మూఢ నమ్మకాలకు ‘బలి’ అవుతున్నామా?

  • దీప్తి బత్తిని
  • బీబీసీ ప్రతినిధి
యముడి ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

కోయదొర చెప్పాడని భార్య ఆరోగ్యం కోసం పసికందును నరబలి ఇచ్చాడో భర్త.

జనవరి 31న చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు చేసి పసికందు తలనరికి చంద్రుడుకి 'బలి' ఇచ్చాడతను.

ఆ బిడ్డ శరీరం కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

'ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను' అని అడిగినందుకు 28 ఏళ్ల దీపిక విజయనగరం జిల్లాలోని ఒక గ్రామంలో బాబాతో తాయత్తు కట్టించుకోవాల్సి వచ్చింది.

'నేను మురళి కలిసి ఒక ఎంఎన్‌సీలో పని చేస్తున్నాం. మూడు సంవత్సరాలుగా మాకు పరిచయం. ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాను. మా అమ్మ నాకు పిచ్చి పట్టిందని బాబా దగ్గరకు తీసుకెళ్ళింది.

ఆ బాబా ఏవో 'మంత్రాలు' చదివి, ఒక తాయత్తు కట్టి మా అమ్మ దగ్గర నుండి 5,000 రూపాయలు తీసుకున్నాడు.

నేను మురళిని పెళ్లి చేసుకుంటే 'దోషం' ఉంటుంది అని కూడా హెచ్చరించాడు.

కానీ, మురళిని పెళ్లి చేసుకుని నేను హాయిగా జీవితం సాగిస్తున్నా'' అని దీపిక చెప్పింది.

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ అనర్గళంగా ఆంగ్లం మాట్లాడుతుంది. ఎంబీఏ పట్టా కూడా ఉంది. పలుమార్లు విదేశాలకు కూడా వెళ్లి వచ్చింది.

కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో ఓ దర్గాలో జీవితం గడుపుతోంది.

అక్కడికి వెళ్లి ఫర్జానా మేడం అంటే ఎవరైనా చూపిస్తారు. ఆమె వయస్సు 50 సంవత్సరాలకు పైనే ఉంటుంది.

ఎందుకిలా అని అడిగితే.. 'బేటా నాకు ఎటాక్ వస్తూ ఉంటుంది. నా కుటుంబ సభ్యులే కావాలని నా ఆస్తి కోసం చేతబడి చేయిస్తున్నారు. అందుకే నేను ఇక్కడకు వచ్చి ఉంటున్నా. ఎవరో ఒకరు ఇంత భోజనం పెడితే తిని ఉంటున్నా. ఎన్ని లక్షలు పోసినా నా జబ్బు తగ్గదు. ఇక్కడైతేనే తగ్గుతుంది' అని ఆమె బదులిస్తుంది.

మరి మీ పిల్లలు చూసుకోవట్లేదా అని ప్రశ్నిస్తే.. 'నై. వాళ్ళ బాగు కోసమే కదా నేను ఇక్కడ ఉంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎటువంటి ఎటాక్ రాలేదు. చేత బడికి ఇదే సమాధానం' అంటూ భోజనం తెచ్చుకునేందుకు వెళ్లిపోయింది.

'ఇంటి ముందు ముగ్గు పెడితే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. కానీ దానివెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని - ఇంటి ముందు ఉన్న చెత్త శుభ్రం చేసుకోవటానికి - అని చెపితే అర్థం చేసుకునే ఆలోచన, విచక్షణ ఉండదు' అని మనస్తత్వవేత్త డాక్టర్ పట్టాభిరామ్ అంటున్నారు.

'మనిషికి ఒక భయం అనేది ఉంటుంది. ఒక మతం మీద నమ్మకంతో ఉంటారు. కానీ నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉంది. మతం పేరిట ఉపచేతన మనస్సును కంట్రోల్ చేసి విశ్వాసాన్ని రుద్దితే మూఢనమ్మకాలకు దారి తీస్తుంది' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, youtube/bvpattabhiram

నమ్మకం - మూఢనమ్మకం

ఒకపక్క విశ్వరహస్యాలను ఛేదిస్తున్నాం. మరోపక్క మూఢనమ్మకాలతో ప్రాణాలు హరించడం, తీసుకోవడం.. విచారించాల్సిన విషయమని హేతువాదులు, శాస్త్రకారులు అంటున్నారు.

నమ్మకం, మూఢ నమ్మకం మధ్యన ఉన్న తేడా ఏమిటనేది హేతువాది బాబు గోగినేని వివరిస్తూ.. 'ప్రశ్నించకుండా అనుసరించే నమ్మకం అంధ విశ్వాసం. ఏదైనా, విశ్వాసం పేరిట చెప్పిన దాన్ని ధ్రువీకరించటానికి ఇష్టపడనప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది' అని చెప్పారు.

మూఢ నమ్మకాన్ని శాస్త్రీయం అనే పేరుతో నమ్మించే ప్రయత్నంలో జీవంలేని వస్తువులకు (రంగు రాళ్ళు, అంకెలు, పసుపు, కోడి ఇలా ఎన్నింటికో) శక్తి ఆపాదించి వాటిని నమ్మకం పేరుతో అనుసరించడం మూలానే ఇలా తయారవుతున్నారని ఆయన అంటారు.

'వాస్తు, జ్యోతిష్యం వెనుక ఎంటువంటి శాస్త్రీయత లేదు. వాస్తు ప్రకారం, భూమి ఫ్లాట్‌గా మూలాలతో కలిగి ఉంది అనడం, జ్యోతిష్యంలో భూమి చుట్టూ సూర్యుడు తిరగటం మళ్ళీ దానికి కులం ఆపాదించటం, ఇవన్నీ అజ్ఞానులైన యోగ్యత లేని వ్యాపార ప్రయోజనాలు చూసుకునే కొంత మంది ప్రచారం చేస్తున్నవి' అని బాబు గోగినేని పేర్కొన్నారు.

'పురాణాలలో బలి అనే ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఇచ్చి దాన్ని ఆలా కొనసాగిస్తూ రావటం మూలాన మన సమాజంలో బలి అనేది సర్వసాధారణమే అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది' అని అంటున్నారు జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ఎల్. కాంతారావు.

బాబాలు - వ్యాపారం?

ఎన్నో ఏళ్లుగా 'జ్యోతిష్యం' చెప్తూ 'ప్రేమలో సమస్యలు ఉన్నా, ఆరోగ్యంలో సమస్యలు ఉన్నా సంప్రదించగలరు' అని 'వశీకరణం' అనే పేరుతో ఒక వెబ్‌సైట్ పెట్టుకున్న ఒకరిని ఒక సాధారణ వ్యక్తిగా కలవాలని బీబీసీ ప్రతినిధి ప్రయత్నించారు.

ఫోన్ చేసి కలవాలి ఎలా అని అడిగితే, హైదరాబాద్‌లో నవోదయ కాలనీలో ఉంటాము. సమస్య ఏమిటో చెప్పమని అడగారు.

మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎలా పరిష్కరిస్తారు అని అడిగితే, బ్యాంకు అకౌంట్ ఇస్తాము, మీ సమస్య మెయిల్ చేసి డబ్బు అకౌంట్‌లో వేస్తే అపాయింట్‌మెంట్ ఇస్తాము అని అన్నాడు.

నేను 'బీబీసీ' నుంచి అని చెప్పగానే, 'నేను ఊళ్ళో లేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్‌లో చెప్పటం కుదరదు' అని ఫోన్ కట్ చేశాడు ఆ బాబా.

నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2000 నుంచి 2012 మధ్యలో, ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్‌లో 'వశీకరణం', 'మంత్రవిద్య' నిర్వహిస్తున్నారనే అనుమానంతో దాదాపు 350మందిని చంపారు. గత మూడు సంవత్సరాల గణాంకాల ప్రకారం తెలంగాణలో 39 కేసులు ఉన్నాయి.

'ప్రభుత్వంలో ఉండి ముందుకు నడపాల్సిన నాయకులే ఒక నమ్మకం పేరుతో అశాస్త్రీయ పనులు చేస్తున్నపుడు, ప్రజల్లో మార్పు వస్తుంది అనుకోవడం కాస్త కష్టం' అని జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ఎల్.కాంతారావు వ్యాఖ్యానించారు.

'కొంత విద్య పరిజ్ఞానం ఉండి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బలం పలుకుపడి ఉన్నా కూడా, దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నారు' అని బాబు గోగినేని పేర్కొన్నారు.

విజ్ఞానశాస్త్ర తత్వవేత్త, రచయిత్రి, మీరానంద తన పుస్తకం, 'ద గాడ్ మార్కెట్‌'లో "మతతత్వం స్టేట్-టెంపుల్-కార్పొరేట్ సమన్వయంతో ఉద్భవిస్తుంది" అని రాసారు. ఇలా హిందూ మత సంప్రదాయం, చిహ్నాలను పరిపాలన శైలిలో పొందుపరచటం మూలాన ప్రభుత్వ సంస్థలలో లౌకికత లోపిస్తోందని అని కూడా వాదించారు.

పరిష్కారం ఏమిటి?

''మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గి వంటి వారి మీద 'మత మనోభావాలను దెబ్బతీస్తున్నారు' అని కేసులు పెట్టారు.

డాక్టర్ దభోల్కర్ మూఢ నమ్మకాలకు వ్యతిరేక బిల్లు కోసం పోరాడారు. ఇటువంటి చట్టం తెస్తే మూఢనమ్మకాలూ, అంధ విశ్వాసాలు తగ్గవు. కానీ ప్రజలలో ఉన్న నమ్మకాల పేరిట దోపిడీ చేసే వారి నుంచి రక్షణ కల్పించటమే ఇలాంటి చట్టాల ఉద్దేశం. నమ్మకాలూ - విశ్వాసాలకు ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్‌లా అవి పనిచేస్తాయి" అని వివరించారు గోగినేని.

పాఠ్య పుస్తకాలలో మూఢ నమ్మకాల గురించి వివరించి చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించటం నేర్పితే రాబోయే తరంలో నమ్మకం అంధ విశ్వాసంగా మారకుండా ఉండే అవకాశముందని ఎల్.కాంతారావు అభిప్రాయపడ్డారు.

మూఢ నమ్మకాల మత్తు నుంచి బయటకు రావాలి అనుకునే వారికీ 'పాజిటివ్ రిఇన్ఫోర్స్మెంట్' ద్వారా సహాయ సహకారాలు అందించవచ్చని మనస్తత్వవేత్త పట్టాభిరామ్ పేర్కొన్నారు.

మీరివి చదివారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)