‘‘భారత్‌ గురించి నాకు ఏమీ తెలియదు. నాగాలాండ్ దాటి మా ఇంట్లో వాళ్లు ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు’’

  • 4 మార్చి 2018
అలే మెహతా

ఈశాన్య భారత్‌లోని నాగాలాండ్‌లో ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే.

అయితే, ఇక్కడి ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాల వారు వివక్షతతో చూస్తారని తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి.

ఈ నేపథ్యంలో నాగా ప్రజలు భారతీయత గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి బృందం వారిని సంప్రదించింది.

అలే మెహతా, 35

భారత్‌లోని చాలా పట్టణాల్లో ఎన్నో ఏళ్లుగా నేను పనిచేశాను. నాది నాగాలాండ్ అని తెలిస్తే చాలు.. ఓహ్ మీరు కుక్కలు, పాములు తింటారా? అని అడుగుతారు. వాటిని తినడం అనాగరికమని చెబుతుంటారు.

"మీరు పందులను ఎలా తింటారు? వాటిని చూస్తేనే అసహ్యం వేయదు?" అని అంటారు.

వారి మాటలకు నేను అభ్యంతరం చెప్పను. మేం పంది మాంసం తింటాం. అది చాలా రుచికరంగా ఉంటుంది.

మా ఆహారపు అలవాట్లు వాళ్లకంటే భిన్నంగా ఉంటాయి. అందుకే వాళ్లు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. అందుకే మా జీవన విధానం, సంస్కృతి గురించి వాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తుంటా.

ఇంకో విషయం, నేను కుక్క మాంసం తినను, వాటిని చాలా ముద్దుగా చూసుకుంటా.

కొందరు ఇతరుల సంస్కృతి తెలుసుకోడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొందరు ఇండియన్లు ఈశాన్య ప్రాంతానికి వచ్చి ఇక్కడి విషయాలను తెలుసుకుంటారు. మా ఆతిథ్యం చూసి వారు పొగుడుతుంటారు.

నేను భారతీయురాలుని కాదనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. భారత దేశ చిత్రపటంలో నాగాలాండ్ కూడా ఉంది కదా..

అవును, నేను నాగానే.. అంతమాత్రానా భారతీయురాలిని కాకుండా పోతానా.. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివస్తున్నారో మేం అలానే నివసిస్తున్నాం.

ఇలా చెప్పడానికి అసహ్యంగానే ఉంది. కానీ, చెప్పక తప్పదు. దేశంలోని ఇతర ప్రాంతాల వారు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు.

పని ప్రదేశాల్లోనూ మా పట్ల వివక్షత కనిపిస్తుంది. గతంలో నేను దేశ రాజధాని దిల్లీలోని ఒక కంపెనీలో పనిచేశాను. అక్కడ నాకంటే తక్కువ చదువుకున్నవారికి, నా స్థాయిలో పనిచేయని వారికి కూడా నాకంటే ముందే పదోన్నతులు వచ్చాయి.

యకుజా సోలో, 31

8 ఏళ్లు కోల్‌కతాలో పనిచేశా. నేనైతే ఎప్పుడూ వివక్షత ఎదుర్కోలేదు.

కొన్నివిధాలుగా మేం వారికంటే భిన్నంగా ఉంటామని వాళ్లు భావిస్తారు. మేం కూడా వాళ్లను చూసి అలానే అనుకుంటాం.

షీ యంగ్, 74

నేను రైతును, నాకు ఆరుగురు పిల్లలు. నాగాలాండ్ దాటి బయటకి వెళ్లలేదు.

మేం అంతా నాగాలాండ్‌లోనే ఉంటాం. నాగాలాండ్ అవతల భారత్‌ గురించి నాకు పెద్దగా తెలియదు. నా పిల్లలను నాగాలాండ్ దాటికి బయటకు పంపించడం కూడా ఇష్టం లేదు. అక్కడివారు వీళ్ల పట్ల తప్పుగా ప్రవర్తిస్తారని భయంగా ఉంది.

