గ్రౌండ్ రిపోర్ట్: అస్సాంలో లక్షల మంది ముస్లింల పౌరసత్వానికి ముప్పు!

  • 28 ఫిబ్రవరి 2018
అస్సాంలోని ముస్లింలు Image copyright BBC/SHIB SHANKAR CHATTERJEE

ఈశాన్య భారత రాష్ట్రం అస్సాంలో లక్షల మంది ముస్లింల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

అస్సాంలోని మోరి గ్రామంలో అబ్దుల్ ఖదీర్ అనే వ్యక్తి దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు.

ఈ రాష్ట్రంలో తరతరాల నుంచి నివసిస్తూ వస్తున్న బెంగాలీ మూలాలు కలిగిన లక్షల మందిలో ఆయన ఒకరు.

1941 నుంచి ఇప్పటివరకు ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన అనేక ధ్రువపత్రాలు ఖదీర్ వద్ద ఉన్నాయి.

కానీ ఆయన్ను ఇప్పుడు విదేశీయుడని, బంగ్లాదేశీయుడని అంటున్నారు.

తాను బంగ్లాదేశీయుడిని కాదని, తనది బంగ్లాదేశ్ కాదని, భారతేనని ఆయన ఇప్పుడు 'ఫారనర్స్ ట్రైబ్యునల్' ఎదుట నిరూపించుకోవాల్సి ఉంది.

''నేను ఇక్కడే పుట్టాను. 1941 నుంచి ఇప్పటివరకు నాకు సంబంధించిన రికార్డులన్నీ అధికారులకు అందజేశాను. 1950 నాటి 'హజ్' పాస్‌పోర్టు కూడా ఇచ్చాను. అయినా నన్ను 'ఫారనర్స్ ట్రైబ్యునల్' ముందుకెళ్లి, విదేశీయుడిని కాదని నిరూపించుకోవాలన్నారు'' అని విచారంగా చెప్పారు ఖదీర్.

Image copyright SHIB SHANKAR CHATTERJEE/BBC
చిత్రం శీర్షిక ఎనిమిది నెలలపాటు కస్టడీలో ఉన్న మర్జీనా బీబీ

అస్సాంలోని గ్వాల్‌పాడాలో మర్జీనా బీబీ అనే మహిళ ఉన్నారు. ఓ రోజు ఆమెను బంగ్లాదేశీయురాలంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలలపాటు కస్టడీలో ఉన్న ఆమె, హైకోర్టు జోక్యంతో విడుదలయ్యారు.

''నన్ను అరెస్టు చేశాక మా అంకుల్ అధికారులకు అన్ని పత్రాలు, ఆధారాలు చూపించారు. అయినా నన్ను వాళ్లు 'బంగ్లాదేశీయురాలు' అనే అన్నారు. నా లాంటి మహిళలను వేల మందిని జైళ్లలో ఉంచారు'' అని మర్జీనా చెప్పారు.

అస్సాం జనాభాలో ముస్లింలు దాదాపు 34 శాతం ఉంటారు. వీరిలో అత్యధికులు గత వందేళ్లలో బెంగాల్ నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడినవారు, వారి కుటుంబ సభ్యులే. వీరిలో చాలా మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు, వ్యవసాయ కార్మికులు.

లక్షల మంది బంగ్లాదేశీ అక్రమ శరణార్థులు అస్సాంలో స్థిరపడ్డారని 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)', రాష్ట్రంలోని పాలక భారతీయ జనతా పార్టీ, బీజేపీ మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Image copyright AFP/Getty Images

ఓటర్ల జాబితాలో 'డీ-ఓటర్'

పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు సమర్పించలేదంటూ ఎన్నికల కమిషన్ రెండేళ్లుగా ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్ల పక్కన 'డీ-ఓటర్' అని రాస్తోంది.

బంగ్లాదేశీ అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అస్సాంలోని భారత పౌరులందరి వివరాలతో జాబితా సిద్ధం చేస్తోంది.

'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్‌ఆర్‌సీ)' తుది జాబితా జూన్‌లో వెలువడనుంది.

ఓటర్ల జాబితాలో 'డీ-ఓటర్' అని పేర్కొన్నవారిని, విదేశీయులుగా తేలినవారిని ఈ జాబితాలో పొందుపరచబోమని ఎన్‌ఆర్‌సీ చీఫ్ ప్రతీక్ హజేలా చెప్పారు. పౌరులందరి వంశ వృక్షం వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. 29 లక్షల మంది మహిళలకు పంచాయతీలు ధ్రువపత్రాలు ఇచ్చాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదలైన తర్వాత ఎంత మంది పౌరసత్వాన్ని, భారత జాతీయతను కోల్పోతారనేది చెప్పడం కష్టమని ప్రతీక్ హజేలా తెలిపారు. తుది జాబితా రూపకల్పన చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. తాము విడుదల చేయబోయే జాబితా పూర్తి కచ్చితత్వంతో ఉంటుందని, ఇదే అంతిమమని చెప్పారు.

బహిష్కరణ ముప్పు?

తుది జాబితా వచ్చాక అస్సాంలో ఉండే లక్షల మంది ముస్లింలకు దేశ బహిష్కరణ తప్పకపోవచ్చంటూ మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజం ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

డీ-ఓటర్లు, విదేశీయులుగా ప్రకటించినవారి సంఖ్య దాదాపు ఐదు లక్షలని, వారి సంతానం 15 లక్షల వరకు ఉంటుందని, వీరందరినీ ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో చేర్చరని 'జస్టిస్ ఫోరం'కు చెందిన అబ్దుల్ బతిన్ ఖాండ్కర్ అభిప్రాయపడ్డారు. బెంగాలీ మూలాలున్న 20 లక్షల మంది పౌరసత్వం, జాతీయత కోల్పోతారంటూ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో లేనివారిని బంగ్లాదేశీయులంటూ బంగ్లాదేశ్‌కు పంపించేయాలంటే ముందు వాళ్ల జాతీయతను నిర్ధరించాలి.

వీరు బంగ్లాదేశ్ పౌరులని నిరూపించడం కూడా సాధ్యం కాదు. ఇలాంటి వారిని బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించేందుకు వీలు కల్పించే ఒప్పందమేదీ కూడా రెండు దేశాల మధ్య లేదు.

ఇదో సంక్లిష్టమైన పరిస్థితి.

Image copyright BBC/SHIB SHANKAR CHATTERJEE

‘ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకొంటుంది’

అస్సాం వ్యవహారాలను నిశితంగా పరిశీలించే విశ్లేషకుడు నీలమ్ దత్తా మాట్లాడుతూ- ''ఎవరైనా పౌరుడిని విదేశీయుడని ప్రభుత్వం ప్రకటిస్తే, అతడికి కోర్టును ఆశ్రయించే మార్గం ఉంటుంది. అస్సాంలో బంగ్లాదేశీ వలసదారుల జనాభా అనేది రాజకీయ అంశం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొంటుంది'' అని అభిప్రాయపడ్డారు.

భారతీయులు కాదంటూ అదుపులోకి తీసుకొనేవారిని ఉంచేందుకు శిబిరాల ఏర్పాటు కోసం రాష్ట్రంలో ప్రభుత్వం చాలా చోట్ల భూమిని సేకరిస్తోంది. జోర్హాట్, డిబ్రూగఢ్, గ్వాల్‌పాడా, సిల్చార్, తేజ్‌పుర్, కోక్రాఝర్ జైళ్లలో ఇప్పటికే కస్టడీ శిబిరాలు ఏర్పాటయ్యాయి.

తొలి జాబితా విడుదలయ్యాక ఒకరి ఆత్మహత్య

నెల క్రితం ఎన్‌ఆర్‌సీ తొలి జాబితా విడుదలైన తర్వాత కచ్చర్ జిల్లాలో హనీఫ్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి జాబితాలో ఆయన తన పేరును చూసుకోలేదు.

జాబితాలో పేరు లేకపోతే తనను అరెస్టు చేసి బంగ్లాదేశ్‌కు పంపించేస్తారనే భయంతో మనోవేదనకు లోనై హనీఫ్ ఖాన్ బలవన్మరణం చెందారు.

జాబితాలో ఆయన పేరు లేదు.

Image copyright BBC/SHIB SHANKAR CHATTERJEE
చిత్రం శీర్షిక రంజీత్ దాస్

ఓటు హక్కును తొలగిస్తారేమో: బీజేపీ అస్సాం శాఖ

పౌరసత్వాన్ని కోల్పోయేవారు పెద్ద సంఖ్యలో ఉంటారని పాలక బీజేపీ భావిస్తోంది.

వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారని బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్ చెప్పారు. అయితే భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారిని దేశంలో ఉండేందుకు అనుమతించొచ్చని తెలిపారు.

ఓటుహక్కును తొలగించడం లాంటి చర్యలు చేపట్టవచ్చని, ఏదో ఒక పరిష్కారమైతే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

నిజానికి పౌరుల జాబితాను రూపొందించే కార్యక్రమాన్ని లోగడ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరుణ్ గొగోయ్(కాంగ్రెస్) ప్రారంభించారు.

Image copyright BBC/SHIB SHANKAR CHATTERJEE
చిత్రం శీర్షిక అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్

అస్సాంలో 'బంగ్లాదేశీయుల సమస్య' కేవలం రాజకీయ నినాదమేనని ఆయన ఆరోపించారు.

''రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది. ఇప్పటివరకు ఎంత మంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారో ప్రభుత్వాన్ని చెప్పమనండి. ఎన్ఆర్‌సీలో పేర్లు పొందుపరచనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎవరికైనా బలవంతంగా 'విదేశీయుడు' అనే హోదా ఇస్తే, మేం వ్యతిరేకిస్తాం. ఇది ప్రజాస్వామ్యం. 'చట్టబద్ధ పాలన' అని ఒకటి ఉంటుంది'' అని తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు.

అస్సాంలోని బెంగాలీ ముస్లింలందరూ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.

ఎన్‌ఆర్‌సీకి సంబంధించి చివరిదైన రెండో జాబితా జూన్ ద్వితీయార్ధంలో విడుదలవుతుంది. లక్షల మంది ముస్లింల భవిష్యత్తు ఈ జాబితాపైనే ఆధారపడి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం