‘హోలీ అయితే మాత్రం.. మా మీద జబర్దస్తీ చేస్తారా?’

  • సింధువాసిని
  • బీబీసీ ప్రతినిధి
హోలీ, విద్యార్థినులు

దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ(ఎల్‌ఎస్‌ఆర్)లో చదువుతున్న అవిధ చాలా ఆగ్రహంతో ఉంది. హోలీ వేడుకల పేరిట ఎవరో తనపై వీర్యంతో నిండిన బెలూన్లు విసిరారని ఆమె ఆరోపించింది.

''సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నేను మార్కెట్‌కు వెళుతుండగా, రిక్షా మీద కూర్చున్న వ్యక్తి ఆ బెలూన్‌ను నా మీద విసిరేశాడు'' అని అవిధ తెలిపింది.

అవిధ పరిగెత్తుకుంటూ రూమ్‌కు వెళ్లి చూడగా తన టీ షర్ట్ మీద దుర్గంధం వెదజల్లుతున్న వీర్యంలాంటి ద్రవం కనిపించింది.

దాంతో ఆమె ఆ టీషర్ట్‌ను విసిరిపారేసింది. తనపై వీర్యం పడిందన్న భావనే ఆమెలో అసహ్యం, జుగుప్స కలిగించింది.

''అది వీర్యమే అని నీకెలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. అది వీర్యమే అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది వీర్యమా, కాదా అనేది కాదు ప్రశ్న. ఎవరైనా నా మీద అలా ఎలా విసిరేయగలరు?'' అని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించింది.

''ఎవరైనా నా ఇష్టం లేకుండా నా మీద నీళ్లైనా ఎలా పోయగలరు? ఎవరో ఓ అపరిచిత వ్యక్తి ఆఫీసుకు వెళుతూ నా మీద నీళ్లు పోసేయడమేనా? ఆ హక్కు అతనికి ఎవరు ఇచ్చారు?''

అవిధ ఇలా శరపరంపర సంధించారు. వాటికి సమాధానాలు ఇవ్వడం కష్టం.

''మన దేశంలో హోలీ పేరిట ఆడవాళ్లపై ఇలాంటి అల్లరిచిల్లరి పనులు చేయడం సర్వసాధారణంగా మారింది. నేను కోల్‌కత్తా నుంచి వచ్చాను. అక్కడ కూడా ఇలాంటివి జరుగుతాయి. కానీ దిల్లీలో యువకులు మరీ శృతి మించుతున్నారు'' అని అవిధ అంది.

హోలీ, విద్యార్థినులు
ఫొటో క్యాప్షన్,

విద్యార్థినుల నిరసన ప్రదర్శన

'చెడుగా అనుకోకండి, ఇది చిన్నపిల్లల ఆట'

చాలాసార్లు హోలీ సందర్భంగా అపరిచితులపై రంగులు చల్లడాన్ని ఈ విధంగా సమర్థించుకుంటారు. హోలీ పేరు చెప్పి ఎవరు, ఏమైనా చేయొచ్చు. కానీ అవతలి వాళ్లు మాత్రం ఏమీ అనుకోకూడదు.

అవిధ కాలేజీకే చెందిన మరో విద్యార్థిని కూడా దిల్లీలోని అమర్ కాలనీలో తనకు జరిగిన ఓ సంఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది.

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందిన తోలినో చిషీ తనపై కూడా ఇలా వీర్యంతో నిండిన బెలూన్లు విసిరేశారని తెలిపింది.

ఆమె పోస్టుపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. చాలా మంది ఆ యువతిపై జరిగిన సంఘటనను ఖండిస్తే కొంతమంది దీనిని హిందూ సంప్రదాయాలపై చెడుముద్ర వేసే ప్రయత్నంగా అభివర్ణించారు.

హోలీ, విద్యార్థినులు

'హోలీ ఇష్టమే, కానీ ఇలా కాదు'

దిల్లీ యూనివర్సిటీలోని కమలా నెహ్రూ కాలేజీలో చదువుతున్న జోయా, ''నాకు హోలీ అంటే చాలా ఇష్టం. కానీ దాని అర్థం హోలీ పేరిట ఎవరైనా ఏదైనా చేయొచ్చని కాదు'' అంది.

మల్లిక అనే మరో విద్యార్థిని, ''నేను చిన్నప్పుడు స్కూలుకు వెళ్లేప్పుడు హోలీ రోజు కొంత మంది మగపిల్లలు మా ఇంట్లో ప్రవేశించి, నా మొహం మీద బలవంతంగా రంగు పులిమి వెళ్లారు.''

ఆ సంఘటనను తానింకా మరవలేదని ఆమె తెలిపింది. ఆ విషయం గుర్తుకు వస్తేనే ఆమె మొహం కోపంతో ఎర్రబారింది.

ఎల్‌ఎస్‌ఆర్‌కు చెందిన గుర్మెహర్ కౌర్, ''కాలేజి నుంచి ఇంటికి వెళ్లేవరకు మా దుస్తులు మరకలు లేకుండా ఉండాలని కోరుకోవడమే తప్పా?'' అని ప్రశ్నించింది.

హోలీ వస్తే చాలు.. ప్రతి బాలిక, యువతి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుంటారనేది ఆమె భావన.

హోలీ, విద్యార్థినులు

'మగాళ్లే కాదు, ఆడాళ్లు కూడా..'

కేవలం బాలురు, యువకులే కాదు, మహిళలు కూడా దీనిలో భాగస్వాములే అన్నది శాలు మిశ్రా అభిప్రాయం.

''ఓ 20-22 ఏళ్ల యువతి బెలూన్‌తో నా ఫ్రెండ్‌ను కొట్టింది. అందువల్ల ఇది కేవలం మగాళ్లకే పరిమితమైంది కాదు. అందరికీ ఇలా రంగులతో కొట్టుకోవడం ఇష్టం ఉండదని ప్రజలు అర్థం చేసుకోవాలి'' అని మిశ్రా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)