ప్రెస్ రివ్యూ: యూనివర్సిటీల్లో రిజర్వేషన్లకు కోత!

  • 3 మార్చి 2018
Image copyright Thinkstock

దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకానికి సంబంధించి రిజర్వేషన్ల అమలులో కీలక మార్పులకు రంగం సిద్ధమైందని ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం యూనివర్శిటీల వారీగా రిజర్వేషన్లు ఉండగా వీటికి బదులు శాఖల్లోని పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్‌ అమలుకు యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సిద్ధమవుతున్నట్లు సమాచారంగా ఈ కథనం తెలిపింది.

‘సాక్షి’ పత్రిక కథనం ప్రకారం.. కొత్త రిజర్వేషన్‌ విధానంలో యూనివర్శిటీకి బదులుగా ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. దీంతో కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం కోసం యూజీసీ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఓకే చెప్పిందని, త్వరలో నోటిఫికేషన్‌రానుందని సమాచారం.

అలహాబాద్‌ హైకోర్టులో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకం కేసు విచారణ సందర్భంగా గత ఏప్రిల్‌లో ఈ అంశం తెరపైకి వచ్చింది. మొత్తం యూనివర్శిటీని ప్రాతిపదికగా తీసుకోకుండా.. ఒక్కో విభాగాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లతో ముడిపడిన పది కేసుల్లో కోర్టు తీర్పుల్ని అధ్యయనం చేసిన అనంతరం.. అలహాబాద్‌ కోర్టు తీర్పును అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తింపచేయవచ్చని యూజీసీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక సమర్పించింది.

ప్రస్తుతం యూనివర్శిటీల వారిగా రిజర్వేషన్‌ వర్గాలకు అధ్యాపక పోస్టుల్ని నిర్ణయిస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒకే గ్రేడ్‌ పోస్టుల్ని(ఉదా: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) లెక్కించి రిజర్వేషన్‌ కోటాను అమలు చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఒక శాఖలో ఒకే గ్రేడ్‌కు చెందిన మొత్తం పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఆ శాఖలో ఒకే ప్రొఫెసర్‌ పోస్టుంటే రిజర్వేషన్‌ అమలుకాదు. అలా కాకుండా యూనివర్సిటీలోని అన్ని శాఖల పోస్టుల్ని కలిపి రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కొన్ని పోస్టులు దక్కుతాయి.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి ఉన్నత విద్య బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 2016 ప్రభుత్వ నివేదిక ప్రకారం.. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కలిపి ప్రతి వంద మంది టీచర్లలో ఏడుగురు మాత్రమే అణగారిన వర్గాల వారున్నారు. మొత్తం 716 యూనివర్శిటీలు, 38,056 కాలేజీల్లోని 14.1 లక్షల టీచర్లలో ఎస్సీలు 1.02 లక్షలు(7.22 శాతం), ఎస్టీలు 30 వేల(2.12 శాతం) మంది ఉన్నారు. గత ఏప్రిల్‌ వరకూ 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని 17,106 టీచింగ్‌ పోస్టుల్లో 5,997 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Image copyright ys jagan mohan reddy/Facebook

మోదీ సర్కారుపై 21న వైసీపీ అవిశ్వాసం?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ దాదాపు నిర్ణయానికి వచ్చిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది. అయితే అది బీజేపీకి ఏ రకంగానూ ఇబ్బందులు తెచ్చేదిగా ఉండకూడదని తలపోస్తోందని, అందుకే ఈ నెల 21న ప్రవేశపెట్టాలని భావిస్తోందని ఆ ‘కథనం’ చెప్తోంది.

‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న తమ అధినేత జగన్‌తో ఆ పార్టీ ముఖ్యులు, ఎంపీలు శనివారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే తమ అవిశ్వాసం వల్ల బీజేపీ ఇరుకునపడకూడదని జగన్‌ గట్టిగా భావిస్తున్నారు.

నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ వైసీపీకి ఐదుగురు సభ్యులే ఉన్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి సమయం తీసుకొని మార్చి 21న పెట్టాలని వైసీపీ అనుకుంటోంది. లోక్‌సభ 198వ నిబంధనను అనుసరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన ప్రకారం 50 మంది ఎంపీలు దానికి మద్దతిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అంగీకరిస్తారు.

అయితే దీనికి వెంటనే సమయం కేటాయించరు. నిబంధనల మేరకు తీర్మానాన్ని అంగీకరించిన 10 పని దినాల్లో ఎప్పుడైనా స్పీకర్‌ చర్చకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 6న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. వైసీపీ మార్చి 21న తీర్మానం పెడితే సరిగ్గా 10వ పనిదినాన సభ ముగుస్తుంది.

ఆర్థిక పద్దులపై చర్చించడంతో పాటు ట్రిపుల్‌ తలాక్‌, ఆర్థిక నేరాల బిల్లు, బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లు వంటి కీలక బిల్లులపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో మార్చి 21 తర్వాత సమయాభావం వల్ల అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించకపోవచ్చు. ఈ లెక్కలన్నీ ముందే వేసుకుని అవిశ్వాస తీర్మానం 21న పెట్టాలని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Image copyright NAra chanrdrababu naidu/Facebook

తెగతెంపులపై సరైన సమయంలో నిర్ణయం: చంద్రబాబు

విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలపై కేంద్రం నుంచి సానుకూల స్పందనేదీ రానందున ఇక భాజపాతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని ఎక్కువ మంది తెదేపా ఎంపీలు అభిప్రాయపడ్డట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పోరాటం చేయడం కంటే, కేంద్రంలోని తెదేపా మంత్రులతో రాజీనామాలు చేయించడమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఈ కథనం తెలిపింది.

