‘గ్యాస్’ ప్రాబ్లమ్? ఎందుకిలా వదులుతారు? దీన్ని ఆపొచ్చా?

 • 4 మార్చి 2018
గ్యాస్, అపానవాయువు Image copyright Getty Images

అపానవాయువు ఎందుకు వదులుతారు? దాన్ని ఆపడం అసాధ్యమా?

ఈ మధ్య చాలా నవ్వు తెప్పించే విషయం ఒకటి జరిగింది. యూరప్‌లో ఒక విమానాన్ని అత్యవసరంగా కిందకు దించేసారు. దానికి కారణం.. అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అదే పనిగా అపానవాయువు వదులుతూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించడం!

దుబాయ్ నుండి నెదర్లాండ్స్ వెళుతున్న విమానంలో ఆ వ్యక్తి గ్యాస్ వదలడం ఆపుకోలేకపోవడంతో మధ్యలోనే ఆస్ట్రియాలో దించేయాల్సి వచ్చిందట. ఇలా అపానవాయువును ఆపుకోలేకపోవడాన్ని "ఫార్ట్ అటాక్" అంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో నవ్వడం కాకుండా ఆ వ్యక్తిపై సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. ఇదేమీ అతను కావాలని చేసింది కాదు కదా!

అయితే, అపానవాయువుకు కారణాలు ఏమిటి? అది నియంత్రించుకోవడం ఎందుకు కుదరదు?

హెల్త్‌లైన్ ప్రకారం, అపానవాయువు లేదా ఫార్ట్ అనేది ప్రేగులలో ఏర్పడే గ్యాస్‌ను బయటికి వదలడం వల్ల జరుగుతుంది. తత్ఫలితంగా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

Image copyright Getty Images

శరీరంలో గ్యాస్ పెరగడానికి కారణాలేంటి?

 • నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వలన కూడా గ్యాస్ పెరుగుతుంది.
 • చిన్న ప్రేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది.
 • పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. చిన్న ప్రేగుల్లోకి చేరిన ఆహారం మొత్తం జీర్ణం కాకపోవచ్చు. ఇక్కడ జీర్ణం కాని కార్బోహైడ్రేడ్స్ మలద్వారం లేదా కొలోన్‌కు చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియా దీన్ని హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తుంది.
Image copyright Getty Images

కడుపునొప్పి ఎప్పుడు వస్తుంది?

ఇలా తయారయిన గ్యాస్ మొత్తం ఎలాగోలా బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మానవ శరీరం సహజంగా పీల్చేసుకుంటుంది. కానీ, ఈ గ్యాస్‌లో అధిక భాగం మలాశయం పైభాగంలో చేరి కొలోన్ గోడల మీద ఒత్తిడి పెంచుతుంది. దాని వలన కడుపు నొప్పి వస్తుంది.

ఒక్కోసారి ఈ గ్యాస్ ఛాతీలోకి చేరిపోతుంటుంది. తద్వారా ఛాతీ పట్టేసినట్టు ఉండడం, నొప్పి లాంటివి కలుగుతాయి.

ఫార్ట్ లేదా పిత్తడం లేదా అపానవాయువును విడుదల చేయడం అనేది ఇలా చేరిన గ్యాస్‌ను బయటికి పంపే ప్రక్రియ. అయితే, దానిని నియంత్రించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది?

సాధారణంగా అపానవాయువును ఆపుకోకూడదు. ఆపుకుంటే వెంటనే చెడు ఫలితాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ గ్యాస్ ఎలాగోలా బయటికి రావాలి. అది తాత్కాలికంగా ఆగినా, తరువాత ఎప్పుడైనా బయటికి రావాల్సిందే!

రోజంతా మనం గ్యాస్ ఎక్కువగా తయారు చేసే ఆహారపదార్థాలు తింటూ ఉంటే సాయంత్రానికి కడుపుబ్బరం పెరుగుతుంది. ఇది కాకుండా, పేగుల్లో ఉన్న కండరాలు బలహీనమైనప్పుడు కూడా అపానవాయువు ఎక్కువగా వస్తుంటుంది.

Image copyright Getty Images

ఇది దృష్టి పెట్టాల్సిన అంశమేనా?

సాధారణంగా మలవిసర్జన సమయంలో ఈ గ్యాస్ బయటికి వచ్చేస్తుంటుంది. కొందరికి వ్యాయమం చేస్తున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు కూడా బయటికి వస్తుంటుంది. నిజానికి, అపానవాయువు వదలడం అంత చింతించాల్సిన విషయమేం కాదు.

బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ స్కీం (NHS) వెబ్‌సైట్ ప్రకారం, సాధరణంగా ఒక మనిషి రోజుకు 5-15 సార్లు అపానవాయువు వదులుతారు. కొందరిలో మాత్రం ఇది సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, దాన్ని ఆపుకోవడం సాధ్యమేనా?

ఆహార అలవాట్లు మార్చుకోవలసిన అవసరం ఉందా?

అపానవాయువు విడుదల సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం డైట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మీ శరీరానికి లాక్టోజ్ పడకపోతే, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండమని, లాక్టోజ్ సప్లిమెంట్స్ వాడమని డాక్టర్లు సలహా ఇస్తారు. లాక్టోజ్ ఇంటోలరన్స్ వలన కూడా గ్యాస్ అధికంగా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.

కార్బనేటెడ్ పానీయాలు ఎక్కువగా తాగడం వలన కూడా ఈ సమస్య ఎక్కువ కావచ్చు. ఫైబర్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా గ్యాస్ పెరుగుతుంది.

Image copyright Getty Images

అపానవాయువుతో దుర్వాసన ఎక్కువగా ఉన్నట్టనిపిస్తే ఈ కింది సూచనలు పాటించవచ్చు

 • తక్కుగా తక్కువగా తినడం మేలు. బాగా నమిలి తినాలి. మెల్లగా తినాలి. తొందర తొందరగా తింటే శరీరంలోకి ఎక్కువ గాలి జొరబడే అవకాశాలున్నాయి. వ్యాయామం చెయ్యడం కూడా చాలా అవసరం.
 • చూయింగ్‌గమ్ లేదా బబుల్‌గమ్ ఎక్కువగా నమలడం వలన కూడా శరీరలోకి ఎక్కువ గాలి వెళుతుంటుంది. ఇది గ్యాస్ తయారవడానికి కారణమవుతుంది.
 • ఫ్రక్టోజ్, లాక్టోజ్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్, పిండిపదార్థాలు లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు తగ్గించడం మంచిది. వీటివల్ల గ్యాస్ ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంది.
 • సోడా, బీర్ లాంటి కార్బొనేటెడ్ పానీయాలలోని గాలి బుడగలు శరీరంలో చేరి అపానవాయువుగా మారతాయి. వాటికి బదులు మంచినీళ్ళు, టీ, వైన్ తాగడం మంచిది.
 • మనం తినే పదార్థాలన్నీ జీర్ణం అవడానికి కొన్ని బ్యాక్టీరియాలు సహకరిస్తాయి. వీటిల్లో కొన్ని హైడ్రోజన్‌ను తొలగించడానికి ఉపయోగపడతాయి. ప్రోబయోటిక్ ఫుడ్ తినడం వలన ఇలాంటి బ్యాక్టీరియా పెరుగుతుంది.
 • ఎక్కువ సిగరెట్ తాగడం కూడా గ్యాస్ పెరగడానికి ఒక కారణం. ఈ అలవాటు ఉన్నవారికి మలబద్దకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అపానవాయువు పెరిగే అవకాశాలుంటాయి.
Image copyright Getty Images

డాక్టరు దగ్గరకు ఎప్పుడు వెళ్ళాలి?

ఎక్కువగా అపానవాయువు విడుదల అనేది పరిష్కరించలేనంత పెద్ద సమస్యేం కాదు. ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పు చేయడం ద్వారా, కొన్ని మందుల వాడకం ద్వారా దీనిని పరిష్కరించుకోవచ్చు.

ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం మంచిది.

 • కడుపు నొప్పి
 • తల తిరగడం
 • వాంతులు
 • డయేరియా

అపానవాయువును ఎక్కువగా విడుదల చేసే వాళ్ల మీద కోప్పడకుండా, వారి బాధను అర్థం చేసుకునేందుకు ఈ కథనం ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు