ ప్రకాశ్(కమల్ హాసన్) దిగ్భ్రాంతి చెందినట్లుగానే, శ్రీదేవి హఠాన్మరణం గురించి తెలిసినప్పుడు మనమంతా దిగ్భ్రాంతి చెందాం. మన పరిస్థితిని తెలుసుకొనే స్థితిలో శ్రీదేవి లేరు. మనకు శాశ్వతంగా దూరమయ్యారు.

గుడై బై, శ్రీదేవి. యు విల్ ఆల్వేస్ బి మిస్డ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)