త్రిపురలో 25 ఏళ్ల మాణిక్ పాలనకు ఎదురు దెబ్బ ఎలా తగిలింది?

  • కిషాలయ్ భట్టాచార్జీ
  • సీనియర్ జర్నలిస్ట్
బీజేపీ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

త్రిపురలో జరిగిన గత ఎన్నికల్లో బీజేపీ 50 స్థానాల్లో పోటీ చేసింది. అందులో ఒక్క స్థానం మినహా తక్కన 49 స్థానాల్లో కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది. కానీ తాజా ఫలితాల్లో అదే బీజీపీ త్రిపుర పీఠం గెలిచి కమ్యూనిస్టు కంచు కోటను వశం చేసుకుంది.

ఈ పరిణామం.. భారతీయ రాజకీయాల్లో ఓ అసాధారణమైన విషయం అని చెప్పొచ్చు.

వామపక్ష పార్టీకి ఎదురు దెబ్బ?

త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ భారతదేశంలో ప్రఖ్యాత ముఖ్యమంత్రుల్లో ఒకరు. అందరికన్నా పేద ముఖ్యమంత్రి కూడా ఆయనే!

ఇక త్రిపుర విషయానికొస్తే.. మిగులు విద్యుత్ కలిగి, దేశంలో రబ్బరు ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రమది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్‌పీఏ-1958) కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన ఏకైక రాష్ట్రం.

రాష్ట్రంలో చెలరేగుతున్న తిరుగుబాట్లను చక్కదిద్ది 30 పైగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు.. మానవ హక్కుల సూచిలో కూడా త్రిపుర స్థానాన్ని మెరుగుపరిచింది మాణిక్ సర్కార్ ప్రభుత్వం.

ఫొటో సోర్స్, EPA

అయినా పరాజయం ఎందుకు?

కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో బహుశా ఆకర్షణ తగ్గివుండొచ్చు. ఎక్కువ కాలం పరిపాలించిన ఏ పార్టీ అయినా.. అధికారంలో కొనసాగడానికి మళ్లీ ప్రజల వద్దకు వెళ్లక తప్పదు.

త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం 25 సంవత్సరాలు పరిపాలించింది.

ముఖ్యంగా.. ఓటర్ల నాడి తెలుసుకోవడంలో మాణిక్ సర్కార్ విఫలమయ్యారు. ఉపాధి కల్పనలో తన అసమర్థతను ఆయన అంగీకరించారు.

అక్షరాస్యతలో త్రిపుర ముందంజలో ఉంది. అలాంటి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 17 శాతం నిరుద్యోగం ఉంది. రాష్ట్రంలో ఇంకా ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేయలేదు.

రోడ్డు రవాణా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వంలోని వ్యక్తులపై ఆశ్రితపక్షపాతం ఆరోపణలూ ఉన్నాయి.

బెంగాలీ గిరిజనుల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం మీదా మాణిక్ సర్కార్ దృష్టి సారించలేదు.

త్రిపుర కోసమే ప్రత్యేక ప్రణాళిక?

బీజేపీ గత రెండేళ్లుగా కఠోర పరిశ్రమ చేసింది. పాతికేళ్లుగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీని ఢీకొట్టడం సాధారణమైన విషయం కాదని వారికి తెలుసు.

అందుకే.. 50 వేల మంది బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిరంతరం శ్రమించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు.

బీజేపీ త్రిపుర కోసమే ప్రత్యేకంగా ఒక ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. మోర్చా, విస్తారక్, పన్నా ప్రముఖ్, సంపర్క్‌ల రూపంలో ఐదంచెల విధానాన్ని ఏర్పాటుచేసింది.

మోర్చాలను మహిళా మోర్చా, యువ మోర్చా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చా అంటూ మూడు రకాలుగా విభజించారు.

కార్యకర్తల్లో అంతర్గత కుమ్ములాటలు జరగకుండా చూసేందుకు స్థానిక యువకులను విస్తారక్ సేవక్‌లుగా నియమించారు. ఇక పన్నా ప్రముఖ్‌లు.. ఒక్కొక్కరికీ 60 మంది ఓటర్లను కేటాయించారు. వారి అవసరాలు చూసుకోవడం వీరి బాధ్యత.

ఫొటో సోర్స్, Getty Images

సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి అవసరాలను తెలుసుకుని, ఆ సమాచారాన్ని గ్రామస్థాయి వ్యవస్థలకు చేరవేయడం సంపర్క్‌ల బాధ్యత.

మాణిక్ ప్రభుత్వానికి స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పొత్తు పెట్టుకున్న స్థానాల్లో గెలవడం మొదట ఓ సవాలుగా నిలిచింది. గిరిజనులు చాలా కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో గిరిజనుల డిమాండ్‌కు తలొగ్గితే.. నోటికందే పండు నేలరాలినట్టేనని బీజేపీ భావించింది.

అందుకే ఈ విషయంలో ఆ పార్టీ చాకచక్యంతో నడుచుకుంది. బీజేపీ విజయంలో హిందూ ఓటర్ల పాత్ర కూడ ప్రస్తావించతగ్గదే!

మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమికి చెప్పుకోదగ్గ స్థానాలే వచ్చాయి. త్రిపుర విజయం అందర్నీ ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తే.. ఈ రాష్ట్రాల ఫలితాలూ ఆశ్చర్యపరచాయనే చెప్పవచ్చు.

గతంలో నాగాలాండ్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వమున్నా.. ఆ కూటమిలో బీజేపీ పాత్ర చాలా తక్కువ. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చాలా మెరుగైందనే చెప్పవచ్చు. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించినా, దాదాపు అన్ని పార్టీలనూ బీజేపీ.. ఎన్నికల బరిలోకి లాక్కురాగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images

తుపాకులు, డబ్బు, గ్రామ కౌన్సిళ్లు ప్రభుత్వాన్ని శాసించే రాష్ట్రంలో బీజేపీ భావజాలం విజయం సాధించిందనే చెప్పొచ్చు.

నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ మిత్ర వర్గంలోని వ్యక్తి నీఫు రియో తన ప్రత్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్లే రోడ్లను మూసేసి, అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి.

మేఘాలయలో గోవధ నిషేధం బీజేపీకి కలిసిరాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా, అసలు విషయం వేరే ఉంది. బొగ్గు గనులు, సున్నపురాయి మైనింగ్‌పై నిషేధం విధించడం గోవధ నిషేధం కంటే బీజేపీపై ఎక్కువ ప్రభావం చూపింది.

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

ఈ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందా?

ఈశాన్య రాష్టాల్లో ఎంపీ స్థానాలు చాలా తక్కువ ఉంటాయని, దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉండదని కొందరు భావిస్తున్నారు.

రానున్న రెండు నెలల్లో కర్ణాటకలో ఎన్నికల నగరా మోగనుంది. ఆ తర్వాత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలూ మోదీ మ్యాజిక్‌కు మరో పరీక్షే.

ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. తాజా విజయం రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడొచ్చు.

కానీ కాంగ్రెస్ పార్టీని కొల్లగొట్టడానికి మాత్రం.. ప్రతి సీటు కోసమూ శ్రమించక తప్పదు.

'కాంగ్రెస్ రహిత భారత్' అన్న తమ అజెండా సాధనకు బీజేపీ ఎక్కువ దూరంలో లేనట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)