నేను భారతీయుడ్ని, నాగాలాండ్ పౌరుడ్ని రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ జీవితంతో చాలా తృప్తిగా ఉన్నా. చావు కోసమే ఎదురు చూస్తున్నా.

రిచా, 30

కర్నాటకలోని ఓ మెడికల్ కాలేజీలో చదువుకున్నా. అక్కడ ఏడేళ్లు ఉన్నా. భారత్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లా.

భారతీయుడిగా ఉండటం అనేది నా జాతీయత. దేశం విడిచి వెళితే అదే నా గుర్తింపు కూడా. నాగా వాసిగా మా రక్తం, జాతి, వంశంలో ఈ ప్రాంతం మమేకమై ఉంది. ఇది కూడా నా గుర్తింపే.

దేశానికి దూరంగా, వేరుగా ఉన్నామని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే, ఈశాన్య ప్రజలపై వివక్ష చూపిస్తున్నారని ఎక్కడైన విన్నా, చదివినా నాకు బాధగా అనిపిస్తుంది.

కానీ, నాకు దేశంలోని అన్ని ప్రాంతాలలో చాలా మంది స్నేహితులున్నారు. అప్పుడప్పుడు వాళ్లు ఇక్కడికి, నేను వారి ప్రాంతానికి వెళుతుంటాం.

అవగాహన లోపం వల్లే దేశంలోని ఇతర ప్రాంతాల వారు మా మీద వివక్షత చూపిస్తుంటారు. చూడటానికి కూడా మేం కాస్త భిన్నంగా ఉంటాం.

చాలా మందికి అసలు నాగాలాండ్ గురించి, ఇక్కడి సంస్కృతి గురించి తెలియదు. వారి పాఠ్య పుస్తకాల్లో కూడా మా ప్రాంతం గురించి పెద్దగా ఉండదు.

అకుయి, 80

ఇక్కడ నేను మిర్చి, బత్తాయి, అరటిపళ్లు అమ్ముతుంటా. ఇంకో 20 ఏళ్లైతే నాకు వందేళ్లు నిండుతాయి. ఈ జీవితంతో సంతోషంగా ఉన్నా.

మీరెప్పుడు నాగాలాండ్ వచ్చినా నేను ఇక్కడే కనిపిస్తా. నాగాలాండ్ దాటి వెళ్లిందే లేదు. కనీసం మా ఊరు దాటి కూడా బయటకు వెళ్లలేదు. మా ఊరిలో అందరూ నిరక్షరాస్యులే.

మాకు బయటకు వెళ్లాల్సిన అవరసమే లేదు. భారత్ గురించి నాకేమీ తెలియదు. నాగా ప్రజల గురించి మాత్రం తెలుసు. భారతీయత అంటే ఏమిటో నేనెప్పుడు ఆలోచించలేదు.

అఫాన్, 80

భారత్‌ గురించి నాకు ఏమీ తెలియదు. నాగాలాండ్ దాటి మా ఇంట్లో వాళ్లు ఇప్పటి వరకు బయట అడుగు పెట్టలేదు. నా పిల్లలను కూడా ఈ ప్రాంతం దాటి బయటకు వెళ్లనీయను.

నా అవసాన దశలో వాళ్లు ఇక్కడే ఉండాలని నా కోరిక. ఇండియా, నాగాలాండ్, బర్మా అంతా ఒకేలా ఉంటాయి. ( వీరి నివాసం బర్మా సరిహద్దుల్లో ఉంటుంది.)

కొన్నేళ్ల కిందట ఓ యుద్ధంలో మా తెగ ఇంకో గిరిజన జాతిపై గెలిచినప్పుడు ఈ పచ్చబొట్టు వేసుకున్నా. తినడం, తాగడం, సంగీతం నాకిష్టమైన వ్యాపకాలు. జీవితం ఇక్కడ సంతోషంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు