అతి పేద సీఎం మాణిక్ సర్కార్ స్థానాన్ని భర్తీ చేస్తోంది ఈయనే!!

  • 5 మార్చి 2018
బిప్లవ్ కుమార్ దేబ్, త్రిపుర Image copyright Twitter
చిత్రం శీర్షిక బిప్లవ్ కుమార్ దేబ్

రెండేళ్ల క్రితం వరకు త్రిపురలో బిప్లవ్ దేబ్ పేరు ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు ఆయన త్రిపుర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు చరమగీతం పాడడంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బిప్లవ్ కుమార్ దేబ్ కీలకపాత్ర పోషించారు.

నిజానికి ఇక్కడ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, రామ్‌మాధవ్ తదితరులంతా తలా ఒక్క చెయ్యి వేశారు.

అయితే రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి మాత్రం బిప్లవ్ దేబే.

త్రిపురలో సీఎం అభ్యర్థి పేరును ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జ్ రామ్‌మాధవ్ మాత్రం త్రిపుర సీఎం మార్చి8 న ప్రమాణస్వీకారం చేస్తారని ట్వీట్ చేశారు.

Image copyright TWITTER@BjpBiplab

పీఏ టు సీఎం !

బిప్లవ్ దేబ్ 1971లో గోమతి జిల్లాలో ఉదయ్ పూర్ సమీపంలోని కాక్రాబన్‌లో జన్మించారు. త్రిపుర యూనివర్సిటీ నుంచి 1999లో బీఏ పూర్తి చేశాక, దిల్లీ వెళ్లారు.

అక్కడే బిప్లవ్ దేబ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించారు. బిప్లవ్ దేబ్ తండ్రి హీరూధన్ దేబ్ జన్‌సంఘ్‌లో చురుకుగా పని చేసేవారు. బిప్లవ్ దిల్లీ వచ్చాక, ఆరెస్సెస్‌కు దగ్గరయ్యారు.

బిప్లవ్ దేబ్ గురించి మాట్లాడుతూ ఆయన భార్య నీతి దేబ్, ''బిప్లవ్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి సంఘ్ కార్యకర్తగా ఉన్నారు. గోవిందాచార్య అనుచరుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు'' అని తెలిపారు.

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు గోవిందాచార్య బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆ సమయంలో బిప్లవ్ దేబ్ ఆయన వ్యక్తిగత సహాయకుడు(పీఏ).

అప్పట్లో నరేంద్ర మోదీ సహా, బీజేపీ నేతలంతా గోవిందాచార్యను కలవడానికి వస్తుండేవాళ్లు. గోవిందాచార్య పీఏగా పని చేసే క్రమంలో ఆయనకు మిగతా నేతలందరితో సంబంధాలు ఏర్పడ్డాయి.

Image copyright Niti Deb
చిత్రం శీర్షిక భార్య నీతి దేబ్‌తో విప్లవ్ దేబ్

2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా త్రిపురలో బీజేపీ చాలా బలహీనమైన పార్టీ. 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన మాణిక్ సర్కార్‌ను ఢీ కొట్టే సత్తా ఎవరికీ లేదు.

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక, బీజేపీ ఈశాన్య రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించింది.

2015 ఏప్రిల్‌లో బీజేపీ బిప్లవ్‌ను ఆ రాష్ట్ర సమన్వయకర్తగా పంపింది. దీంతో 16 ఏళ్ల తర్వాత ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లారు. ప్రజలతో ఆయనకున్న సంబంధాలను చూసి 2016లో ఆయనను త్రిపుర బీజేపీ అధ్యక్షునిగా ప్రకటించింది పార్టీ.

దీంతో లెఫ్ట్ సర్కారును పడగొట్టి రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేశారు బిప్లవ్.

బిప్లవ్ దేబ్‌తో పాటు అతుల్‌దేబ్ వర్మ, రామప్రద జమాతియాలు కూడా సీఎం రేసులో ఉన్నా.. బిప్లవ్ దేబ్‌‌కే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.

Image copyright TWITTER/AMIT SHAH

మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా

అటు మేఘాలయ బీజేపీ అధికార ప్రతినిధి బసు చక్రవర్తి.. గవర్నర్ ఎన్‌పీపీ-బీజపీ కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించినట్లు బీబీసీతో తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 నిమిషాలకు ఎన్‌పీపీ నేత కాన్రాడ్ సంగ్మా సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు.

మేఘాలయలో 21 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించగా, 19 సీట్లలో ఎన్‌పీపీ, యూడీపీ నుంచి ఆరుగురు, 11 మంది ఇతరులు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.

2013 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 13 మందిని బరిలో నిలిపినా, ఒక్కచోటా విజయం సాధించలేదు.

Image copyright Twitter@SangmaConrad
చిత్రం శీర్షిక కాన్రాడ్ సంగ్మా

కాన్రాడ్ సంగ్మా ఎవరు?

కాన్రాడ్ సంగ్మా మాజీ లోక్‌సభ స్పీకర్ పీఏ సంగ్మా కుమారులు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ పోటీ చేయలేదు. ప్రస్తుతం ఆయన లోక్‌సభలో తురా నియోజకవర్గానిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పీఏ సంగ్మా కూతురు, కాన్రాడ్ సోదరి అయిన అగథా సంగ్మా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారని భావించారు. అయితే ఆశ్చర్యకరంగా కాన్రాడ్ పేరు తెర పైకి వచ్చింది. మార్చి 6వ తేదీన ఆయన మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Image copyright TWITTER/SHIVRAJ

నాగాలాండ్‌లో ప్రతిష్టంభన

మరోవైపు నాగాలాండ్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీపీపీ 18 చోట్ల గెలుపొందగా, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందింది. 60 మంది సభ్యుల సభలో తనకు 32 మంది సభ్యుల మద్దతు ఉందని ఎన్‌డీపీపీ నేత నిఫియు రియో అంటున్నారు.

అయితే 26 సీట్లు గెల్చుకున్న ఎన్‌పీఎఫ్‌కు చెందిన ప్రస్తుత సీఎం టీఆర్ జెలియాంగ్ మాత్రం అత్యధిక సీట్లు గెల్చుకున్న తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ పీబీ ఆచార్యకు విజ్ఞప్తి చేశారు. దీంతో తమను బలపరుస్తున్న సభ్యుల సంతకాలతో కూడిన లేఖను సమర్పించడానికి గవర్నర్ వారిద్దరికీ మంగళవారం వరకు సమయం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)