REALITY CHECK: ఈ ఫొటోలు ఇప్పటివి కావు!

ఫొటో సోర్స్, Marco Di Lauro
సూచన: కొన్ని ఫొటోలు కలచివేసేవిగా ఉండొచ్చు
‘ఇదీ ప్రస్తుతం సిరియాలో పరిస్థితి’, ‘మీడియా సిరియా బాధితులను పట్టించుకోవట్లేదు’, ‘సిరియాలో జరుగుతున్న నరమేధం’ లాంటి వ్యాఖ్యలతో అనేక ఫొటోలు సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి.
సిరియాలో పరిస్థితి దారుణంగా ఉన్న మాట నిజమైనప్పటికీ, ఇలా షేర్ అవుతున్న ఫొటోల్లో ఎక్కువ భాగం వర్తమాన సిరియా ఘర్షణలకు సంబంధించినవి కావు.
పైనున్న ఫొటో దానికో ఉదాహరణ. పదుల సంఖ్యలో మూట గట్టి ఉన్న మృతదేహాల మీదుగా ఓ పిల్లాడు పరుగెడుతున్న ఆ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
అవన్నీ ప్రస్తుతం సిరియాలో జరుగుతున్న దాడుల్లో చనిపోయిన పిల్లల మృతదేహాలని పేర్కొంటూ చాలామంది దాన్ని పంచుకుంటున్నారు. కానీ ప్రస్తుత సిరియా దాడులకూ, ఆ ఫొటోకూ ఏ మాత్రం సంబంధం లేదు.
ఎప్పటి ఫొటో: 2003 మే 27న ఇరాక్‌లో తీసిన ఫొటో ఇది. మార్కో డి లారో అనే ఫొటోగ్రాఫర్ దీన్ని తీశారు. సామూహిక సమాధుల్లో బయటపడ్డ మృతదేహాలను గుర్తించేందుకు ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌కు 40కి.మీ దూరంలోని ఓ స్కూల్‌కి వీటిని తరలించారు. అల్ ముసయ్యిబ్ నగర శివార్లలోని ఓ ఎడారిలో వీటిని కనుగొన్నట్టు ఫొటోగ్రాఫర్ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, facebook
సిరియాలోని ఘూటా ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో చనిపోయిన పిల్లల ఫొటో ఇదీ అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కానీ ప్రస్తుత దాడులకూ, ఈ ఫొటోకూ సంబంధం లేదు.
ఎప్పటి ఫొటో: 2013 ఆగస్టు 21న సిరియాలో తీసిన ఫొటో ఇది. షామ్ న్యూస్ నెట్వర్క్కి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ దీన్ని తీశారు. ఈ ఫొటో ఘూటా ప్రాంతంలో తీసిందే అయినా, ప్రస్తుత దాడులకు దీనికి సంబంధం లేదు. వీటిని గతంలో ఘూటాలో జరిగిన రసాయన దాడుల్లో చనిపోయిన పిల్లల మృతదేహాలుగా ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ భావిస్తోంది.
ఫొటో సోర్స్, Twitter
ఈ పసివాడిపై ఇలా తుపాకీ గురిపెట్టారనీ, ఇది ప్రస్తుతం సిరియాలోని పరిస్థితులకు నిదర్శనమనీ వివరిస్తూ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ఫొటో ఇప్పటి సిరియా దాడులకు సంబంధించినది కాదు.
ఎప్పటి ఫొటో: 2014 ఏప్రిల్‌లో తీసిన ఫొటో ఇది. సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు దళం 'ఫ్రీ సిరియన్ ఆర్మీ' మద్దతుదారు ఒకరు ఈ ఫొటోను తీసినట్లు భావిస్తున్నారు. ఈ ఫొటో నిజమైందో లేక ప్రచారం కోసం తీసిందో నిర్ధరించుకోలేకపోయినట్లు ‘డెయిలీ మెయిల్’ 2014 ఏప్రిల్ 21న ప్రచురించిన కథనంలో పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
ఈ ఫొటో కూడా ప్రస్తుతం సిరియా దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిదిగా ప్రచారంలో ఉంది.
ఎప్పటి ఫొటో: 2016 నవంబర్‌లో సిరియాలోని అలెప్పో నగరంలో తీసిన ఫొటో ఇది. అమీర్ అల్హాల్బీ అనే ఫొటోగ్రాఫర్ దీన్ని తీసినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. 2016లో సిరియాలో ఓ భవనం శిథిలాల్లో చిక్కుకున్న పిల్లాడిని బయటకు తీస్తుండగా తీసిన ఈ ఫొటోను ప్రస్తుత దాడులకు ముడిపెట్టి షేర్ చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Rex Features
ప్రస్తుత సిరియా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ పిల్లాడి పరిస్థితి ఇదీ అంటూ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. కానీ ఈ ఫొటో కూడా ఇప్పటిది కాదు.
ఎప్పటి ఫొటో: 2012 అక్టోబర్ 4నద టెలిగ్రాఫ్ ప్రచురించిన కథనంలో ఈ ఫొటో ఉంది. అలెప్పోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఓ పిల్లాడి ఫొటోను అక్టోబర్ 3న, అంటే ఆ ముందు రోజున తీసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
ఒక్క సిరియా దాడులే కాదు, ఇతర అనేక అంశాలకు సంబంధించిన ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వాటిని పంచుకునేముందు ‘గూగుల్ రివర్స్ సెర్చ్’ లేదా ఇతర ఆన్లైన్ టూల్స్ ద్వారా ఫొటోలకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)