బీజేపీ రామ్ మాధవ్: ‘రచ్చ గెలిచారు.. ఇంట గెలిచేనా?’

  • 3 మార్చి 2018
రాం మాధవ్ Image copyright RAM MADHAV/FACEBOOK

25 ఏళ్లుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈశాన్య భారత్‌లో ఒక్క అసోంలో తప్ప మరెక్కడా బీజేపీ ఉనికి పెద్దగా లేదు.

కానీ, ఇప్పుడు త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ పట్టు సాధించింది. త్రిపురలో బీజేపీ గెలుపు తర్వాత ఆ పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు ఎక్కువగా రామ్‌ మాధవ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు.

పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, రాజ్‌దీప్ సర్దేశాయ్ తదితరులు త్రిపురలో బీజేపీ విజయం తర్వాత శుభాకాంక్షలు తెలిపింది రామ్‌ మాధవ్‌.

అమలాపురం నుంచి అగర్తల వరకు

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందిన 53 ఏళ్ల రాం మాధవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ స్థాయినేతల్లో కీలక వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీకి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల బాధ్యతను కూడా చూస్తున్నారు.

అందుకే త్రిపురలో బీజేపీ గెలుపు తర్వాత అందరూ ఆయననే ప్రశంస్తూ ట్వీట్ చేశారు.

త్రిపుర ఎన్నికల నేపథ్యంలో రామ్‌ మాధవ్‌ బీబీసీతో మాట్లాడుతూ.. "కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ప్రభావితమైన ప్రాంతాలలో మేం చాలా కష్టపడి మా ఉనికిని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాష్ట్రాలలో బీజేపీకి అసలు ఉనికి లేదు. కానీ మేం రాజకీయ పావులు కదిపి విజయం సాధించా"మని తెలిపారు.

ఆర్ఎస్ఎస్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామ్‌ మాధవ్‌ మాటతీరు, వ్యవహర శైలిలో మాత్రం ఆ సంస్థ భావజాలం ఎక్కువ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తుంది.

ఎన్నికల వేళ ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది.

''నాగాలాండ్‌లో 97 శాతం ప్రజలు క్రిస్టియన్లే అయితే అక్కడ కూడా మేం ప్రభుత్వంలో భాగస్వామ్యులం. మతాలకు అతీతంగా అందరి వికాసాన్ని బీజేపీ కోరుకుంటుంది'' అని రామ్‌ మాధవ్‌ బీబీసీతో అన్నారు.

Image copyright RAM MADHAV/FACEBOOK

ఇంట గెలుస్తారా?

అయితే, బీజేపీకి సరైన ఆదరణే లేని చోట పార్టీని అధికారంలోకి తెచ్చారని పేరున్న రామ్‌ మాధవ్‌ తన సొంత రాష్ట్రంపై దృష్టి సారిస్తారా..? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

‘‘రామ్‌ మాధవ్‌ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పనిచేయడం సహజమేనని’’ ట్రిబ్యూన్ అసోసియేట్ ఎడిటర్ కేవీ ప్రసాద్ బీబీసీకి చెప్పారు.

‘‘ఆయన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రంలో పీడీపీతో పొత్తు కుదిర్చారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుపులో చురుగ్గా పనిచేశారు. సొంత రాష్ట్రంలోనూ ఆయన పనిచేయరని చెప్పలేం. చేయడం సహజం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు వెనుక ఆర్ఎస్ఎస్ కృషి ఎంతో ఉందని హన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక జాతీయ వ్యవహారాల ఎడిటర్ డబ్ల్యూబీ చంద్రకాంత్ విశ్లేషించారు.

‘‘అక్కడి కనీస సదుపాయాలు లేని ప్రజలకు విద్య, వైద్యం అందించడంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కృషి చేశాయి. స్థానికుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఎన్నికల్లో దాని ఫలితం బీజేపీకి దక్కింది. అంతే తప్ప ఈ విజయాన్ని ఒక్కరికే పరిమితం చేయలే’’మని ఆయన అన్నారు.

‘‘ఈశాన్య రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, పరిస్థితులు భిన్నమైనవి. అక్కడి వ్యూహాలు ఇక్కడ పని చేయవు. తెలుగు రాష్ట్రాల బాధ్యతలు రామ్‌ మాధవ్‌కు అప్పగిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించలేం’’ అని అన్నారు.

Image copyright BJP-Twitter

'వస్తే బీజేపీ బలం పెరుగుతుంది'

ఈశాన్య భారత్‌లో బీజేపీ విజయం వెనుక తెలుగు వ్యక్తి కీలకపాత్ర పోషించడం తమకెంతో గర్వకారణమని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘రామ్‌ మాధవ్‌కు తెలుగు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే బీజేపీ బలం పెరుగుతుంది. మేం ఆయన నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటీవల రామ్‌ మాధవ్‌ ఏపీలో రాజకీయ పరిస్థితులపై మంత్రి మంత్రి మాణిక్యాల రావుతో చర్చించారు. ఆయన తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది’’ అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)