మీకు తెలిసిన శ్రీదేవి వేరు.. నాకు తెలిసిన శ్రీదేవి వేరు: రాం గోపాల్ వర్మ

శ్రీదేవి

ఫొటో సోర్స్, Twitter

ఈ ఉత్తరంలో కొన్ని పేర్లు ప్రస్తావించిన కారణంగా దీన్ని బయటపెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాను. కానీ, శ్రీదేవి అభిమానులకు ఇది కచ్చితంగా తెలియవలసిన విషయంగా భావించి పబ్లిక్ చేస్తున్నాను.

శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ

- రాం గోపాల్ వర్మ

మీ అందరిలాగే నాకు కూడా ఆవిడ అతిలోక సౌందర్యవతి, సూపర్ స్టార్. సిల్వర్ స్క్రీన్ మీద 20 ఏళ్ళకు పైగా ఒక వెలుగు వెలిగిన తార.

కానీ అది కథలో ఒక పార్శ్వం మాత్రమే. శ్రీదేవి మరణం గుండెల్ని మెలిపెట్టేసేది అయినా, జీవితం ఎంత క్రూరమైనదో, నిర్దయగలదో మరోసారి గుర్తుకువస్తుంది.

ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఆమె అందం, అసాధారణ ప్రతిభ, ఆమె మరణం కలిగించిన బాధ, RIP లతో పాటుగా నాకు మాట్లాడడానికి ఇంకా ఎన్నో విషయాలున్నాయి.

క్షణక్షణం, గోవిందా గోవింద సినిమాలలో శ్రీదేవితో పని చేసిన కారణంగా నాకు ఆమెను దగ్గరగా చూసే అవకాశం కలిగింది. సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, మనకు కనిపించినదానికన్నా ఎంత వైవిధ్యంగా ఉంటాయో చెప్పడానికి శ్రీదేవి జీవితం ఒక మంచి ఉదాహరణ.

చాలామంది దృష్టిలో శ్రీదేవి జీవితం మచ్చలేనిది. అందం, ప్రతిభ, చక్కని సంసారం, ముచ్చటైన ఇద్దరు కూతుర్లు. బయటనుండి చూసినవాళ్ళకి ఆమెది ఆనందమయ జీవితం అనిపిస్తుంది. కానీ, నిజంగా శ్రీదేవి తన జీవితంలో ఆనందంగా ఉండేదా?

నేను ఆవిడను మొదటిసారి కలిసినప్పటినుంచీ ఆవిడ జీవితం గురించి నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు బతికున్నంతకాలం ఆమె ఒక స్వేచ్ఛాజీవి. కానీ తరవాత వాళ్ల అమ్మగారి అతిజాగ్రత్త వల్ల పంజరంలో చిలుకలా అయిపోయింది ఆమె పరిస్థితి.

ఆరోజుల్లో సినీతారలకు పే‌మెంట్, బ్లాక్ మనీ రూపంలో అందేది. ఆదాయ పన్ను అధికారుల తనిఖీలకు భయపడి వాళ్ల నాన్నగారు తన స్నేహితులను, బంధువులను నమ్మి డబ్బు వాళ్లందరి పేరిట పెట్టారు. ఆయన పోయాక వాళ్లంతా ఆమెను మోసం చేసారు.

దీనికి తోడు, శ్రీదేవి వాళ్ల అమ్మగారు పెట్టిన పెట్టుబడులు వికటించాయి. ఈ పరిస్థితులన్నీ శ్రీదేవిని కట్టుబట్టలతో నిలబెట్టాయి. అప్పుడే బోనీ కపూర్ ఆమె జీవితంలోకి వచ్చారు. అప్పటికి ఆయన కూడా చాలా అప్పుల్లో ఉన్నారు. ఆర్థికంగా ఏరకమైన సహాయం అందించలేకపోయినా, బోనీ ఆమెకు కావలసిన ఓదార్పునివ్వగలిగారు.

తరవాత వాళ్ళమ్మగారికి యూఎస్ఏలో జరిగిన తప్పుడు ఆపరేషన్ వల్ల ఆవిడ మానసికంగా బలహీనపడ్డారు. అదే సమయంలో శ్రీదేవి చెల్లెలు శ్రీలత వాళ్ళ పక్కింటి అబ్బాయిని పారిపోయి పెళ్ళిచేసుకున్నారు. వాళ్ల అమ్మగారు చనిపోయేముందు ఆస్తి అంతా శ్రీదేవి పేరు మీద రాశారు. దాంతో శ్రీలత, శ్రీదేవి మీద కేసు వేసింది.

వాళ్ల అమ్మగారు అమాయకులని, శ్రీదేవి మోసం చేసి ఆస్తి మొత్తం తన పేర రాయించుకుందని నిందలు వేసింది. ఈ పరిస్థితుల వల్ల ఎందరి మనసులనో దోచిన స్త్రీ, ఒంటరిగా, కట్టుబట్టలతో మిగిలిపోయింది.

బోనీ వాళ్ల అమ్మ శ్రీదేవిని కాపురంలో చిచ్చు పెట్టే మనిషిగా చిత్రీకరించారు. బోనీ మొదటి భార్య మోనా దుఃఖానికి కారణమైందని నిందలు వేస్తూ, పబ్లిక్‌గా ఒక ఫైవ్ స్టార్ హొటల్ లాబీలో శ్రీదేవి కడుపులో గుద్దారు.

ఫొటో సోర్స్, RGV/FB

ఈ మొత్తం కాలంలో, ఇంగ్లీష్-వింగ్లీష్ విడుదల సందర్భంలో తప్పితే, శ్రీదేవి సంతోషంగా లేరనే చెప్పొచ్చు. వ్యక్తిగత జీవితంలోని ఒడుదొడుకులు, భవిష్యత్తు పట్ల అనిశ్చితి ఆమె సున్నితమైన మనసుని దెబ్బతీశాయి. ఆ తరవాతంతా ఆమె జీవితంలో శాంతి కొరవడింది.

అతి చిన్నవయసులోనే సినిమాల్లోకి రావడంతో, మిగతా అందరి పిల్లల్లాగా హాయిగా, తనదైన క్రమంలో ఎదగే అవకాశం శ్రీదేవికి రాలేదు. శాంతి సంగతి పక్కన పెడితే, ఈ పరిస్థితులన్నీ ఆమె అంతఃసౌందర్యాన్ని దెబ్బతీశాయి. దాంతో ఆమె తనలోకి తాను చూసుకోవడం మొదలు పెట్టింది.

ఎంతోమందికి ఆమె ఒక అందాలరాశి. కానీ, తను మంచి అందగత్తెనని ఎప్పుడైనా అనుకుందా? అవుననే చెప్పాలి. కానీ, ప్రతి తారకీ దిగులు పుట్టించే విషయం వయసు మీద పడడం. దీనికి శ్రీదేవి అతీతురాలు కాదు. దాని ఫలితంగానే తరచూ కాస్మటిక్ సర్జరీలు చేయించుకోవడం. వాటి ఎఫెక్ట్ మనకి క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది.

ఎప్పుడూ ఆవిడ మితభాషిగానూ, రిజర్వ్‌డ్ పర్సన్ గానూ కనిపించేది. కారణం, ఆమె మనసు లోతుల్ని ఎవరైనా చూస్తారనే భయం. ఆమె చుట్టూ ఒక కనిపించని గోడ కట్టుకుంది. ఆమె భయాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడింది.

చిన్నప్పటినుండీ కీర్తి కోసం తపించడం, దాని వెనకే పరుగు..ఆవిడకి స్వేచ్ఛగా జీవించే అవకాశం ఇవ్వలేదు. ఆమె ఆమెలా ఉండే అవకాశమే రాలేదు. కెమేరా ముందు మేకప్ తో ఉండడమే కాకుండా మానసికంగా కూడా ఎప్పుడూ మేకప్ వేసుకునే ఉండేది.

తన జీవితం ఎప్పుడూ తన తల్లిదండ్రుల కోరిక తీర్చడం, బంధువులకు సహాయం, తన భర్తకు అండగా నిలబడడం, బిడ్డల పెంపకం... వీటిచుట్టూనే తిరిగింది. మిగతా తారల్లాగే, తన పిల్లలు సినీరంగంలో నిలదొక్కుకోగలరా లేదా అని ఆవిడకి బెంగగా ఉండేది.

నిజానికి, శ్రీదేవి, ఒక స్త్రీ శరీరంలో ఎదగకుండా ఉండిపోయిన పసిపాప. ఆవిడ చాల అమాయకురాలు. కానీ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, అన్నిటినీ అనుమానిస్తూ ఉండేలా చేశాయి. ఆవిడ మరణం గురించి వస్తున్న రకరకాల ఊహలను పక్కనబెడితే, నేను సాధారణంగా ఎవరినీ ‘రెస్ట్ ఇన్ పీస్’ అనను. కానీ శ్రీదేవి విషయంలో మనస్ఫూర్తిగా ‘రెస్ట్ ఇన్ పీస్’ అనాలని ఉంది. నిజానికి, ఇప్పుడే, చనిపోయాకే ఆవిడకు శాంతి దక్కింది.

నేను దగ్గరగా చూసిన విషయం ఏమిటంటే, శ్రీదేవి కెమెరా ముందు యాక్షన్, కట్‌ల మధ్యలో మాత్రమే ప్రశాంతంగా ఉండేది. అక్కడ మాత్రమే తన దుర్భరమైన జీవితం నుంచి తప్పుకుని ఫ్యాంటసీ‌లోకి అడుగుపెట్టేది.

అందుకే, ఇప్పుడు నిజంగా ఆవిడ శాంతిని పొందింది. ఇప్పుడు ఏ రకమైన నొప్పి, బాధ లేదు. తన జీవితం మొత్తం కొరవడిన ప్రశాంతత ఆవిడకు ఇప్పుడు లభించింది.

RIP శ్రీదేవి, కానీ నిన్ను ఇంత దుఃఖంలోకి నెట్టిన ఈ ప్రపంచం మాత్రం ప్రశాంతంగా ఉండలేదు.

నువ్వు స్క్రీన్ పై కనిపించి మాకెంతో ఆనందాన్ని ఇచ్చావు. కానీ, నీ అభిమానులమైన మేము, నీ బంధువులు అందరూ నీకు దుఃఖాన్నే ఇచ్చాం. ఇది న్యాయం కాదు. కానీ, దీన్ని సరిచేసుకునే అవకాశం మాకిక లేదు.

రెక్కలు విదిలించుకుని, హాయిగా మెరుస్తున్న కళ్ళతో, పచ్చికబయళ్ల మీదుగా ఆకాశంలోకి విహరించే పక్షి లాగా.. అక్కడ, దూరంగా నువ్వు కనిపిస్తున్నావు.

పునర్జన్మ గురించి నాకు నమ్మకాలు లేవు. కానీ నీ అభిమానులం నిన్ను మళ్ళీ చూడాలనుకుంటున్నాం. నువ్వు మళ్ళీ పుడితే, ఈసారి మేము నిన్ను ఇంత బాధపెట్టము. నువ్వు మాపై కురిపించిన దయకి మేము పాత్రులమయ్యేలా మెసలుకుంటాం.

నిన్ను ఎంతో ప్రేమిస్తున్న మాకు మరొక్క ఛాన్స్ ఇవ్వవూ!!

ఇలా ఎంతైనా రాయగలను అనుకున్నాను... కానీ ఈ దుఃఖం ఆపడం ఎలా?! తెలియట్లేదు!

ఇవి చదివారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)