ఇదేం జర్నలిజం? శ్రీదేవి మరణ వార్తల కవరేజీపై సోషల్ మీడియాలో ఆగ్రహం

  • 27 ఫిబ్రవరి 2018
శ్రీదేవి మృతిపై మీడియా సర్కస్ Image copyright TWITTER

ప్రముఖ సినీ నటి శ్రీదేవి శనివారం రాత్రి దుబాయ్‌లో మృతి చెందారు. కోట్లాది మందికి అభిమాన పాత్రురాలైన ఆమె గురించి మీడియా చానెళ్లు తమ తమ పద్ధతుల్లో కథనాలు ప్రసారం చేశాయి.

అయితే, సమయం గడుస్తున్న కొద్దీ, శ్రీదేవి మృతి విషయంలో మీడియా రకరకాల కథల్ని అల్లడం ప్రారంభించింది. అనేక న్యూస్ చానెళ్లు శ్రీదేవి మృతికి కారణాలని చెబుతున్న వాటిపై స్పెషల్ షోలు కూడా ప్రసారం చేశాయి.

శ్రీదేవి మృతిపై ఇలా సెన్సేషనల్‌ పద్ధతుల్లో రిపోర్టింగ్ చేయడం పట్ల చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు దుబాయ్ పోలీసులు విడుదల చేసిన నివేదికలో బాత్ టబ్‌లో 'ప్రమాదవశాత్తు మునిగిపోవడం' వల్ల శ్రీదేవి మరణించారని పేర్కొన్నారు.

Image copyright TWITTER

వెంటనే కొన్ని న్యూస్ చానెళ్లు తమ స్టూడియోల్లో 'బాత్ టబ్ సెట్లు' ఏర్పాటు చేసి ప్రత్యేక షోల్ని ప్రసారం చేశాయి. మరి కొన్ని చానెళ్లయితే మరో అడుగు ముందుకేసి 'టబ్‌లో తేలుతున్న' శ్రీదేవిని కూడా చూపించాయి.

మరో టీవీ చానెల్ 'టబ్ పక్కన బోనీ కపూర్‌'ను నిలబెట్టి మరీ చూపింది.

దీంతో #NewsKiMaut అనే హాష్‌ట్యాగ్‌తో సీనియర్ జర్నలిస్టులు, నెటిజన్లు ఈ 'సెన్సేషనల్ రిపోర్టింగ్‌'ను దుయ్యబట్టారు.

Image copyright TWITTER

సీనియర్ పాత్రికేయురాలు, 'న్యూస్‌లాండ్రీ' ఎడిటర్-ఇన్-చీఫ్ మధు త్రేహన్ ఈ సెన్సేషనల్ రిపోర్టింగ్‌ను తప్పుబట్టారు.

"గత రెండు రోజులుగా భారతీయ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలను జర్నలిజం అని మాత్రం అనలేం. జర్నలిజం అనేది వాస్తవాల ఆధారంగా జరగాలి. ఇక్కడ కవరేజి అంతా ఊహాగానాల ఆధారంగానే జరుగుతోంది. అసలు విషయం ఏంటనేది ఎవరికీ తెలియదు. శ్రీదేవి ఫేస్ లిఫ్ట్, డైట్ పిల్స్ గురించి మీడియా కథనాలు వెలువడుతున్నాయి. పాత్రికేయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి" అని ఆమె అన్నారు.

సీనియర్ జర్నలిస్టు, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కాలమిస్ట్ శుభ్రా గుప్తా కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు.

"ఎవరైనా సెలబ్రిటీ అకస్మాత్తుగా చనిపోతే ఆమె గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఎవరికైనా ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం ఆ సాకుతో దాన్ని దుర్వినియోగం చేయడమే. చాలా టీవీ చానెళ్లు వ్యక్తుల ప్రైవసీనీ, గౌరవాన్నీ తోసిరాజన్నాయి. వీళ్ల సొంత కుటుంబాల్లో మహిళల గురించి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వీరెలా స్పందిస్తారో వీరిని అడగాలి" అని శుభ్రా అన్నారు.

Image copyright STR/GETTY IMAGES

శ్రీదేవి మహిళ కావడం వల్లనే ఇలా జరుగుతోందంటారా అని అడిగినప్పుడు, "కచ్చితంగా. ఇలా జరగడం మొదటి సారి కూడా కాదు. రాకుమారి డయానా మరణించిపుడు కూడా ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఇలాగే నడిబజారులో నిలబెట్టారు. ఆమె తన చివరి ఘడియల్లో ఎవరితో ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ ప్రతి విషయాన్నీ రాసేశారు. శ్రీదేవి ఒక నటి. నటిగా ఆమె చేసిన పని గురించి మాట్లాడండి. ఆమె మృతికి సంబంధించిన వాస్తవాల్ని చెప్పండి. కానీ ఒక వ్యక్తి జీవితంలో చివరి 15 నిమిషాలతో మీకేం పని? వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరమేంటి?" అని శుభ్రా అన్నారు.

శ్రీదేవి రక్తంలో మద్యం ఆనవాళ్లున్నాయన్న విషయంపై కూడా మీడియా విపరీతార్థాలు తీసింది.

"ఇప్పుడు మనం 2018లో ఉన్నాం. ఒక మహిళ మద్యం సేవించడంపై ఇప్పుడు కూడా ఆశ్చర్యం కలుగుతోందంటే మనం వందేళ్లు వెనక్కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు లెక్క. నిజమే, అతి ఎప్పుడైనా హానికరమే. కానీ ఒక మహిళ లేదా పురుషుడు మద్యం సేవించడం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. ఇలాంటి విషయాల్ని ప్రసారం చేయడం ద్వారా మీడియా ఏం రుజువు చెయ్యాలని చూస్తోంది?" అని శుభ్రా గుప్తా ఆవేశంగా అన్నారు.

Image copyright Getty Images

అయితే, ప్రేక్షకులు కూడా దీనికి కారణం కాదా?

దీనిపై మధు త్రేహన్ ఇలా అన్నారు - "మనం చెత్తను కన్‌జ్యూమ్ చేస్తున్నట్టయితే మనకు చెత్తే లభిస్తుంది. ఇలాంటివి చూపించడం ద్వారా కూడా చానెళ్లకు టీఆర్‌పీ లభిస్తున్నట్టయితే జనాలు ఇవే చూడాలని కోరుకుంటున్నారని అవి భావిస్తాయి. ప్రేక్షకులు చానెల్ మార్చడం ద్వారా ఇలాంటివి తమకు ఇష్టం లేదని నిరసన ఎందుకు ప్రకటించరు?"

మరోవైపు, "భారతీయ న్యూస్ చానెళ్లు సరైన సమాచారం ఏదీ లేకుండానే ఇలా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టులుగా, డాక్టర్లుగా, గూఢచారులుగా రూపాంతరం చెందడం మొదటిసారేమీ కాదు. ఇవి మనల్ని ప్రశాంతంగా బతకనివ్వవూ, చావనివ్వవు" అని సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయి ట్వీట్ చేశారు.

బర్ఖా దత్త్ #NewsKiMaut అనే హ్యాష్‌ట్యాగ్ మొదలుపెట్టారు. "శ్రీదేవి మృతిపై చానెల్ వార్తల్లో పేర్కొంటున్న అసభ్యకరమైన హ్యాష్‌ట్యాగ్‌లకు జవాబు కేవలం ఇలాంటి హ్యాష్‌ట్యాగ్‌తో మాత్రమే ఇవ్వగలం. బాత్ టప్ కాదు, ఈ తరహా మురికిని వదిలించాలంటే డ్రెయినేజ్ పైప్ కావాలి. ఈ పరిశ్రమలో నేను కూడా భాగమైనందుకు సిగ్గు పడుతున్నా. అయితే ప్రస్తుత వాతావరణంలో నేను టీవీలో యాంకరింగ్ చేయనందుకు సంతోషంగా కూడా ఉంది" అని బర్ఖా ట్వీట్ చేశారు.

వీర్ సంఘ్వీ ట్విటర్‌పై "ఎవరైనా చనిపోయినప్పుడు భారతీయ టీవీ చానెళ్లకూ, రాబందులకు తేడా ఏముంటుంది? కొన్ని పనులు చేయడానికి బహుశా రాబందులు కూడా సిగ్గు పడతాయేమో కానీ మన టీవీ చానెళ్లకు మాత్రం సిగ్గు పడవు..." అని రాశారు.

మీరివి చదివారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం