ప్రెస్‌రివ్యూ: 'ఏపీకి కేంద్ర సాయం.. అంతా మాయ'

  • 2 మార్చి 2018
Image copyright PAVAN PRO

జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో ఏర్పడిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) తన నివేదికను సిద్ధం చేసిందనీ, శనివారం దీనిని ప్రజల ముందు ఉంచనుందని 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్ర విభజన తర్వాత కష్టాలతో ప్రయాణం మొదలుపెట్టిన నవ్యాంధ్రకు కేంద్రం ప్రత్యేకంగా అందించిన చేయూత ఏమీలేదని జేఎఫ్‌సీ తేల్చినట్లు తెలిసింది.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటన, చివరికి హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో సాయం చేస్తామని కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చిన మాట... ఇవేవీ సక్రమంగా అమలు కాలేదని నిర్ధారించినట్లు సమాచారం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలపై కమిటీ సభ్యులైన కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ లోతైన విశ్లేషణ చేశారు.

కేంద్రం చేస్తున్న వాదనలు, రాష్ట్రం ఇచ్చిన లెక్కలను జేఎఫ్‌సీ సభ్యులు పరిశీలించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పేరావారీగా చూశారు.

ఏ పేరా కింద ఏ అంశాలు ప్రస్తావించారు, వాటి అమలుకు ఇప్పటిదాకా ఏం చేశారు అనే లెక్కలు చూసి... ఆయా పద్దుల కింద ప్రత్యేకంగా ఎలాంటి సహాయం చేయలేదని తేల్చినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright TELANGANAPOLICE/FACEBOOK

55 మంది 'తండ్రుల'కు జైలు

అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా భావించే మైనర్‌ డ్రైవింగ్‌పై నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు నెల రోజులుగా స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నారని 'సాక్షి' పేర్కొంది.

ఎవరైనా చిక్కితే జరిమానాతో సరిపెట్టడం లేదు. వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రైవర్లుగా ఉన్న మైనర్లు, వీరికి వాహనాలిచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు.

ఇలా గత నెల రోజుల కాలంలో 1,079 చార్జిషీట్లు దాఖలు చేయగా... మొత్తం 55 మంది తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజులు జైలు శిక్ష పడింది. గురువారం ఒక్కరోజే నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కె.అల్తాఫ్‌ హుస్సేన్‌ 10 మందికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష విధించారు.

బుధవారం టోలిచౌకి పరిధికి చెందిన ఓ మైనర్‌కు ఒక రోజు శిక్ష పడటంతో జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.

గత కొన్నాళ్లుగా వాహనం ఇచ్చిన నేరంపై తండ్రులకు ఒకటి నుంచి రెండు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నా... ఇలా మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో బాలుడిని జువెనైల్‌ హోమ్‌కు తరలించడం ఇదే తొలిసారి అని డీసీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారని సాక్షి వెల్లడించింది.

Image copyright AndhraPradeshCM/facebook

'తెలంగాణలో ఒంటరి పోటీకి సిద్ధం'

తెలంగాణలో ఒంటరిగా బరిలో దిగేందుకు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉండాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారని 'ఈనాడు' పేర్కొంది.

ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందనేది అప్రస్తుతమని, ఎన్నికల సమయానికి పొత్తులపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నామన్న భావనతో బరిలోకి దిగేందుకు అవసరమైన శక్తియుక్తులను కూడగట్టుకొని పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు.

2019 నాటికి ఎవరిపై ఆధారపడకుండా రాష్ట్రంలో తెదేపా నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలన్నారు. మే 28న లక్ష మందితో జరిగే తెదేపా మహానాడు కార్యక్రమం నాటికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

అవసరమైతే జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లోనూ పాల్గొంటానన్నారు. గురువారమిక్కడ తన నివాసంలో తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నాయకులు బక్కని నర్సింహులు, పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్‌, జి.బుచ్చిలింగంతో సమావేశమయ్యారు.

తెలంగాణలో 22 శాతం ఉన్న తెదేపా ఓటు బ్యాంకును 30 శాతానికి పెంచాలని చంద్రబాబు తెలిపారు. పార్టీ పదవుల్లోని నాయకులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని, ఈనెల 29 వరకు పల్లెపల్లెకు తెదేపా కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారని 'ఈనాడు' తెలిపింది.

సంధ్య థియేటర్ Image copyright SANDYA 70MM/FACEBOOK

నేటి నుంచి థియేటర్లు బంద్‌

సినిమా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా 5 రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమా థియేటర్లను బంద్‌ చేస్తున్నట్టు దక్షిణాది సినీ నిర్మాతల మండలి ప్రకటించిందని 'సాక్షి' పేర్కొంది.

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌వో సంస్థలు) వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌)ను తగ్గించాలని డిమాండ్‌ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జేఏసీ చైర్మన్‌ డి.సురేశ్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు.

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ''డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు (క్యూబ్, యూ ఎఫ్‌వో సంస్థలు) ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌)ను తీసేయాల్సి ఉంది. అమెరికాలో పూర్తిగా తీసేశారు.

మన దేశంలో ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ఉత్తరాదిలో కొన్ని చోట్ల ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువగా.. దక్షిణాదిలో ఎక్కువగా రేటు వసూలు చేస్తున్నారు. అసలు దక్షిణాదిలో ఈ ఫీజును పూర్తిగా తీసేయాలి..''అని సురేశ్‌ బాబు డిమాండ్‌ చేశారు.

మార్కెట్‌లో 90% క్యూబ్, యూఎఫ్‌వోల వాటా ఉందని, మిగతా 10% పీఎక్స్‌డీ, రాక్స్, అల్ట్రా, ప్రొవిజ్‌ వంటి సంస్థల చేతిలో ఉందని తెలి పారు. రేట్లు తగ్గించడం సహా పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని.. చర్చలు ఫలిస్తే సినిమాల ప్రదర్శన యథావిధి గా ఉంటుందని చెప్పారని 'సాక్షి' వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)