#గమ్యం: పరిశోధనపై ఆసక్తి ఉందా..! ఈ ఉపకారవేతనం మీలాంటి వారికోసమే

  • 4 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపరిశోధనపై ఆసక్తి ఉందా..! ఈ 'స్కాలర్‌షిప్’మీ కోసమే

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం. ఫ్యాషన్ టెక్నాలజీ, మెడిసన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో కెరీర్, కోర్సుల గురించి ఇప్పటివరకు చర్చించాం.

ఈ వారం సైన్సులో పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపయోగపడే 'కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన' ఉపకారవేతనం గురించి తెలుసుకుందాం.

దీనిపై Careers360.com డైరెక్టర్ లక్ష్మి అందించే వివరాలు మీకోసం. మీ సందేహాలు, ప్రశ్నలను బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ బాక్సులో పోస్ట్ చేయండి.

విద్యార్థి దశలోనే సైన్స్ పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం అందించే స్కాలర్‌షిప్ 'కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన'. దీన్నే సంక్షిప్తంగా 'కేవీపీవై' అంటారు. సైన్సులో ప్రతిభ చూపే విద్యార్థులను గుర్తించి పరిశోధనల దిశగా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం.

దీనికోసం రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తిస్తారు. ఎంపికైన వారికి బ్యాచిలర్ డిగ్రీ నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు ఉపకారవేతనం అందుతుంది.

ఈ ఉపకారవేతనానికి ఎంపికైన వారికి తొలి మూడేళ్లు, అంటే డిగ్రీ స్థాయిలో నెలకు రూ. 5 వేలు స్టైపండ్ ఇస్తారు. దీనికి అదనంగా వార్షిక గ్రాంటు రూ.20 వేలు ఇస్తారు.

చివరి రెండేళ్లు, అంటే పీజీ స్థాయిలో నెలకు రూ.8 వేల చొప్పున స్టైపండ్ ఇస్తూ వార్షిక గ్రాంటు రూ.28 వేలు ఇస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే వారూ కేవీపీవై ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు

ఎవరు అర్హులు

* ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివేవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

* విద్యార్హతల ఆధారంగా మూడు విభాగాల్లో రాత పరీక్ష ఉంటుంది. ఎస్ఏ, ఎస్ఎక్స్, ఎస్‌బీ అనే మూడు స్ట్రీమ్స్ ఉంటాయి.

1) స్ట్రీమ్ ఎస్‌ఏ: ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2018-19లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం లేదా పదకొండో తరగతిలో చేరిన విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు.

* పదో తరగతి బోర్డు పరీక్షల్లో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లలో సగటున 80 శాతం మార్కులు సాధించినవారు అర్హులు. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు 70శాతం మార్కులు వస్తే చాలు. ఎంపికైన విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో ఉన్న సమయంలో సమ్మర్ క్యాంపులకు వారిని ఆహ్వానిస్తారు.

2) స్ట్రీమ్ ఎస్‌ఎక్స్: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియల్ రెండో సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు.

3) స్ట్రీమ్ ఎస్‌బీ: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బి.మ్యాథ్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ ప్రవేశం పొందేవారు ఈ విభాగంలోకి వస్తారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆప్టిట్యూడ్ టెస్టులో అర్హత మార్కులు 45 శాతం సాధించాల్సి ఉంటుంది

ఎంపిక ఇలా..

మూడు విభాగాల్లోనూ అర్హులైన దరఖాస్తుదారులకు జాతీయ స్థాయి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అర్హత మార్కులు 45 శాతం సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కొందరిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైతే ఉపకారవేతనానికి అర్హత సాధించినట్లే.

ఎంపికైన తరువాత ప్రతి విద్యా సంవత్సరంలోనూ సైన్స్ సబ్జెక్టుల వార్షిక పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే కనీసం 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు 50 శాతం కనీస మార్కులుండాలి. నిర్దేశిత శాతంలో మార్కులు సాధించలేకపోతే తరువాత ఏడాదికి ఉపకారవేతనం కొనసాగించరు.

అయితే, ఉపకారవేతనం అందని ఏడాదిలో మళ్లీ మార్కులు సాధించినట్లయితే ఆ తరువాత ఏడాదిలో అంటే మూడో ఏడాది ఎప్పటిలా స్కాలర్‌షిప్ దక్కుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కొన్ని కోర్సులకే ఈ ఉపకారవేతనం వర్తిస్తుంది

సమ్మర్ ప్రోగ్రాం

ఈ ఉపకారంవేతనానికి దరఖాస్తు చేసినవారు రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించడంతో పాటు తప్పనిసరిగా బీఎస్సీ, బీఎస్, బీ స్టాట్, బీ మ్యాథ్స్ కోర్సుల్లో ఏదో ఒకదానిలో చేరాలి. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్- కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, సెల్ బయాలజీ, ఎకాలజీ, మాలిక్యులార్ బయాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజియాలజీ, బయోటెక్నాలజీ, న్యూరోసైన్సెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, మెరైన్ బయాలజీ, జియాలజీ, హ్యూమన్ బయాలజీ, జెనెటిక్స్, బయో మెడికల్ సైన్సెస్, అప్త్లెడ్ ఫిజిక్స్, జియో ఫిజిక్స్ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఈ కోర్సులకే ఉపకారవేతనం వర్తిస్తుంది.

ఈ ఫెలోషిప్‌లో ఉన్నవారికి వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తారు. ఐఐటీలు వంటి ప్రతిష్థాత్మక సంస్థల్లో వీటిని నిర్వహిస్తారు.

అక్కడ సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో నిపుణులతో ప్రత్యేక ఉపన్యాలు ఇప్పిస్తారు.

విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు.

సైన్స్‌లో పరిశోధనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, శాస్త్రవేత్తలతోనూ భేటీలు ఏర్పాటు చేస్తారు. కెరీర్ అవకాశాలనూ వివరించే ప్రోగ్రాం ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేవీపీవైకు ఎంపికైనవారికి ఇచ్చే గుర్తింపు కార్డుతో జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాల లైబ్రరీలు, ప్రయోగశాలల్లో సౌకర్యాలను వినియోగించుకోవచ్చు

ప్రత్యేక ప్రయోజనాలు

* కేవీపీవైకు ఎంపికైన వారికి ఇచ్చే గుర్తింపు కార్డుతో జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాల లైబ్రరీలు, ప్రయోగశాలల్లో సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

ప‌రీక్ష‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో రాసుకోవ‌చ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌ ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)