బీజేపీకి ఇది స్వర్ణయుగమా?

  • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
  • బీబీసీ ప్రతినిధి

ఇక కేంద్రంలో నడిచేవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే అని అంతా అనుకుంటున్న సమయంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. లోక్‌సభలో ఆ పార్టీ బలం 275 సీట్లు. దేశంలో 29 రాష్ట్రాలకు గాను బీజేపీ, దాని మిత్ర పక్షాలు కలసి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఇది బీజేపీకి స్వర్ణ యుగమా?

2014లో కేంద్రంలో కమలం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత సొంతంగా లేదా మిత్ర పక్షాలతో కలసి.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, గోవా, త్రిపుర, నాగాలాండ్‌ల్లో అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే అక్కడ అధికారం చేపట్టింది.

కర్ణాటకలోనూ బీజేపీ నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావటంతో.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకొచ్చింది.

చత్తీశ్‌గఢ్, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2013 నుంచే అధికారంలో కొనసాగుతోంది. అంటే.. ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం నడుస్తోంది.

ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిజోరంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి.

త్రిపుర విజయం ప్రత్యేకం

వరుసగా ఎన్ని విజయాలు, అపజయాలు ఎదురైనా త్రిపురలో బీజేపీ సాధించిన విజయం ప్రత్యేకమని, దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీబీసీ మరాఠీ ఎడిటర్ ఆశిష్ దీక్షిత్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘త్రిపుర వామపక్ష భావజాల రాష్ట్రం. దశాబ్దాలుగా లెఫ్ట్ పార్టీలకు ఓట్లేయటానికి అలవాటు పడిన ప్రజల ఆలోచనా ధోరణిని మార్చటం అంత సులభం కాదు. కానీ, బీజేపీ ఆ విషయంలో విజయం సాధించింది. బీజేపీ ఇప్పటి వరకూ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచినా.. తొలిసారి వామపక్ష ఆధిపత్య రాష్ట్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ వంటి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గెలవటం సులభమేమో కానీ సీపీఎం వంటి వామపక్ష పార్టీని ఓడించి అధికారం పొందటం మాత్రం అంత సులభం కాదు. అందుకే ఈ విజయం ప్రత్యేకం’’ అని చెప్పారు.

ఈ ఫార్ములా అన్నిచోట్లా పనికొస్తుందా?

త్రిపురలో బీజేపీ విజయంపై ట్రిబ్యూన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ కేవీ ప్రసాద్ స్పందిస్తూ.. ‘‘స్థానిక పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుని, వాటికి తగ్గట్లుగా ప్రణాళికలు రచించటంలో బీజేపీ విజయం సాధించింది. త్రిపురలో మూడేళ్ల నుంచి ఆర్ఎస్ఎస్ ద్వారా పార్టీలోకి వచ్చిన సునీల్ దేవ్‌ధర్‌ బీజేపీని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు’’ అని చెప్పారు.

అయితే, ఇదే ఫార్ములా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీశ్‌గడ్‌ల్లో కూడా పనికొస్తుందా? అని అడగ్గా.. ‘‘అక్కడి పరిస్థితి వేరు. మధ్యప్రదేశ్, చత్తీశ్‌గడ్‌ల్లో గత 15 సంవత్సరాలుగా, రాజస్థాన్‌లో గత ఐదేళ్లుగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గినప్పటికీ.. ఆ పార్టీయే గెలిచింది. ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారనేది చూడాలి’’ అని చెప్పారు.

వింధ్య పర్వతాలను దాటగలరా?

‘‘వింధ్య పర్వతాల కింద ఉన్న దక్షిణాదిలో కూడా బీజేపీ కష్టపడుతోంది. అయితే, అది ఎంత వరకూ విజయాన్ని సాధిస్తుందనేది చూడాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో సీట్లు తగ్గొచ్చు. ఆ మేరకు సీట్లు పెద్దగా రాని దక్షిణాదిలో బలపడాల్సి ఉంటుంది’’ అని ప్రసాద్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), కర్నాటక (28), తమిళనాడు (39), కేరళ (21), పాండిచ్చేరి (1), అండమాన్ నికోబార్ (1), లక్షద్వీప్‌(1) ల్లో మొత్తం 133 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటికి తోడు తూర్పున ఉన్న ఒడిశా (21), పశ్చిమ బెంగాల్ (43) లోక్‌సభ స్థానాలను కూడా కలుపుకుంటే.. మొత్తం 197.

స్వర్ణయుగం.. అప్పుడే

అయినప్పటికీ బీజేపీకి ఇది స్వర్ణయుగం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నారు.

ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్‌లో బీజేపీ కొత్త జాతీయ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీ అంటే హిందీ బెల్ట్ పార్టీ అని పిలిచేవారు. కానీ, గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర, మణిపూర్‌ల్లో గెలుపొందాం. ఇక కర్నాటకలోనూ గెలుస్తాం. బెంగాల్, కేరళ కార్యకర్తలు కూడా ఆనందంగా ఉన్నారు’’ అని చెప్పారు.

అయితే, స్వర్ణయుగం మాత్రం ఇప్పుడు కాదని ఆయన అన్నారు. ‘‘కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గెలిచినప్పుడే స్వర్ణయుగం’’ అని ఆయన తెలిపారు.

ఎందుకలా అన్నారంటే..

కర్నాటకలో బీజేపీ ఒకప్పడు అధికారంలో ఉంది. ఒడిశాలో కూడా స్థానిక ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో మినహాయిస్తే పశ్చిమ బెంగాల్, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా కార్యకర్తల బలం లేదని బీబీసీ తమిళ ఎడిటర్ తంగవేల్ అప్పాచీ చెప్పారు.

‘‘హిందీ బెల్ట్‌లో 2014లో గెలిచినన్ని సీట్లు 2019లో గెలవకపోవచ్చు. కాబట్టి 197 సీట్లున్న రాష్ట్రాల్లో ఈసారి గణనీయంగా విజయం సాధించాల్సి ఉంటుంది. పైగా, ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. తమిళనాడులో రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావించొచ్చు. అలా జరిగినా కూడా ఎంత విజయవంతం అవుతారనేది ప్రశ్నార్థకమే. మిగతా రాష్ట్రాల్లో ఆ మాత్రం అవకాశాలు కూడా ఇప్పటికిప్పుడు కనిపించటం లేదు. బీజేపీకి స్వర్ణయుగం రావాలంటే ఈ సమస్యలను అధిగమించేందుకు చాలా కష్టపడి వ్యూహాలు రచించాలి. ఆ వ్యూహాలన్నీ ఎన్నికల్లో పనిచేసి విజయం సాధించాలి. ఇదంతా బీజేపీ అధిష్టానం పెద్దలకు బాగా తెలుసు. కాబట్టే ఇప్పుడు నడుస్తున్నది స్వర్ణయుగం కాదని అమిత్‌షా చెప్పారని భావించవచ్చు’’ అని తంగవేల్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)