మహాత్మా గాంధీ: ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’

గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఏసుక్రీస్తు గురించి మహాత్మాగాంధీ రాసిన ఒక లేఖను అమెరికాలో వేలం వేయనున్నారు.

1926 ఏప్రిల్ 6వ తేదీన.. అప్పట్లో అమెరికాలో మత పెద్ద అయిన మిల్టన్ న్యూబెర్రీ ఫ్రాంజ్‌కు గాంధీ ఈ లేఖను రాశారు.

ఏసుక్రీస్తు ‘‘మానవ చరిత్రలో గొప్ప బోధకుల్లో ఒకరు’’ అని గాంధీ సంబోధించారు.

దశాబ్దాల పాటు ప్రైవేటు కలెక్షన్స్‌లో ఉన్న ఈ లేఖను పెన్సిల్వేనియాకు చెందిన రాబ్ కలెక్షన్స్ 50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టింది.

‘‘మిత్రమా, నీ ఉత్తరం అందింది. నీవు పంపించిన (మత) సిద్ధాంతాలను అంగీకరించటం నాకు సాధ్యం కాదు. కంటితో చూడలేని సత్యాలకు అత్యున్నత రూపం, పరమ సత్యం ఏసుక్రీస్తే అన్న నీ మాటతో ఏకీభవించలేకపోతున్నాను’’ అని ఈ లేఖలో గాంధీ రాశారు.

ఫొటో సోర్స్, Raab Collection

ఫొటో క్యాప్షన్,

ఏసుక్రీస్తు ''మానవ చరిత్రలో గొప్ప బోధకుల్లో ఒకరు'' అని గాంధీ సంబోధించారు

‘‘మానవజాతి చరిత్రలోని గొప్ప బోధకుల్లో ఏసుక్రీస్తు ఒకరు అన్నదే నా నమ్మకం. అందరూ ఏదో ఒక మత విశ్వాసాన్ని యాంత్రికంగా అంగీకరించటం ద్వారా మతపరమైన ఐక్యత సాధ్యం కాదని, పరస్పర మత విశ్వాసాలను గౌరవించటం ద్వారానే ఐక్యత సాధ్యమవుతుందన్నది మీకు తెలియనిదా?’’ అని పేర్కొన్నారు.

అలాగే.. ‘‘మీరు పంపించిన స్టాంపును కూడా నేను తిప్పి పంపిస్తున్నాను. దాన్ని భారతదేశంలో వినియోగించటం సాధ్యపడదు’’ అని కూడా గాంధీ ఈ లేఖలో తెలిపారు.

‘‘మా పరిశోధన ప్రకారం.. ఏసుక్రీస్తును ఉద్దేశిస్తూ గాంధీ రాసిన, పబ్లిక్ మార్కెట్‌కు అందుబాటులోకి వచ్చిన లేఖ మరేదీ లేదు’’ అని రాబ్ కలెక్షన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)