నాగాలాండ్ : ‘చర్చి లేఖ’తో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారా?

  • 27 ఫిబ్రవరి 2018
నాగాలాండ్ చర్చి Image copyright Getty Images

'నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్' రాసిన బహిరంగ లేఖ ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

నాగాలాండ్‌ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది క్రైస్తవులే.

ఇక్కడి ప్రజల జీవితాలపై చర్చి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

రాజకీయాల్లో చర్చి అభిప్రాయం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

నాగాలాండ్ చర్చి రాసిన లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

'మోదీ హయాంలో మిషనరీలు, పాస్టర్లపై దాడులు పెరిగాయి'

నాగాలాండ్‌లో 1500 కంటే ఎక్కువ చర్చిలకు ప్రధాన కేంద్రం 'నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్'

ఈ కౌన్సిల్ కార్యదర్శి రెవరెండ్ డా.జేల్హ్ కిహో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ భావజాలాల్ని ఖండిస్తూ ఫిబ్రవరి 9న ఒక బహిరంగ లేఖ రాశారు.

'కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క్రైస్తవులు అధికంగా ఉన్న నాగాలాండ్‌లో పాగా వేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. దీని వెనకున్న బీజేపీ ఉద్దేశం ఏమిటో ఆలోచించారా? ఒకవేళ ఆలోచించక పోతే వెర్రివాళ్లయిపోతారు జాగ్రత్త' అని ఈ లేఖలో ఉంది.

బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషనరీలు, పాస్టర్లపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

'ఏసును గాయపర్చాలనుకునే వారు క్రైస్తవుల దగ్గరనుంచి డబ్బు, వారు కనిపెట్టిన సిద్ధాంతాలు కూడా తీసుకోకండి' అని ఈ లేఖలో రెవరెండ్ కియో పిలుపునిచ్చారు.

నాగాలాండ్‌లోని చర్చి బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఆ పార్టీకి ఓటు వెయ్యొద్దని అందులో పేర్కొన్నారు.

చర్చి లేఖపై రాజకీయ దుమారం

ఈ లేఖ నాగాలాండ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

ఈసారి ఎన్నికల్లో అధికార ఎన్‌డీపీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని 20స్థానాల్లో తన అభ్యర్థుల్ని నిలబెట్టింది.

'నాగాలాండ్‌లో ఉన్న క్రైస్తవ మతానికి ప్రమాదం ఉంటుందని అనుకోవడంలేదు. భవిష్యత్తులో క్రైస్తవ మతానికి గానీ, నాగాలాండ్‌ ఉనికికి గానీ ఏదైనా ప్రమాదం సంభవిస్తే భాజపాతో సంబంధాల్ని రద్దు చేసుకుంటా' అని ముఖ్యమంత్రి అభ్యర్థి నింప్యూ రియో బీబీసీకి చెప్పారు.

ఈ లేఖతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది. లేఖలోని అంశాలను ఖండించింది.

'చర్చి ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ జరుగుతున్న పరిస్థితుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది' అని నాగాలాండ్ బీజేపీ కార్యదర్శి ఎడ్జూ థేలువొ అన్నారు.

'నేను స్వయంగా బాప్టిస్ట్ క్రైస్తవుడ్ని, అయినా భాజపాలో ఉండడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. భాజపా ఒక రాజకీయ పార్టీ. మేమంతా రాజ్యాంగానికి కట్టుబడే పని చేస్తుంటాము. మైనారిటీల సంరక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తామని, లౌకికవాదులమని మా మేనిఫెస్టోలో కూడా ఉంది' అని తెలిపారు.

అయితే, ఈ లేఖ వల్ల ఎన్నికల్లో తమ పార్టీకి కొంత నష్టం జరుగుతుందని మాత్రం థెలువో అన్నారు.

Image copyright Sharad Badhe/BBC

నాగాలాండ్‌లో ఉన్న 60 సీట్లలో ఎన్‌డీపీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 20సీట్లలో అభ్యర్థుల్ని నిలబెట్టింది. వారంతా క్రైస్తవులే.

అయితే, 'బీజేపీకి ఓటు వెయ్యొద్దని నేను లేఖ రాయలేదు. బీజేపీ మత సంబంధమైన పార్టీ. దేశంలో ఏవైతే దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయో, అవి నాగాలాండ్‌లోనూ జరగొచ్చు అని క్రైస్తవులను హెచ్చరించడం మా కర్తవ్యం అని మా చర్చి పెద్దలకు అనిపించింది. రాజకీయ పార్టీలు లౌకిక పార్టీలుగా ఉండాలేగాని మత సంబంధమైన వాటిగా ఉండకూడదు. ఇదే విషయం నేను చెప్పాను' అని రెవరెండ్ కియో బీబీసీతో అన్నారు.

'భారతదేశంలో మైనార్టీల పట్ల జరుగుతున్న దాడుల్ని చూసి చర్చి పెద్దల్లో అభద్రతా భావం నెలకొని ఉంటుంది, అందుకే ఆ లేఖ రాసి ఉండొచ్చు' అని పొలిటికల్ సైన్స్ విద్యార్థి ఇమ్తీ జమీర్ అభిప్రాయపడ్డారు.

నాగాలాండ్ రాజకీయాల్లో చర్చి ప్రభావం ఎక్కువే

1982 నుంచే చర్చి క్లీన్ ఎలక్షన్ కేంపెయిన్ నడిపిస్తోంది.

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా చర్చి ప్రభావం ఉంటుందనడం కొత్త విషయం ఏమీ కాదు.

ఏదైనా పార్టీ నాగాలాండ్‌పై ప్రభావం చూపించిందంటే, అది చర్చి పైన కూడా పడుతుంది.

ఎందుకంటే నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 90శాతానికంటే ఎక్కువే.

Image copyright Sharad Badhe/BBC

'హింస వద్దంటోంది చర్చి. అంతేగాని ఎవరికి ఓటెయ్యాలో చర్చి చెప్పడంలేదు అని జువనైల్ జస్టిస్‌లో పనిచేస్తోన్న మనస్తత్వశాస్త్రవేత్త సుఝేన్ లోధా అన్నారు.

ఫేస్‌బుక్ బ్లాగర్ కవితో కేరా మాట్లాడుతూ 'ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి వేయకూడదో చెప్పే అధికారం నాకులేదు. కానీ లౌకికవాదంతో ఎవ్వరూ రాజీ పడకూడదు. అది మోదీ అయినా సరే. మతం పేరుతో నేను ఎవరికి ఓటు వేయకూడదో ఎవరూ నాకు చెప్పొద్దు' అని అన్నారు.

నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు మార్చి ౩న వెలువడతాయి.

రాజకీయాల్లో చర్చి రాసిన లేఖ ఎంత ప్రభావం చూపించిందో అప్పుడు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)