ప్రెస్‌ రివ్యూ: బలమైన ప్రత్యామ్నాయ కూటమి కోసం పనిచేస్తా- కేసీఆర్

  • 4 మార్చి 2018
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ Image copyright TELANGANA CMO/FACEBOOK

కాంగ్రెస్‌, బీజేపీ దొందూదొందేనని, పథకాల పేర్లు మారడం తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు రాదని, వాటికి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి కోసం తాను పనిచేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారని 'ఈనాడు' రాసింది.

''ఈ విషయమై మాట్లాడాల్సిన వారితో మాట్లాడుతున్నాను. దేశానికి నా అవసరం ఉందనుకుంటే సేవలందించేందుకు వెనుకాడబోను. దేశంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొత్తగా వచ్చేది మూడో కూటమి కాదు, ఇదే ప్రధాన కూటమి కావచ్చు'' అని ఆయన శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టత ఎందుకు ఇవ్వరు?

''ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ వాళ్లు, కేంద్రంలోని బీజేపీ వాళ్లు స్పష్టత ఇవ్వరు. ఏమిటీ తమాషా? 'నేను కొట్టినట్లు చేస్తా... మీరు ఏడ్చినట్లు చేయండి' అన్నట్లుగా ఉంది. ఇలాంటి రాజకీయాలను మార్చాలనే నేను చెప్పేది. ఇలాంటి దురదృష్టకరమైన, దిక్కుమాలిన పరిస్థితులు ఉండకూడదు. ప్రజలకు ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాలి. దాన్ని అమలు చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తాను అనుంటే ఇచ్చి తీరాలి. ఇచ్చే ఉద్దేశం లేకుంటే అది కచ్చితంగా చెప్పాలి. ప్రతి రోజు ఏపీ ప్రజలు, పార్టీలు ఆవేదనపడడం ఎందుకు? ఏ దేశంలోనైనా ఇలాంటి సందిగ్ధత ఉందా? ఈ దేశంలో నాయకులు ప్రజలను వంచిస్తున్నారు. ప్రజలు ఈ వంచనలోంచి బయటపడాలన్నదే నా తపన'' అని కేసీఆర్ చెప్పారు.

Image copyright Symbiosis
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

యూట్యూబ్‌లో తెలుగు యువత జోరు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల నుంచి విభిన్న రకాల వీడియోలు సృష్టిస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న యువత సంఖ్య గణనీయంగా పెరిగిందని, అన్ని రకాల వీడియోలు వీక్షించే వారి సంఖ్య కూడా ఈ రాష్ర్టాల్లో పెరుగుతోందని భారత్‌లో యూట్యూబ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హెడ్‌ సత్య రాఘవన్‌ తెలిపారని 'ఆంధ్రజ్యోతి' రాసింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం లాంటి నగరాల నుంచే కాకుండా చిన్న గ్రామాల్లోని ఔత్సాహికులు కూడా తమ ప్రాంత సంస్కృతి, మాండలికాలకు సంబంధించిన వీడియోలను సృష్టిస్తూ వీక్షకుల ఆదరణను పెద్దయెత్తున చూరగొంటున్నారని ఆయన హైదరాబాద్‌లో 'యూట్యూబ్‌ ఫ్యాన్‌ఫెస్ట్‌' సందర్భంగా మీడియాతో చెప్పారు.

సంగీతం, సాంకేతిక పరిజ్ఞానం, నృత్యం, ఆరోగ్యం, ఆటో, విద్య తదితర విభాగాల్లో అన్ని భాషలకు చెందిన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆయా భాషల్లో ఎక్కువ పాపులర్‌ అయిన యూట్యూబ్‌ వీడియోల సృష్టికర్తలను అభిమానులకు పరిచయం చేసేందుకు యూట్యూబ్‌ ఫ్యాన్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నామని సత్య రాఘవన్ వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చార్మినార్

హైదరాబాద్: మార్చి 10 తర్వాత 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ వాడరాదు

హైదరాబాద్‌లో ఈ నెల పదో తేదీ తర్వాత 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

తయారీదారులు, విక్రయదారులు 50 మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్‌కు సంబంధించి వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని, లేదంటే దుకాణాలు, పరిశ్రమలను సీజ్ చేయడంతోపాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

హైదరాబాద్‌లో సుమారు 800 వరకు ప్లాస్టిక్ తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం పది శాతం మాత్రమే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో వివరాలు నమోదు చేసుకున్నట్టు మేయర్ చెప్పారు.

పెరుగుతున్న ఎండలు

ఫిబ్రవరి ముగిసి వారమైనా కాకముందే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచే ఎండ ఎక్కువగా ఉంటోందని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది. పడమటి వైపు నుంచి వీస్తున్న గాలులతో వాతావరణం వేడిగా మారుతోందని చెప్పింది.

''పొడిగాలులు వీస్తుండడంతో మధ్యాహ్న సమయానికి అనేక చోట్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. శనివారం కృష్ణాజిల్లా నందిగామలో 39.3 డిగ్రీలు, కర్నూలు, జంఘమహేశ్వరపురంలలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి చల్లని వాతావరణం కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శీతాకాలం ముగింపు, వేసవి ప్రారంభ సమయంలో వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు'' అని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)