అక్కినేని అమల: హుందాగా వయసును ఆహ్వానిద్దాం

  • 8 మార్చి 2018
అక్కినేని అమల Image copyright AkkineniAmala

సినీ తార శ్రీదేవి మరణం పట్ల మీడియా ప్రతిస్పందించిన తీరు పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ తార అమల అక్కినేని ఫేస్‌బుక్‌లో 'నన్ను హుందాగా వయస్సును ఆహ్వానించనివ్వండి' అనే పోస్ట్ రాసి మహిళల మనోగతాన్ని విశ్లేషించారు.

ఈ పోస్ట్ ఎందుకు రాయాల్సి వచ్చింది, రాయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం, అమల టెలిఫోన్ ఇంటర్వ్యూలో బీబీసీతో పంచుకున్నారు.

సినీ తారలు, ప్రముఖులు అందంగా కనిపించాలి అనే ఒత్తిడి ఉందని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగినపుడు "అందంగా కనిపించాలనే ఒత్తిడి కేవలం సినీ తారలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచం అంతా ఇలానే ఉంది. అన్ని వర్గాలలోనూ బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత ఎక్కువగానే ఉంది. అందరికీ అందం గా కనిపించాలనే ఉత్సాహం ఉంది. ఏదో వ్యక్తిగత చర్చ అయితే తప్ప, మనుష్యుల మధ్య జరిగే సంభాషణలన్నీ పై పై మెరుగులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి తప్ప, లోతుగా జరగటం లేదు" అని అమల అన్నారు.

ఈ ధోరణి ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారిలో ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ, అన్ని వర్గాలలోనూ అందానికి ఆకర్షితులవుతూనే ఉంటారు అని అన్నారు.

తన పోస్ట్‌లో పుష్పక్ సినిమాలో తాను పొడవాటి కురులతో ఉండేదానినని కానీ ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే సాధ్యం కాని పని కదా అంటూ, యవ్వనంలో ఎవరైనా అందంగానే ఉంటారు. కానీ అదే అందం వయసు పెరిగే కొద్దీ ఉండాలంటే కుదరని పని. వార్ధక్యం రాకూడదనే ప్రయత్నంతో అందంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు మారిపోయారు, అప్పట్లా లేరు అని. కాలాన్ని బంధించలేము కదా", అని అందంగా ఉండాలనే ప్రయత్నం మహిళలకి ఎక్కువగా ఉంటుందా అని అడిగినపుడు సమాధానమిచ్చారు.

అందంగా ఉండాలనే ఒత్తిడి కేవలం సినీ తారలకు మాత్రమే పరిమితం కాదంటూ, "నేను వ్యక్తిగతంగా గమనించాను, మొదటి పలకరింపుతోనే, ఏమిటి నల్లగా అయిపోయావు, లావుగా అయిపోయావు లాంటి బాహ్య సౌందర్యానికి సంబందించిన ప్రశ్నలు సంధిస్తారు. ఇది నాకు మాత్రమే ఎదురయ్యే పరిస్థితి కాదు. లోక తీరే అంత. నా బాహ్య సౌందర్యంతో పని ఏముందని, నా అంతః సౌందర్యం లో ఎటువంటి మార్పు లేనపుడ?’’ అని అమల ప్రశ్నించారు.

Image copyright AkkineniAmala

మహిళలకి తమ శరీరంపై అధికారం ఉందా అని ప్రశ్నించినపుడు, ఖచ్చితంగా ఉంది అంటూ.. "మహిళలు తమ శరీరంపై తమకున్న అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి. ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. దాని అర్ధం ఏదో ఒక నిర్ణీత సైజుకి, ఆకృతికి కట్టుబడి ఉండాలని కాదు. కానీ పొద్దున్న నిద్ర హాయిగా లేవగలగడం, సునాయాసంగా నిద్రపోగలగడం, వయస్సుతో మెలగగలగడం, మోకాలి నొప్పులు, అలసట లేకుండా నాలుగు అడుగులు వేయగలగడం, తన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించగలగడం చాలా ముఖ్యం. అసలు, నేను ఆ పోస్ట్ రాయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఇదే" అని తెలిపారు.

సమాజం పట్ల విశాల దృక్పధం అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కోవచ్చు అంటూ, "చాలా మంది టీవీ జర్నలిస్టులు నా దగ్గరకి వచ్చి నన్ను అడిగే ప్రశ్న, మీరు నాగార్జున కి ఏమి వండుతారు అని, నేను వండను, మా వంటమ్మాయి వండుతుంది అని చెప్పినపుడు వాళ్ళు కాస్త నిరుత్సాహ పడతారు’’ అని చెప్పారు.

సమాజం ఎంత ఎక్కువ విభిన్న విధానాలను చూడడానికి అలవాటు పడితే దృక్ఫధాలు కూడా అంత విశాలంగా మారే అవకాశం ఉంది అని అమల అన్నారు.

నేనైతే నాకు నచ్చని సంభాషణలను సామాజిక అంశాలపై మరలుస్తాను. ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే అంశం మహిళల పైనే ఆధార పడి ఉంది", అని మహిళలు సమాజపు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు.

సమాజం లో నాటుకున్న స్టీరియోటైప్ ఆలోచనలు నిర్మూలించే బాధ్యత కళాకారుల పైన ఉందంటారా? అని అడిగినపుడు.. "ఒక వయస్సు వచ్చేసరికి పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కనలేదా, వంట చేయదా వంటి ప్రశ్నలు చాలా సాధారణం ఈ సమాజంలో. ప్రతి మహిళా ఈ స్టీరియోటైప్ విధానాలను ఎదుర్కొంటుంది. సినీ పరిశ్రమ సమాజం కోసం పని చేయాలి. కానీ ఇక్కడ ఉండే సాధక బాధకాలు ఇక్కడ ఉన్నాయి. ఎవరి ఉనికి వారు కాపాడుకోవడం వంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి. కొంత మంది ఒక సినిమా తర్వాత మళ్ళీ కనిపించరు. సినిమా భవిష్యత్తుని మార్చడానికి కళాకారులను, పరిశ్రమని చైతన్యవంతం చెయ్యాలి" అని అన్నారు.

"ఒక్క సినీ పరిశ్రమకి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉంది. సెలబ్రిటీస్ కూడా అందరి లాగే మామూలు మనుష్యులు. వాళ్ళని కూడా ఈ సామాజిక బాధ్యత పట్ల చైతన్యవంతం చేస్తే వారి పాత్ర వారు పోషిస్తారు’’ అని అన్నారు.

Image copyright facebook/AkkineniAmala
చిత్రం శీర్షిక కుటుంబ సభ్యులతో అక్కినేని అమల

"సినీ పరిశ్రమ గ్లామర్ పరిశ్రమ అనేది ఒక వాదన, కానీ ఇదొక కళ కూడా. నటీ నటులు వారి ఆరోగ్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవడం ముఖ్యమే! కొంత మంది పుట్టుకతోనే అందంగా పుడతారు. కొంత మంది ఆ అందం కోసం చాలా శ్రమించాల్సి వస్తుంది. ఒక పాత్రకి సరిపోయే విధంగా వ్యక్తిత్వం ఉండటం ముఖ్యం కానీ, బాహ్య సౌందర్యం కాదు" అని అభిప్రాయపడ్డారు.

"మనం మనదైన ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని, మనకి నచ్చిన తరహాలో జీవిస్తే సినిమా అయినా జీవితం అయినా ఆసక్తిగా మారుతుంది" అని అన్నారు.

ముందు మనమంతా ప్రత్యేకం అని గుర్తించగలగాలి. అందానికి మించి చాలా విషయాలు ఉన్నాయి ఆదర్శం గా తీసుకోవడానికి. ధైర్యం, శక్తి, తెలివితేటలు, సామాజిక బాధ్యత వంటి వాటిని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా అని సలహా ఇచ్చారు.

"నేను నా వరండాలో కూర్చుని, పొద్దున్న కాఫీ తాగుతూ ఆ పోస్ట్ రాసాను. నేను రాసిన దానిలో చాలా మంది తమని తాము చూసుకుని నాకు ఫోన్ చేశారు. నాకు అది చాలా ఆనందం గా అనిపించింది. నేను మహిళలని వారి కధలను రాయమంటాను. స్టీరియోటైప్‌లను పోగొట్టడానికి కృషి చేస్తున్న మహిళలకి సహకరించి ప్రోత్సాహం ఇవ్వాలంటాను. మనమంతా బాహ్య సౌందర్యాన్ని దాటి అంతః సౌందర్యాన్ని ప్రతిబింబించే సంభాషణలు చేయాలంటాను" అని పేర్కొన్నారు

"రచన ఒక మనిషి ఆలోచనలకూ అద్దం పడుతుంది. ఇది ఒక సాధనలా పని చేస్తుంది. అలా అని సోషల్ మీడియా లో రాసే ప్రతిదీ పోస్ట్ చేయాలని నా ఉద్దేశ్యం కాదు" అని అన్నారు.

రచనల ద్వారానే స్టీరియోటైప్ విధానాలను, ఆలోచనలకు అంతం పలకగలమని నా ఉద్దేశ్యం అని మహిళలకి సందేశమిస్తూ అమల తన సంభాషణ ముగించారు.

Image copyright AkkineniAmala

అమల లేఖలో ఏముందంటే..

''నేనెంతగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాను.. నేనెంత బరువు పెరిగాననేది మాట్లాడకుండా నన్ను ప్రశాంతంగా కాలం గడపనిస్తారా?

నా కంటి కింద నల్లని ఛాయలకు రీడింగ్ గ్లాసెస్ కారణం.. ఇక ముడతలంటారా, అవి వయసు పెరగడంతో వచ్చినవి.

జీరో సైజులో లేనని ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నాకు నచ్చిన డ్రెస్సును వేసుకోనిస్తారా?

సీజన్‌కు తగ్గ దుస్తులు వేసుకుంటాను నేను.

జుత్తుకు రంగు వేసుకోకుండా ఉండనిస్తారా నన్ను? పందొమ్మిదేళ్ల వయసులో పుష్పక విమానం సినిమాలో పొడవుగా జారవిడిచిన కురుల గురించి ప్రస్తావించకుండా పొట్టి జుత్తుతో ఉండనిస్తారా నన్ను?

నా జుత్తు బాగులేకుంటే ఆ విషయాన్ని పట్టించుకుంటారు కానీ, నాకున్న జ్ఞానాన్ని పట్టించుకోరు. కెమేరాలు ఒక మనిషి లోతులను చూపించగలుగుతాయా?

నా వంట ఎలా ఉంటుంది? తాజా గాసిప్‌ల గురించి ప్రశ్నలు వేసి అవాంతరాలు సృష్టించకుండా అర్థవంతమైన అంశాల గురించి నన్ను మాట్లాడనిస్తారా?

భౌతికంగా నేను ఉనికి కోల్పోయేలోగా మార్పు దిశగా ఏదైనా విభిన్నంగా చేయాలని నా అంతరాత్మ కోరుకుంటోంది.

నా దారిలో నన్ను సాగనిస్తారా? నా జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది.

మనం చేసే ప్రతిపని చుట్టూ బిగుస్తున్న బాక్స్ ఆఫీస్ వేలంవెర్రి నుంచి, టీఆర్పీ రేటింగుల నుంచి, పేజ్ 3, లైకులు, కామెంట్లు, షేర్లు నుంచి నాకు స్వేచ్ఛ కల్పిస్తారా?

నా ఆత్మ స్వేచ్ఛగానే ఉంది కానీ, నన్ను మాత్రం కాలం, కీర్తి అనే పంజరంలో బందీని చేశారు.

నా జీవితాన్ని నన్ను జీవించనివ్వండి. మానవత్వంతో, నిజాయితీగా, ప్ర‌యోజ‌నకారిగా జీవించే స్వేచ్ఛ‌ను కల్పించండి''

- అక్కినేని అమ‌ల‌

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)