వీళ్లకు స్పీడ్ డేటింగ్ పట్ల ఎందుకింత ఆసక్తి?

  • 2 మార్చి 2018
యువతీ యువకులు Image copyright Getty Images

''నేను స్పీడ్ డేటింగ్‌కు వెళ్లాను. అదో స్వయంవరంలా అనిపించింది. అక్కడ నా ఎదురుగా పది మంది అబ్బాయిలున్నారు. వారిలో మెరుగైన అబ్బాయి కోసం నా కళ్లు వెతికాయి''..

29 ఏళ్ల శృతి ఈ విషయం చెబుతూ నవ్వారు.

స్పీడ్ డేటింగ్ కార్యక్రమంలో చేరడానికి వెళ్లిన సమయంలో ఆమెకు ఎదురైన అనుభవం అది. ఆ వివరాల్ని ఆమె బీబీసీతో పంచుకున్నారు.

స్పీడ్ డేటింగ్‌ను ఆధునిక స్వయంవరం అని అభివర్ణించవచ్చు. అయితే ఒక తేడా.. ఈ స్వయంవరంలో స్త్రీ పురుషులిద్దరికీ తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో సమాన స్వేచ్ఛ ఉంటుంది.

ఎవరైనా సరే తమకు కావాల్సిన భాగస్వామి లేదా స్నేహితులను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. వారి నిర్ణయంపై ఎవ్వరి ఒత్తిడీ ఉండదు.

స్పీడ్ డేటింగ్ ద్వారా పరిచయమైన ఓ అబ్బాయితో శృతి ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు.

Image copyright Getty Images

స్పీడ్ డేటింగ్ అంటే ఏమిటి?

'స్పీడ్ డేటింగ్' అన్నది పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఓ ధోరణి. ప్రస్తుతం ఈ తరహా డేటింగ్ భారత్‌తో పాటుగా చాలా దేశాల్లో నడుస్తోంది.

పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు స్పీడ్ డేటింగ్ కార్యక్రమంలో కలుస్తారు. ఉదాహరణకు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు ఒక చోట కలిస్తే, వారిలో ప్రతి అమ్మాయికీ ప్రతి అబ్బాయినీ విడివిడిగా కలిసే అవకాశం ఉంటుంది.

అయితే, ఒక వ్యక్తితో కలిసి మాట్లాడ్డానికి 8 నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు. ఆ సమయంలో ఇద్దరి అభిరుచులూ, ఇష్టాఇష్టాలూ, నేపథ్యాలను పరస్పరం చెప్పుకుంటారు.

ఒక వ్యక్తితో 8 నిమిషాలంటే.. పది మందితో మాట్లాడ్డానికి 80 నిమిషాల సమయం పడుతుంది. ఈ నిడివిలో వీళ్లు తమ భవిష్యత్ భాగస్వాములను కలుసుకోవచ్చు.

ఈ 8 నిమిషాల సమయంలో మాట్లాడిన వారిలో ఎవ్వరినైనా మళ్లీ కలుసుకోవాలా లేదా అన్నది వాళ్లిష్టం.

Image copyright Getty Images

'స్పీడ్ డేటింగ్‌తో ప్రయోజనాలు'

ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మళ్లీ కలవాలని భావిస్తే వారి స్నేహం కొనసాగుతుంది.

ప్రేమ, డేటింగ్ కోసం మాత్రమే కాదు, స్నేహం కోసం, సరదాగా మాట్లాడటం కోసం కూడా చాలా మంది స్పీడ్ డేటింగ్‌ను సంప్రదిస్తున్నారు.

'లైఫ్ ఆఫ్ లైన్' అనే సంస్థ స్పీడ్ డేటింగ్ కార్యక్రమాలను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తోంది. 2016 నుంచి ఈ సంస్థ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టింది.

''స్పీడ్ డేటింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు మొదట మా వెబ్‌సైట్‌లో వారి వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మేం వారిని సంప్రదిస్తాం'' అని లైఫ్ ఆఫ్ లైన్ నిర్వాహకుల్లో ఒకరైన ప్రతీక్ బీబీసీకి తెలిపారు.

Image copyright Getty Images

"ఉద్యోగాలు చేస్తూ, తీరిక లేకుండా జీవనం గడుపుతున్న 20-40 మధ్య వయసు వారు మా దగ్గరకు వస్తున్నారు. ఈ విధానం ద్వారా వారికి కొత్తవారితో పరిచయం అయ్యే అవకాశం కలుగుతుంది" అని ప్రతీక్ అన్నారు.

సభ్యుల అనుమతి లేనిదే డేటింగ్ కంపెనీలు వారి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయవు.

స్పీడ్ డేట్.కామ్, క్వాక్-క్వాక్.కామ్ లాంటి వెబ్‌సైట్లు స్పీడ్ డేటింగ్‌ను నిర్వహిస్తున్నాయి.

స్పీడ్ డేటింగ్ కంపెనీలు మ్యారేజ్ బ్యూరోల్లాగ వ్యవహరించవు. అయితే ఈ సైట్ల ద్వారా పరిచయమైనవారు పెళ్లి చేసుకున్న సంధర్భాలూ ఉన్నాయి.

గీతాంజలి సక్సేనా సామాజిక సంబంధాల నిపుణులుగా పని చేస్తున్నారు. ఎక్కువ మంది యువతీ యువకులు ఈమెను సంప్రదిస్తారు.

''ఇప్పటి సమాజంలో స్పీడ్ డేటింగ్ వల్ల నష్టమేమీ లేదని నా అభిప్రాయం. మొదటి చూపులో ప్రేమలో పడటం కంటే, ఓ వ్యక్తి గురించి తెలుసుకుని అడుగు వేయడమే మంచిది'' అని గీతాంజలి అన్నారు.

Image copyright Getty Images

గౌరవ్ వైద్య దిల్లీలో ఐటీ ఉద్యోగి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన మిత్రుడి సలహా మేరకు గౌరవ్ స్పీడ్ డేటింగ్‌ను సంప్రదించారు.

''మొదట్లో నాకది ఆటలా అనిపించింది. నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. 8 నిమిషాలయ్యాక ఒక విజిల్ వేశారు. నన్ను వేరొక టేబుల్ వద్దకు వెళ్లమని, అక్కడున్న అమ్మాయితో మాట్లాడాలని చెప్పారు.''

తక్కువ సమయంలో ఎక్కువ మంది అమ్మాయిలతో మాట్లాడటమే స్పీడ్ డేటింగ్ ప్రత్యేకత అని గౌరవ్ భావించారు.

గౌరవ్ బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రస్తుతం నేను ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. వీరిలో ఒకరు నా భాగస్వామి అవుతారని ఆశిస్తున్నా'' అని అన్నారు.

'మొదట మీకేం కావాలో తెలుసుకోండి'

స్పీడ్ డేటింగ్‌లో ఎవరికైనా తగిన భాగస్వామి తప్పక దొరుకుందనే గ్యారంటీ ఏమీ లేదు.

''స్పీడ్ డేటింగ్‌లో ఉన్నపుడు మీరెలాంటి వ్యక్తి కోసం చూస్తున్నారో స్పష్టత ఉండాలి. లేదంటే, ఎక్కువ మందిని కలిసినపుడు మీరు అయోమయంలోపడే అవకాశం ఉంది'' అని గీతాంజలి సక్సేనా అన్నారు.

"ఓ వ్యక్తి అందం, నవ్వు మనల్ని ఆకర్షించవచ్చు. కానీ ఆ వ్యక్తిలో మీరు కోరుకునే లక్షణాలు ఉండకపోవచ్చు కదా!" అని గీతాంజలి అన్నారు హెచ్చరికగా.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు