ప్రెస్‌రివ్యూ: 'కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం పొరపాటు'

బాబు కేసీఆర్

ఫొటో సోర్స్, Ncbn / kcr

'కేసీఆర్‌కు మంత్రిపదవి ఇవ్వకపోవడం పొరపాటు' అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 40ఏళ్లు అయిన సందర్భంగా ఏపీ సీఎంను ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది.

ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని తప్పులు చేశానని చంద్రబాబు హుందాగా అంగీకరించారు.

ఇప్పుడు అలాంటి తప్పులు చేయకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నానని, సమతుల్యత పాటిస్తున్నానని తెలిపారు.

కొన్ని 'క్యాలిక్యులేటెడ్‌ మిస్టేక్స్‌' చేయడం సహజమేనని, కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం కూడా అలాంటిదేనని చంద్రబాబు అంగీకరించారు.

'కేసీఆర్‌ నాతో చాలా బాగుండేవాడు. ఆయనకు వ్యతిరేకంగా కరణం రామచంద్రరావు ఉన్నప్పటికీ... సరిచేశాం. నిజానికి... మంత్రి పదవి విషయంలో కేసీఆర్‌ కంటే విజయరామారావు బెటర్‌ లీడర్‌ కాదు కదా! విజయరామారావు ఒక అధికారి. పీజేఆర్‌ను ఓడించగలిగారనే ఉద్దేశంతో పదవి ఇచ్చాం. కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందవు.

అయితే.. ప్రతిదానికీ ఏదో అయిపోతుందనుకుంటే... ఏదీ చేయలేం. ఒక్కోసారి 'జడ్జిమెంట్‌ ఆఫ్‌ ఎర్రర్‌' ఉంటుంది' అని చంద్రబాబు అన్నారు.

పలువురు ప్రధానమంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు... తనకు మాత్రం ఆ పదవి చేపట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, kcr

మద్దతు ధర పెంచితే 'మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?

రైతులు పండించే పంటలకు మద్దతు ధర పెంచితే 'మీ అయ్య సొమ్ము ఏమైనా పోతుందా?' అంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. దేశంలో రైతులు సహనం కోల్పోతున్నారని, వారి ఓపికను పరీక్షించడం జాతీయ పార్టీలకు మంచిది కాదని కేసీఆర్ హెచ్చరించారు.

జాతీయ పార్టీలపై బరాబర్‌ విమర్శలు చేస్తానని, వాటిపై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని కోర్టా-చనకా బ్యారేజీ పనులను మంగళవారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రమని, డబ్బులకు ఎలాంటి కొదవ లేదని చెప్పారు.

రైతులు బలపడితేనే గ్రామీణ అభివృద్ధి సాధ్యమని, అందుకే ఎకరాకు రూ.4వేలు ఇస్తున్నామని చెప్పారు.

ఫొటో సోర్స్, Sean Gallup/Getty Images

మోదీ సర్కారుకు తగ్గుతున్న ఆదరణ

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ - సీఎస్‌డీఎస్‌ చెప్పినట్లు నవతెలంగాణ పత్రిక కథనం రాసింది. దాని ప్రకారం..

సీఎస్‌డీఎస్‌కు చెందిన లోక్‌నీతి రిసెర్చ్ ప్రోగ్రామ్‌కు చెందిన కొందరు పరిశోధకులు జాతీయ స్థాయిలో ఈ సర్వే చేశారు.

సీఎస్‌డీఎస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లో యూపీఏ 2 ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కన్నా ప్రస్తుతం మోదీ సర్కార్‌పై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు ప్రజల సమస్యలు కూడా దీనికి కారణంగా సర్వే నిర్ధరించింది.

మోదీ హయాంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని ఈ సర్వేలో తేలింది. నోట్ల రద్దు తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ప్రజల అసంతృప్తికి కారణమని ఈ సర్వే పేర్కొంది.

మోదీ పాలనపై అసంతృప్తి 2016 నుంచి పెరగడం మొదలైందని, 2017 తర్వాత ఇది మరింత వేగవంతమైందని తెలిపింది.

మంచి రోజులు తెస్తామన్న హామీని నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారన్న భావన ప్రజల్లో వ్యక్తమైందని సీఎస్‌డీఎస్‌లో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇక తుక్కుగా మారనున్న పాత వాహనాలు

పదిహేనేళ్లు పైబడిన వాహనాలను రద్దు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని ఈనాడు కథనం రాసింది. దాని ప్రకారం..

వాహన కాలుష్యానికి కళ్లెం వేసే లక్ష్యంతో పాత వాహనాలకు చెల్లుచీటీ రాసే విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవలే ప్రకటించారు.

ఆర్థిక శాఖ నుంచి లభించిన ఆమోదంతో జీఎస్టీకి కేబినెట్‌ నోట్‌ వెళ్తుంది.

కేంద్రం, రాష్ట్రం ఏ స్థాయిలో రాయితీలు ఇవ్వాలో అక్కడ నిర్ణయిస్తారు.

పాత వాహనాన్ని అప్పగించి సుమారు రూ.15 లక్షల విలువైన కొత్త వాణిజ్య వాహనాన్ని కొనేవారికి రూ.5 లక్షల మేర ప్రయోజనం కల్పించాలనేది ఒక ప్రతిపాదన.

'స్వచ్ఛంద వాహన ఆధునికీకరణ కార్యక్రమం' (వీ-వీఎంపీ) అమలుపై రవాణా శాఖ ఆసక్తితో ఉంది.

ఏటా 22% చొప్పున పెరిగిపోతున్న వాహనాల సంఖ్యకు, అవి వెలువరించే కాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి ఇది అవసరమని దిల్లీలో గడ్కరీ చెప్పారు.

వీ-వీఎంపీ విధానం ఆమోదం పొందితే ఆటోమొబైల్‌ పరిశ్రమలకు మన దేశం కేంద్రంగా మారుతుందనీ, వాడుక నుంచి తొలగించిన వాహనాలను ఇతర విడిభాగాల ఉత్పత్తికి వినియోగించుకోవచ్చనీ చెప్పారు.

దీనివల్ల వాహనాల ధరలూ తగ్గే అవకాశం ఉందన్నారు.

31.3.2005, అంతకంటే ముందు కొన్న 2.80 కోట్ల వాహనాలను తుక్కుగా మార్చాలనేది ప్రభుత్వ ప్రతిపాదన.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.