‘ఈనాడు’ ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ నెల ఐదు నుంచి జరగనున్న రెండోవిడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఉండవల్లిలో జరిగింది.

తొలి విడత సమావేశాల్లో మన నిరసన గట్టిగా తెలియజేసినా... ఆ తర్వాత వివిధ మార్గాల్లో ఆందోళన తెలిపినా... కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా భాజపాతో మైత్రిని కొనసాగించడం వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి తెదేపా ఎంపీలు ఆందోళన చేయడం, అదే సమయంలో తాము మంత్రులుగా ఉండటం ఇబ్బందికరంగా ఉందని అశోక్‌గజపతిరాజు పేర్కొన్నారు.

అధినేత ఆదేశిస్తే ఎప్పుడైనా రాజీనామాకు సిద్ధమేనని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు, ఎంపీలందరి అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుసుకున్నారు. ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రుల రాజీనామాలు చేయనవసరం లేదని, ఆ పరిస్థితే వస్తే సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. ఏ నిర్ణయమైనా అది ప్రజాభిప్రాయం, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఉండాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారన్న భావన ప్రజల్లో కలగరాదని సీఎం పేర్కొన్నారు.

ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రులు రాజీనామా చేసేస్తే... తెదేపాని మరో ప్రతిపక్షంలానే భాజపా చూస్తుందని, ప్రభుత్వంలో ఉంటూనే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివిధ మార్గాల్లో ఎలుగెత్తి చాటడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒకేసారి అస్త్రాలన్నీ వాడేయకుండా... దశలవారీగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ వెళ్లాలని నిర్ణయించారు.

Image copyright Getty Images

దేశంలో 3.1 కోట్ల మంది నిరుద్యోగులు

మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగిత ఒకటని.. మోడీ సర్కారు వచ్చాక అది మరింతగా పెరుగుతున్నదని అధ్యయనాలు చెబుతున్నట్లు ‘నవతెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. గత కొద్ది నెలల్లో తారస్థాయికి చేరిన ఈ సమస్య గత నెల 25తో ముగిసిన వారాంతానికి 7.1 శాతానికి చేరుకున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైందని ఆ కథనం తెలిపింది.

ఆ అధ్యయనం ప్రకారం ఇప్పుడు దేశంలో దాదాపు 3.1 కోట్లమంది ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్నారని, అక్టోబర్‌ 2016 నాటి స్థాయి కన్నా ఇది అత్యధికమని ‘నవ తెలంగాణ’ కథనం వివరించింది. గత 15-16 నెలల కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ సమస్య గరిష్ట స్థాయికి చేరుకున్నదని ఈ అధ్యయన నివేదికలో ప్రస్తావించింది.

‘నవ తెలంగాణ’ కథనం ప్రకారం.. గత ఏడాది జులైలో దేశంలో కనిష్ట స్థాయిలో వున్న నిరుద్యోగ సమస్య నాటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. గత మూడు వారాల కాలంలో ఈ నిరుద్యోగ సమస్య 7 శాతానికి చేరుకుని కలవరపాటుకు గురి చేస్తోందని ఈ అధ్యయనం నిర్వహించిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ సీఈఓ మహేష్‌ వ్యాస్‌ తెలిపారు.

సమీప భవిష్యత్‌లో సైతం ఉద్యోగావకాశాలు ఆశించిన మేర కన్పించకపోవటంతో యువత భవిష్యత్‌ మసకబారుతోంది. గత నెల చివరి నాటికి అధికారికంగా నమోదయిన 3.1 కోట్ల మంది నిరుద్యోగులకు వచ్చే మే నాటికి తాజాగా పట్టభద్రులైన యువత జతకానున్నారు. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగావకాశాలు కేవలం 6 లక్షలకు మాత్రమే పరిమితమవుతాయన్న అంచనాలు యువతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Image copyright Getty Images

భార్య ఆలస్యంగా నిద్రలేస్తున్నదని విడాకులు కోరిన భర్త!

భార్య ఆలస్యంగా నిద్రలేస్తున్నదని, ఆమెకు వంట సరిగాచేయడం రాదని ఆరోపిస్తూ విడాకుల కోసం భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చినట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనం ప్రకారం.. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతానికి చెందిన పిటిషనర్ తన భార్య విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని పేర్కొన్నాడు. పొద్దున్నే లేవాలని చెప్తే తనను, తన తల్లిదండ్రులను ఆమె తిడుతున్నదని, తనతో చాలాసేపు గడుపడం లేదని, తను పనికి వెళ్లి ఇంటికి వచ్చాక మంచినీళ్లు కూడా ఇవ్వదని ఆరోపించాడు.

భార్య ఆ ఆరోపణలను ఖండించింది. కాగా పిటిషనర్ చేసిన ఆరోపణలు క్రూరత్వం కిందికి రావని, కాబట్టి చట్ట ప్రకారం ఈ కారణాలపై విడాకులు మంజూరు చేయలేమని జస్టిస్‌లు కేకే టాటెడ్, సారంగ్ కొత్వాల్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. లోగడ ఈ మేరకు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

పిటిషనర్ భార్య ఒక కార్మికురాలు. బయట పనులకు వెళ్లి కుటుంబం కోసం నాలుగు డబ్బులు సంపాదిస్తున్నది. అయినా ఇటు ఇంటికి అవసరమైన సరుకులు తనే కొనుక్కొని వచ్చి అత్తమామలకు వంట చేసి పెడుతున్నది. ఇంటిపనులు కూడా చేస్తున్నది. అటువంటిది ఆమె భార్యగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు సరికావని ధర్మాసనం అభిప్రాయపడిందని ‘నమస్తే తెలంగాణ’ కథనం వివరించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)