శంకరాచార్య జయేంద్ర సరస్వతి కన్నుమూత

  • 28 ఫిబ్రవరి 2018
జయేంద్ర సరస్వతి Image copyright Getty Images

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం మృతి చెందారు.

ఆయనకు 83 ఏళ్లు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయన తుది శ్వాస విడిచారు.

జయేంద్ర సరస్వతి కొన్ని మూఢాచారాలను వ్యతిరేకించారు. కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.

చంద్రశేఖేంద్ర స్వామిగళ్ 1954 మార్చి 22న జయేంద్ర సరస్వతిని తన వారసుడిగా ప్రకటించారు. అలా ఆయన 69వ పీఠాధిపతి అయ్యారు.

పాత్రికేయుడు ఎస్. గురుమూర్తి బీబీసీతో మాట్లాడుతూ, "ఆయన మఠానికి ఒక కొత్త దిశనిచ్చారు. ప్రారంభంలో మఠం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితమయ్యేది. ఆయన మత సంస్థలను సామాజిక కార్యక్రమాలతో జోడించారు. అందుకే ఆయన దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు" అని చెప్పారు.

మఠం సంరక్షుడు జయకృష్ణన్ మాట్లాడుతూ, "సమాజంలో అత్యంత నిమ్న స్థాయిలో నిలబడిన వారికి మద్దతు ఇవ్వడం కోసం ఆయన ఉద్యమం సాగించారు. మొదట్లో మఠం కాంచీపురం, తమిళనాడు రాష్ట్రం వరకే పరిమితమై ఉండేది. ఆ తర్వాత ఆయన దీని పరిధిని ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరింపజేశారు. అక్కడ ఆయన స్కూళ్లు, ఆసుపత్రులు ప్రారంభించారు" అని చెప్పారు.

"ఆయన మఠాన్ని సమాజంతో జోడించారు. ప్రజా సంబంధమైన వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చారు. ఇతర మతాల పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు" అని గురుమూర్తి చెప్పారు.

సీనియర్ స్వామితో విభేదాలు

మఠాలను సామాజిక కార్యకలాపాలతో జోడించే విషయంపై జయేంద్ర సరస్వతికీ, ఆయన సీనియర్ స్వామి చంద్రశేఖేంద్ర సరస్వతి స్వామిగళ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయన్న విషయాన్ని గురుమూర్తి నిరాకరించారు.

Image copyright Getty Images

"ఆ విభేదాలు స్వామీజీతో కావు, మఠ నిర్వాహకులతోనే" అని ఆయన అన్నారు.

ఈ విభేదాల కారణంగానే ఆయన 1980లో ఎవరికీ చెప్పకుండా కాంచీపురం మఠాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆయన కాంచీపురానికి వచ్చారు.

2004 నవంబర్ 11న తమిళనాడు పోలీసులు జయేంద్ర సరస్వతిని అరెస్టు చేయడంతో ఆయన వార్తల్లోకెక్కారు. కంచి మఠం మేనేజర్ శంకర్‌రమణ్‌ను హత్య చేసినట్టు ఆయనపై ఆరోపణలు చేశారు.

శంకర్‌రమణ్‌ను 2004 సెప్టెంబర్ 3న మందిర పరిసరాల్లో హత్య చేశారు. జయేంద్ర సరస్వతికి వ్యతిరేకంగా శంకర్‌రమణ్‌ అప్పటికే ప్రచారం చేస్తున్నందు వల్ల పోలీసులు ఈ హత్యకు జయేంద్ర బాధ్యుడు కావొచ్చని అనుమానించారు.

Image copyright Getty Images

అరెస్టులో జయలలిత హస్తం?

ఆ తర్వాత పోలీసులు జయేంద్ర సరస్వతి, విజేంద్ర సరస్వతి సహా మొత్తం 23 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ 2009లో ప్రారంభం కాగా, మొత్తం 189 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.

ఆయితే సరైన సాక్ష్యాలు లేవన్న కారణంగా ముద్దాయిలందరినీ కోర్టు 2013 నవంబర్ 13న నిర్దోషులుగా ప్రకటించింది.

దీనిపై మాట్లాడుతూ గురుమూర్తి, "అదొక రాజకీయపరమైన కేసు. ఎలాంటి సాక్ష్యమూ లేదు. అయితే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కావాలనే ఆయనను కేసులో ఇరికించారని నేననుకోను. అయితే ఆ సమయం అలాంటిది. ఈ హత్యకు నిరసనగా డీఎంకే నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు ఈ చర్య చేపట్టక తప్పలేదు" అని అన్నారు.

Image copyright Getty Images

"ఆయనను అరెస్టు చేయడంతో మాకు చాలా ఆగ్రహం కలిగింది. అయితే ఆయన నిర్దోషి అని మా అందరికీ తెలుసు. దీంతో ఆయన ఇమేజి దెబ్బతిన్నదని నేనేమీ అనుకోను" అని ఆయనన్నారు.

జయేంద్ర సరస్వతి అరెస్టుకు నిరసనగా తమిళనాడుకన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రదర్శనలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు